గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలి
అనంతపురం రూరల్ : గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి, విద్యార్థి సమాఖ్య నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కృష్ణానాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతవాసులే రాష్ట్రాన్ని పాలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. భౌగోళికంగా గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటిస్తే ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకూ అతితక్కువ సమయంలో వెళ్లగలిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని అప్పటి బ్రిటీష్ ఇంజనీర్లు సైతం ధృవీకరించారని గుర్తు చేశారు.
అయినప్పటికీ పాలకులు తమ స్వార్థం కోసం విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం ప్రయత్నించడం అన్యాయమన్నారు. మన పాలకుల పుణ్యమా అని రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, కడప ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణారావు, నాగార్జున రెడ్డి, బండి నారాయణస్వామి, ఎస్కేయూ ప్రొఫెసర్ సదాశివారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.