breaking news
Rock Line Entertainment
-
మాస్ అంటే... బస్సు పాసు కాదు!
‘‘మాస్ అంటే బస్సు పాసు కాదుబే... ఎవడు పడితే వాడు వాడేసుకోనికి. అది మన బలుపుని బట్టి, బాడీ లాంగ్వేజిని బట్టి, జనం పిలుచుకునే పిలుపు’’... ‘పవర్’ సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్‌తోనే ఈ చిత్రంలో రవితేజ పాత్రచిత్రణ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునంటున్నారు దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ). ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయని ఆయన చెబుతున్నారు. ‘బలుపు’ చిత్రానికి రచయితగా పని చేసిన బాబీలోని ప్రతిభను గుర్తించి రవితేజ ‘పవర్’ డెరైక్షన్ చాన్స్ ఇచ్చారు. ఇందులో రవితేజ సరసన హన్సిక, రెజీనా నటించారు. రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని, ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. సంగీత దర్శకుడు తమన్ కెరీర్లోనే ఇదొక మంచి ఆల్బమ్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.జి. కృష్ణ. -
మైసూరులో సూపర్ స్టార్ లింగ
చాముండేశ్వరి కొండపై సినిమా ముహూర్త కార్యక్రమం మైసూరు, న్యూస్‌లైన్ : అక్షయ తృతీయ రోజున బ్రహ్మీ ముహూర్త సమయంలో మైసూరులోని చాముండీకొండపై వెలిసిన చాముండేశ్వరీ మాతను సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సారధ్యంలోని రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజనీకాంత్ హీరోగా నటించనున్న ‘లింగ’ సినిమా ముహూర్త కార్యక్రమాన్ని శుక్రవారం మైసూరులో నిర్వహించారు. ఈ ముహూర్త కార్యక్రమానికి ప్రముఖ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్, ఆయన సతీమణి సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ...మండ్య, మేలుకొటే, మైసూరు ప్రాంతాల్లో మే11 వరకు చిత్ర నిర్మాణం జరగనుందని తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు హీరోయిన్లు సోనాక్షి సిన్హా, అనుష్కా శెట్టి ఈ షూటింగ్లో పాల్గొననున్నారని వెల్లడించారు. రజనీ సరికొత్త స్టైల్ : గురువారం రాత్రి మైసూరుకు చేరుకున్న రజనీకాంత్ శుక్రవారం తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో చాముండేశ్వరీ కొండపైకి చేరుకున్నారు. ఎటువంటి మేకప్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిలా కొండపైకి వచ్చిన రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమయంలో పోలీసుల సహాయంతో ఆయన చాముండేశ్వరీ మాత ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం తెల్లటి పంచ, చొక్కా వేసుకొని సన్నపాటి మీసాలు, విగ్‌తో సరికొత్త స్టైల్లో బయటికి వచ్చిన రజనీని చూసిన అభిమానులు ఇదో కొత్త స్టైల్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక సినిమా విజయవంతం అవ్వాలని ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్న అంబరీష్, సుమలత ఆకాంక్షించారు.