breaking news
retail management
-
టాప్-10 కెరీర్స్... బెస్ట్ ఆపర్చునిటీస్
డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసినవారికి ఉద్యోగాలపరంగా ఎన్నో అవకాశాలున్నాయి. అయితే రానున్న ఐదారేళ్లలో మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగా.. ఏవియేషన్, హెల్త్‌కేర్, రిటైల్ మేనేజ్మెంట్, సోషల్ వర్క్/రూరల్ డవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, టెలికం మేనేజ్మెంట్, మర్చెంట్ నేవీ నిలుస్తాయని ఆయా రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు తగిన విధంగా అభ్యర్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌టెన్ కెరీర్స్‌పై ప్రత్యేక ఫోకస్.. ఏవియేషన్.. ఎమర్జింగ్ ఏవియేషన్ రంగంలో.. ప్రతి ఏటా 121 మిలియన్ దేశీయ, 41 మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణికులతో తొమ్మిదో పెద్ద దేశంగా నిలుస్తున్న భారత్.. 2020 నాటికి మూడో పెద్ద దేశంగా ఎదుగుతుందని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పైలట్ లెసైన్సింగ్ కోర్సులతోపాటు గ్రౌండ్ డ్యూటీ, క్యాబిన్ క్రూ, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ.. ఈ రంగానికి చెందిన టెక్నికల్ కోర్సులను అందిస్తోంది. ‘ఏవియేషన్ రంగం కేవలం ప్రయాణికుల విభాగంలోనే కాకుండా కార్గో విభాగంలోనూ శరవేగంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. ఈ మేరకు నిపుణుల అవసరం పెరుగుతోంది. దీన్ని గమనించి విద్యార్థులు ఈ రంగంలో అడుగుపెడితే ఉజ్వల భవిష్యత్తును అందుకోవచ్చు.’ అంటున్నారు ఏపీ ఏవియేషన్ అకాడమీ డెరైక్టర్ కెప్టెన్ ఎస్.ఎన్.రెడ్డి. హెల్త్ కేర్.. కెరీర్ హెవెన్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, సీఐఐ అంచనాల ప్రకారం హెల్త్‌కేర్ రంగంలో 2020 నాటికి.. పారా మెడికల్ సిబ్బంది నుంచి సీఈవో స్థాయి వరకు 40 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ చికిత్స ఖర్చులు తక్కువగా ఉండ టం, మెడికల్ టూరిజంకు ప్రాధాన్యం పెరగడమే. కేవలం క్లినికల్ సర్వీసులే కాకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కొరత కూడా అధికంగానే ఉంది. ఔత్సాహికులు వీటిని దృష్టిలో పెట్టుకుంటే పదో తరగతి మొదలు.. పీజీ వరకు తమ అర్హతకు తగిన ఉద్యోగ వేదికగా హెల్త్‌కేర్ విభాగం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభంలో కనీసం నెలకు రూ. పదిహేను వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి అమెరికా, యూరప్ దేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ నెలకొంది. రిటైల్.. ఫర్ ఫ్యూచర్ వెల్ సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, మల్టీ బ్రాండ్ విభాగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైల్ రంగంలో ఐదో పెద్ద దేశంగా నిలిచిన భారత్.. 2020 నాటికి ఈ రంగంలో 1.3 ట్రిలియన్ డాలర్ల వృద్ధి నమోదు చేయనుంది. అంటే ఆ స్థాయిలో రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు కానున్నాయి. అందుకు తగిన విధంగా స్టోర్ కీపర్ నుంచి స్టోర్ సీఈవో వరకు వేలల్లో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. దీన్ని గుర్తించిన పలు ఇన్స్టిట్యూట్లు ఇప్పటికే రిటైల్ మేనేజ్మెంట్లో పలు డిప్లొమా, సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ‘రిటైల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు పలు కోర్సులు, ఇన్స్టిట్యూట్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. వాటికి గల గుర్తింపు, ఇతర ప్రామాణికాల ఆధారంగానే వాటిని ఎంచుకోవాలి’ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్-హైదరాబాద్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సు కోఆర్డినేటర్ శ్రీకాంత్ సూచన. సోషల్ సర్వీస్ / ఎన్జీఓ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం, ప్రతి కంపెనీ తమ లాభాల్లో 2 శాతం నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట సామాజిక సేవకు కేటాయించాలనే నిబంధన విధించడంతో సోషల్ వర్క్, రూరల్ డవలప్మెంట్ వంటి కోర్సులు చేసినవారికి అవకాశాలు పెరిగాయి. దేశంలో చాలా యూనివర్సిటీలు ఎంఏలో ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ విభాగాల్లో రెండు లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో 15.75 లక్షల స్వయం సహాయక బృందాలను నియమించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సుల వైపు అడుగులు వేస్తే మంచి అవకాశాలు అందుకోవచ్చు అంటున్నారు ఎన్ఐఆర్డీ సీపీజీఎస్ డెరైక్టర్ ఎస్.ఎం.ఇలియాస్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్వయం ఉపాధి దిశగా కెరీర్ కోరుకునే వారికి సరైన వేదిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే సొంతంగా ఏదైనా వ్యాపార, ఉత్పత్తి సంస్థను నెలకొల్పి ఆదాయార్జన పొందడం. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులు చేసిన వారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ మేరకు ఐఎస్బీ, ఐఐటీ-కాన్పూర్, నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ తదితర సంస్థలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్లో పీజీ కోర్సులను అందిస్తున్నాయి. మంచి ఐడియాలతో వచ్చే వారికి ఆర్థికంగా చేయూత కూడా అందిస్తూ సొంత వ్యాపారాభివృద్ధి దిశగా ఊతమిస్తున్నాయి. ఫార్మా కెరీర్ సగటున 12 శాతం వార్షిక వృద్ధితో పయనిస్తూ.. అంతే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్న రంగం ఫార్మాస్యూటికల్. నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం 2015 నాటికి లక్ష నుంచి లక్షన్నర మంది నిపుణుల అవసరం ఉంది. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ అర్హతతో బీఫార్మసీలో ప్రవేశించొచ్చు. ఆ తర్వాత పీజీ, పీహెచ్డీ చేయొచ్చు. దేశీయ ఫార్మా కంపెనీల్లోనూ, విదేశాల్లోనూ, విదేశీ ఔట్ సోర్సింగ్ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి. పీజీ స్థాయిలో ఫార్మకాలజీ, ఫార్మాస్యూటిక్స్, టాక్సికాలజీ వంటి డిమాండ్ గల స్పెషలైజేషన్లు పూర్తి చేస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు అంటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)-హైదరాబాద్ క్యాంపస్ రిజిస్ట్రార్ ఎన్.సత్యనారాయణ. కెరీర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఒక దేశ ప్రగతికి మూలం.. మౌలిక సదుపాయాలు. అందుకే.. ప్రభుత్వం ఇటీవలి కాలంలో రోడ్లు, రైల్వేస్, ఏవియేషన్, షిప్పింగ్, ఎనర్జీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ తదితర విభాగాల్లో వృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ రంగం 7 నుంచి 10 శాతం సగటు వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లోని నిర్దేశిత విభాగాల్లో అడుగుపెట్టాలంటే ప్రధానంగా సివిల్, మెకానికల్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. కింది స్థాయిలో ఐటీఐ, డిప్లొమా కోర్సులతోనూ ఈ విభాగంలో అడుగుపెట్టొచ్చు అంటున్నారు జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్‌భాస్కర్. ఆతిథ్య రంగం.. ఆదాయ మార్గం నేటి యువతకు మరో చక్కటి ఆదాయ మార్గం ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ). సగటున పది శాతం వృద్ధి రేటుతో సాగుతున్న రంగం. హోటల్స్, టూరిజం ఏజెన్సీలు ఈ రంగంలోని ప్రధాన విభాగాలు. టూరిజం శాఖ అంచనాల ప్రకారం.. ఆతిథ్య రంగంలో 2020 బనాటికి దాదాపు 9 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఎన్నో విద్యా సంస్థలు హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ వరకు కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం. విభాగం ఆధారంగా నెలకు కనీసం రూ. పది వేల జీతం ఉంటుంది. టూర్ ఆపరేటర్లు, గైడ్లుగా నెలకు రూ. 25 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. టూరిజం విభాగంలో స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు సంబంధిత రంగ నిపుణులు. టెలికం మేనేజ్మెంట్ ప్రభుత్వ నూతన విధానంతో విభిన్న అవకాశాలకు మార్గం వేస్తున్న మరో రంగం టెలికమ్యూనికేషన్స్. సాధారణ టెలిఫోన్స్ సంఖ్య క్రమేణా తగ్గుతూ స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో టెలికం మేనేజ్మెంట్ కచ్చితంగా కొలువు ఖాయం చేసే విభాగమని నిపుణుల అభిప్రాయం. పల్లెపల్లెలో బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరిస్తుండటం కూడా ఈ రంగంలో ఉపాధికి ఊతమిచ్చేవే. ఈ సేవలు సమర్థంగా సాగాలంటే టెలికం రంగంలో నిపుణుల ఆవశ్యకత ఎంతో. 2020 నాటికి.. దాదాపు పది లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా టెలికం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ వంటి ప్రత్యేక శిక్షణ సంస్థలను నెలకొల్పింది. సింబయాసిస్ ఇన్స్టిట్యూట్, వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు టెలికం మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ ఈసీఈ అభ్యర్థులు కూడా ఈ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంది అంటున్నారు సీఎంసీ సంస్థ హెచ్.ఆర్.మేనేజర్ టి. ఓంప్రకాశ్. మర్చంట్ నేవీ దేశదేశాలను చూడాలనే ఆకాంక్ష.. సముద్రపు అలలను ఆస్వాదించాలనుకునే వారికి చక్కటి అవకాశం కల్పించే కెరీర్ మర్చంట్ నేవీ. ఏడాదిలో సగభాగం సముద్రంలో.. ఓడల్లో గడిపే ఈ కెరీర్‌కు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఇంటర్మీడియెట్ ఎంపీసీ అర్హతగా మర్చంట్ నేవీలో కెరీర్ ప్రారంభించొచ్చు. మెరైన్ ఇంజనీరింగ్, నాటికల్ సైన్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ వంటి పలు కోర్సులు బీఎస్సీ, బీటెక్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్ ప్రకారం మర్చంట్ నేవీలో వేల సంఖ్యలో అవకాశాలు రెడీగా ఉన్నాయి. ఇతర దేశాలతో పెరుగుతున్న వాణిజ్య ఒప్పందాల దృష్ట్యా.. భవిష్యత్తులో కార్గో షిప్పింగ్ వ్యవహారాలు రెట్టింపై అంతే స్థాయిలో అవకాశాలు కూడా పెరగనున్నాయి. ప్రారంభంలో కనీసం నెలకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు అందుకోవచ్చు. -
భావి కెరీర్‌కు బెస్ట్ ఆప్షన్.. రిటైల్ మేనేజ్మెంట్
నేడు రిటైల్ రంగం అంతకంతకూ విస్తరిస్తోంది. ఓ మాదిరి పట్టణాల్లో సైతం సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయి. వీటిల్లో విధులు నిర్వహించడానికి నిష్ణాతులైన నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు రిటైల్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేస్తే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రిటైల్ కోర్సులు.. అర్హతలు, ప్రవేశప్రక్రియ, కెరీర్‌పై ఫోకస్.. భారతీయ రిటైల్ పరిశ్రమ దాదాపు 450 బిలియన్ అమెరికన్ డాలర్లతో ప్రపంచంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. రానున్న రెండు దశాబ్దాల్లో ఈ రంగం మరింత వేగంతో పురోగమించనుంది. ఎఫ్‌డీఐలకు కేంద్రం అనుమతించడంతో విదేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు ఈ రంగంలో ప్రవేశించనున్నాయి. దీంతో రిటైల్ రంగం విస్తృత ఉద్యోగావకాశాలకు వేదిక కానుంది. రిటైల్ మేనేజ్మెంట్ అంటే: విశ్లేషణాత్మక దృక్పథంతో సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లను సమర్థంగా నిర్వహించడం; పోటీదారులకంటే ముందుండేలా సంస్థను నిలపడమే రిటైల్ మేనేజ్మెంట్. ఏయే విభాగాలు.. సేల్స్ స్టోర్ మేనేజర్ రిటైల్ మేనేజర్ రిటైల్ బయ్యర్స్ అండ్ మర్చండైజర్స విజువల్ మర్చండైజర్స్ సపై్ల చైన్ డిస్ట్రిబ్యూటర్స్ లాజిస్టిక్స్ అండ్ వేర్‌హౌస్ మేనేజర్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఏయే కోర్సులు: విస్తరిస్తున్న రిటైల్ రంగం.. అందుకు అవసరమైన మానవ వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇవి పీజీ స్థాయిలో ఉన్నాయి. ఎంబీఏలో రిటైల్ మేనేజ్మెంట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్మెంట్- రిటైల్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-ఆర్ఎం) పేరుతో ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండటంతోపాటు క్యాట్/మ్యాట్/సీమ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి పరీక్షల్లో స్కోర్ సాధించి ఉండాలి. కొన్ని విద్యా సంస్థలు రిటైల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులో బోధించే అంశాలు: రిటైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాథమిక వ్యాపార వ్యవహారాలు వ్యాపార అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలు వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు రిటైల్ పరిశ్రమకు సంబంధించిన సమగ్ర విధానాలు మార్కెటింగ్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ రిటైల్ సెల్లింగ్ రిటైల్ లా లాజిస్టిక్స్ అండ్ సపై్ల చైన్ మేనేజ్మెంట్ కేటగిరీ మేనేజ్మెంట్ రిటైల్ రంగ పరిశ్రమల్లో ప్రాక్టికల్స్, ఇంటర్న్షిప్స్ కోర్సు పూర్తి చేశాక: కోర్సు పూర్తి చేసినవారికి అవకాశాలకు కొదవే లేదు. కస్టమర్ సేల్స్ అసోసియేట్, డిపార్టమెంట్ మేనేజర్/ఫ్లోర్ మేనేజర్/ కేటగిరీ మేనేజర్, స్టోర్ మేనేజర్, రిటైల్ ఆపరేషన్స మేనేజర్, రిటైల్ బయ్యర్‌స అండ్ మర్చండైజర్స, విజువల్ మర్కండైజర్‌స, మార్కెటింగ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ జాబ్స్ లభిస్తాయి. ఇతర రంగాల్లో కూడా: రిటైల్ మేనేజ్మెంట్ కోర్సుతో సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లలోనే ఉద్యోగాలు లభిస్తాయనుకోవడం పొరపాటు. ఇతర పరిశ్రమల్లోనూ రిటైల్ మేనేజ్మెంట్ అర్హులకు అవకాశాలుంటున్నాయి. ముఖ్యంగా టెలికం, బ్యాంకింగ్, బెవరేజెస్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్‌వేర్ పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. కావాల్సిన స్కిల్స్ ఎప్పటికప్పుడు రిటైల్ మార్కెట్ తీరుతెన్నులను తెలుసుకుంటుండాలి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు తప్పనిసరి. దీనిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలగాలి. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం. విశ్లేషణాత్మక నైపుణ్యాలు. వీటితోపాటు రిటైల్ రంగం అంటే విభిన్న సంస్కృతులకు చెందిన భిన్న రకాల వ్యక్తులతో సంప్రదింపులు చేయాల్సిన విభాగం. ఈ నేపథ్యంలో సహనం, ఎదుటి వారిని మెప్పించేతత్వం అలవర్చుకోవాలి. అప్పుడే ఈ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశం ఉంటుంది. సానుకూలతలు/ప్రతికూలతలు దేశీయ సంస్థలతోపాటు బహుళ జాతి సంస్థలు అడుగుపెట్టడంతో అపార ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగ నిర్వహణలో భాగంగా వివిధ రంగాల/భిన్న రకాల వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. తద్వారా కెరీర్ ఉన్నతికి బాటలు వేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాల మాదిరిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే జాబ్ కాదు. సమయ పరిమితి అనేది లేదు. ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. పండుగ రోజుల్లో, వారాంతాల్లోనూ కూడా పనిచేయాలి. కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ (కార్ట) రిటైలర్స అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ).. దేశంలోని రిటైల్ రంగ ప్రముఖులతో ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ రిటైల్ రంగ వ్యాపార విస్తరణ అంశాలతోపాటు, సుశిక్షితులైన మానవ వనరులను కూడా అందిస్తోంది. ఇందుకోసం ప్రతి ఏటా కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ పేరుతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షలో ర్యాంకు ద్వారా దేశంలోని 17 బి-స్కూల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. అయితే ఈ స్కూల్స్ అన్నీ కూడా అంతగా పేరులేనివే. దేశంలో ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా క్యాట్/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్/ఏటీఎంఏ వంటి పరీక్షల ద్వారానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కెరీర్ దేశవ్యాప్తంగా 4.3 మిలియన్ చిల్లర దుకాణాలు ఉన్నాయి. ఓ మాదిరి పట్టణాల్లో సైతం సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు వెలుస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, జ్యూయెలరీ, పుస్తకాలు, ఆటబొమ్మలు, దుస్తులు, సెల్‌ఫోన్స్ ఇలా దేనికదే ప్రత్యేకంగా అవుట్‌లెట్స్ ఏర్పాటవుతున్నాయి. దేశీయ సంస్థలకు తోడు బహుళ జాతి సంస్థల రాకతో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిల్లో ఉద్యోగాలు: ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్,స్పెషాలిటీ స్టోర్స్, లైఫ్ స్టైల్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్, ఫర్నీచర్ షాపుల్లో, గృహోపకరణాల తయారీ పరిశ్రమల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. టాప్ రిక్రూటర్స్ షాపర్స్‌స్టాప్, వెస్ట్‌సైడ్, పాంటాలూన్స్, లైఫ్‌స్టైల్, ఆర్పీ రిటైల్, క్రాస్‌వర్డ్, విల్స్ లైఫ్‌స్టైల్, వాల్‌మార్ట్, బిగ్బిజార్, ఫ్యూచర్. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి వేతనాలు ఉంటాయి. రెండు, మూడేళ్ల అనుభవం ఆధారంగా నెలకు రూ.25,000కు పైగా సంపాదించొచ్చు. పేరున్న సంస్థల్లో ఎక్కువ స్థాయిలో వేతనాలు అందుకోవచ్చు. ఫ్యూచర్‌కు బెస్ట్ కెరీర్ దేశంలో రిటైల్ రంగానికి రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ రంగం వైపు ఆసక్తి ఉండి రిటైల్ కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి కార్పొరేట్ కంపెనీలు రావడం పెరిగింది. విదేశీ కంపెనీలు చిల్లర వర్తకంలోకి రావడం వల్ల రిటైల్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. రెండేళ్ల కాలవ్యవధి ఉన్న రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అభ్యసించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ముందుగా రిటైల్ రంగంపై ఆసక్తి ఉన్నవారు మాత్రమే కోర్సును ఎంచుకోవాలనేది నా సూచన. మార్కెట్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కెరీర్‌ను మలచుకునే ఓర్పు, నేర్పు ముఖ్యం. అవకాశాల విషయానికొస్తే రెగ్యులర్‌గా ఉండే ఉద్యోగ అవకాశాలతోపాటు ఆన్లైన్ రిటైల్ మార్కెట్, యాడ్ ఏజెన్సీల నిర్వహణలోనూ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆర్థిక స్థోమత, ఆత్మవిశ్వాసం ఉంటే వ్యాపార రంగంలో స్వయం ఉపాధినీ పొందొచ్చు. రిటైల్ మార్కెటింగ్‌లో కార్పొరేట్ సంస్థలు మోర్, రిలయన్స్, స్పెన్సర్, వాల్‌మార్ట్ వంటివి ప్రవేశిస్తుండటం వల్ల అవకాశాలకు ఢోకా లేనట్లే. ప్లేస్‌మెంట్స్ ద్వారా వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ పొందే వీలుంది. -వి.అంజిరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ (ఐపీఈ - హైదరాబాద్) రిటైల్ కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు.. మన రాష్ట్రంలో.. ఆంధ్రా యూనివర్సిటీ (www. andhrauniversity.edu.in) ఎంబీఏలో రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తోంది. అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ - హైదరాబాద్ కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్, వ్యవధి: రెండేళ్లు అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్‌లో వచ్చిన స్కోర్, బృంద చర్చలు, మౌఖిక పరీక్ష ఆధారంగా. వెబ్సైట్: www.ipeindia.org జాతీయ స్థాయిలో.. దూరవిద్య విధానంలో పాండిచ్చేరి సెంట్రల్ వర్సిటీ ఎంబీఏలో రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తోంది. వ్యవధి: రెండేళ్లు అర్హత: 10+2+3 విధానంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వెబ్సైట్: www.pondiuni.edu.in ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (మైకా) - అహ్మదాబాద్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును ఆన్లైన్ విధానంలో అందిస్తోంది. వ్యవధి: ఏడాది అర్హులు: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. రిటైల్ మేనేజ్మెంట్పై ఆసక్తి ఉండటంతోపాటు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేస్తున్నవారు. వెబ్సైట్: www.mica.ac.in/mode/home ఎల్ఎన్ వెలింగకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై కోర్సు: పీజీడీఎం రిటైల్ మేనేజ్మెంట్, వ్యవధి: రెండేళ్లు అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వెబ్సైట్: www.welingkar.org ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) - నోయిడా కోర్సు: ఎంబీఏ ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్ అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కోర్సు: ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ బీబీఏ+ ఎంబీఏ అర్హత: ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత, వ్యవధి: ఐదేళ్లు వెబ్సైట్: www.fddiindia.com బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ - గ్రేటర్ నోయిడా కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (రిటైల్) వెబ్సైట్: www.bimtech.ac.in ఇండియన్ రిటైల్ స్కూల్ -ఢిల్లీ కోర్సులు: పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.indianretailschool.com సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స లెర్నింగ్ -పుణే కోర్సు: పీజీడీఆర్ఎం వెబ్సైట్: www.scdl.net ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - న్యూఢిల్లీ కోర్సు: బీబీఏ ఇన్ రిటైలింగ్, వ్యవధి: మూడేళ్లు, అర్హత: 10+2 ఉత్తీర్ణత. వెబ్సైట్: www.ignou.ac.in