breaking news
samikyasankaravam
-
హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్
హెలెన్ పెను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న కుప్పంలో ప్రారంభించవలసిన సమైక్య శంఖారావం యాత్రను 30వ తేదికి మార్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయం శనివారం హైదరాబాద్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తు ఈ నెల 28 నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం యాత్రను కుప్పంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హెలెన్ తుఫాన్ బాధితులను పరామర్శించి, ఆ తర్వాత సమైక్య శంఖారావం యాత్ర చేపట్టాలని వైఎస్ జగన్ భావించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. -
'సోనియా రహస్య పుత్రుడు చంద్రబాబు'
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు చెలగాటమాడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి ఆరోపించారు.శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభానాగిరెడ్డి మాట్లాడుతూ... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కిరణ్, చంద్రబాబులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రవిభజన విషయంలో చంద్రబాబు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రహస్య పుత్రునిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను విమర్శించే ముందు తమ విధానాన్ని ఏంటో తెలియజేయాలని శోభానాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ సీనియర్ నేత, శాసన మండలిలో ఆ పార్టీ నేత యనమల రామకృష్ణకు జగన్ ఫోబియా పట్టుకుందని ఆమె పేర్కొన్నారు. నీకు ధైర్యముంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమైక్యమని చెప్పించగలవా అని యనమలను డిమాండ్ చేశారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖరావం యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించగానే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ కుప్పం వస్తే మీకెందుకంత భయం అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. విభజన నిర్ణయం వచ్చిన రోజు సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని శోభానాగిరెడ్డి అభిప్రాయపడ్డారు.