breaking news
salaries paid
-
పూర్తి వేతనాల చెల్లింపు ఉత్తర్వులు వెనక్కి
న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో వివిధ వాణిజ్య సంస్థలు, కంపెనీలు పనిచేయకున్నా సరే, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆదాయం లేని సమయంలో, పూర్తి వేతనాలు చెల్లించే స్తోమత లేని చాలా కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లకు ఊరట లభించినట్లయింది. వేతనాలు చెల్లించలేని కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
మన క్రికెటర్లకు ఢోకా లేదు
ముంబై: కోవిడ్–19 కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో సహజంగానే ఆ ప్రభావం అన్ని రంగాలపై పడింది. దాదాపుగా అన్ని టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడం లేదంటే వాయిదా పడటంతో క్రికెట్ బోర్డుల ఆదాయం ఆగిపోయింది. కరోనా కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్ల వేతనాల్లో కోత పడటం ఖాయమైంది. అయితే ఇలాంటి స్థితిలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆర్థికపరంగా తమ బలమేమిటో చూపిస్తూ భారత కాంట్రాక్ట్ క్రికెటర్లకు ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా వారి వేతనాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది తొలి మూడు నెలల వరకు మన ఆటగాళ్లకు ఇవ్వాల్సిన బాకీలన్నీ చెల్లించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘కష్టకాలంలో మన క్రికెటర్లు ఎవరూ సమస్యలు ఎదుర్కోరాదు. మార్చి 24 నుంచి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించగానే జరగబోయే పరిణామాలను బీసీసీఐ అంచనా వేసి దానికి అనుగుణంగా సిద్ధమైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్క రూపాయి బాకీ కూడా లేకుండా బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు చెల్లింపులు జరిపేశాం. దీంతో పాటు ఈ మధ్య కాలంలో భారత్, భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన ప్లేయర్లకు కూడా మ్యాచ్ ఫీజులు ఇచ్చేశాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తన ఆటగాళ్ల చెల్లింపులను వాయిదా వేయగా, ఇంగ్లండ్ క్రికెటర్లు ప్రభుత్వం సహకారం అందించే పథకం (ఫర్లాఫ్ స్కీమ్)కు దరఖాస్తు చేసుకున్నారు. ‘ప్రపంచం మొత్తం జీతాల కోత గురించే వినిపిస్తోంది. అయితే ఇన్నేళ్లుగా చేస్తున్నట్లే ఇప్పుడు కూడా బీసీసీఐ తమ ఆటగాళ్ల బాగోగులు అందరికంటే ఎక్కువ చూసుకుంటుంది. మా పరిధిలోని ఒక్క అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెటర్ కూడా బాధపడే పరిస్థితి రాకూడదు’ అని సదరు అధికారి వ్యాఖ్యానించారు. ఐపీఎల్ జరగాల్సిందే... మరోవైపు ఐపీఎల్‌తో ముడిపడి ఉన్న డబ్బును బట్టి చూస్తే ఈ ఏడాది చివర్లోనైనా టోర్నీ జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. అయితే ఇప్పటికే నిర్ణయమైపోయిన ఇతర టోర్నీలు, దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌లను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితిలో ఏమీ చెప్పలేం. అసలు ప్రపంచం సాధారణస్థితికి ఎప్పుడో వస్తుందో ఎవరికీ తెలియనప్పుడు ఐపీఎల్ తేదీల గురించి ఎలా మాట్లాడగలం. అయితే సెప్టెంబర్‌లో ఆసియా కప్‌తో మొదలు పెడితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్, ఆ తర్వాత టి20 ప్రపంచకప్ కూడా ఉన్నాయి. మన దేశవాళీ టోర్నీల సమయం కూడా అదే. కాబట్టి చాలా అంశాలు ఆలోచించాల్సి ఉంది’ అని బోర్డు అధికారి స్పష్టం చేశారు. -
151 జీఓ ప్రకారం జీతాలు చెల్లించాలి
అనంతపురం మెడికల్ : ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతూ జీవో నంబర్ 151 విడుదల చేసిందనీ, అందువల్ల ఆ మేరకు తమకు వేతనాలు ఇవ్వాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం వారు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 45 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్స్ పని చేస్తున్నట్లు చెప్పారు. తమకు రూ.9,500 వేతనం వస్తుండగా గత ఆగస్టులో రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు. అయినా పెంచిన వేతనాలు మాత్రం రావడం లేదన్నారు. తక్షణం సమస్యను పరిష్కరించి కొత్త జీతాలు వేయాలన్నారు.