తుఫానుగా మారిన తీవ్ర తుఫాను హెలెన్
తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన హెలెన్ పెను తుఫాను బలహీనపడి.. తుఫానుగా మారిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది ప్రస్తుతం పశ్చిమదిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటలలో కోస్తా సహా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
కాగా, హెలెన్ తుఫానుపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావం వల్ల కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే తుఫాను కారణంగా కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఎమ్మార్వో విధి నిర్వహణకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. తుఫాను, పెను గాలుల వల్ల వరి చేలతో పాటు కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను మొదలుపెట్టామని, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16,290 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు.