‘రిపోర్టింగ్ లైవ్’ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘రిపోర్టింగ్ లైవ్’ ఒకటి. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సమాచారం... ప్రతి ఒక్కరికీ ప్రస్తుత ప్రపంచంలో ఈ సమాచారం అత్యవసరం. ఆ సమాచారాన్ని సేకరించి అందించడానికి ఉన్నవే మీడియా సంస్థలు, ప్రతినిధులు. సరిహద్దుల్లో సైనికుడు శత్రువుతో పోరాటం జరిపేటప్పుడు ఇదమిద్ధమైన కొన్ని లెక్కలుంటాయి. కాని ఓ వార్తను తీసుకురావడానికి వెళ్ళే జర్నలిస్టు తన జీవితాన్నే ఆ పోరాటపు లెక్కలో దింపుతాడు. నిజానికి విలువగల వార్తలను సేకరించి కాపు కాసేవాడు విలేకరి, అలాగే తమ కంటికి కనిపించిన ప్రతి సున్నితమైన సన్నివేశాన్ని అతి కష్టంతో చిత్రీకరించి, ఆ పై ప్రేక్షకులకు తమ వాక్చాతుర్యంతో ఆర్తిగా తెలిపి చూపేవే వార్తలు.తెరపై కొన్ని నిమిషాల సమాచారాన్ని తెర వెనుక తమ జీవితాలను పణంగా పెట్టి తీసుకువస్తున్న అసలు సిసలైన జర్నలిస్టుల జీవితానుభవాలను చూపించిన సినిమానే ‘రిపోర్టింగ్ లైవ్’. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు కూడా రిపోర్లు అయిపోతారు. అలా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందీ సినిమా. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. ఓ ఛానల్ లో పని చేసే సంధ్యాయాదవ్ తన కెమెరామేన్ అయిన వినోద్ శర్మతో కలిసి ముంబైలో జరిగిన ఓ బస్సు ప్రమాదాన్ని కవర్ చేయడానికి వెళుతుంది. మహారాష్ట్రలో జరిగిన ఈ బస్సు ప్రమాదం ఓ బ్రిడ్జి కూలిపోవడం వల్ల జరుగుతుంది. ఆ బస్సులో చాలా వరకు స్కూల్ పిల్లలే ప్రయాణికులు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా, టీచర్లతో పాటు పిల్లలంతా నీళ్ళలో మునిగి చనిపోతారు. ఇది కవర్ చేసిన సంధ్య ఆ బ్రిడ్జి నాణ్యతా లోపం వల్లే కూలిందని, అది కూడా అక్కడ జరిగే ఇసుక మాఫియా దందా వల్లనేనని తెలుసుకుంటుంది. దాంతో వినోద్‌తో కలిసి ఈ ప్రమాదానికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలు సేకరిస్తుంది. మరి... సంధ్య సేకరించిన ఈ వార్తను సదరు సంస్థ ప్రసారం చేసిందా? చేస్తే సంధ్యకు, వినోద్‌కు ఎటువంటి అవరోధాలు ఎదురయ్యాయి? అన్న విషయాలను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘రిపోర్టింగ్ లైవ్ ’ సినిమాలోనే చూడాలి. బాలీవుడ్ రచయితలు ధ్రువ్ త్రిపాఠి, మిహిర్ జాదవ్ సంయుక్తంగా రాసిన కథను ధ్రువ్ త్రిపాఠి తెరకెక్కించారు. ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా ప్రధాన పాత్రలో నటించి, అలరించారు. రోజూ మనం చూసే వార్తల వెనుక ఉన్న కష్టాన్ని ఓ సారైనా చూడాలనుకుంటే ఈ సినిమా సరైన ఛాయిస్. మస్ట్ వాచ్ ఫర్ ద వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు