భార్య ఉండగానే ప్రియురాలితో పరార్
మదనపల్లె టౌన్: కాన్పు కోసం భార్య పుట్టింటికి వెళ్లగా.. అదే అదనుగా భావించిన ఓ ప్రబుద్ధుడు ప్రియురాలితో పారిపోయాడు. రామకుప్పం మండలంలో జరిగిన ఈ ఘటన గురించి అతని అత్త సోమవారం సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రామకుప్పం మండలం అయపుగానిపల్లెకు చెందిన లక్ష్మమ్మ, చలపతి దంపతుల కూతురు కుమారి(20).. అదే మండలం బోయనపల్లెకు చెందిన సుబ్బరాయప్ప కుమారుడు చంద్రబాబుతో ఆమెకు గత ఏడాది వివాహం జరిగింది.
ప్రస్తుతం కుమారి 9 నెలల నిండు గర్భిణి. ప్రసవం కోసం ఆమెను కుటుంబసభ్యులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వంకమర్రిచేనుకు చెందిన శోభ(22) అనే యువతిని తీసుకుని 15 రోజుల కిందట బెంగళూరుకు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు కుమారి తన తల్లితో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.