breaking news
releatives
-
అపరకాళిగా మారి హతమార్చింది
సాక్షి ప్రతినిధి, చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి లైంగిక వేధింపులకు ఆమె తట్టుకోలేకపోయింది. అపరకాళిగా మారి అంతమొందించింది. తేనీ జిల్లా ఉత్తమపాళయంకు చెందిన అరటి ఆకుల వ్యాపారి మణికంఠన్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్ బావమరిది పాండీశ్వరన్ (30) భార్య నిరంజన (25)లకు ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్, పాండీశ్వరన్ కొన్నేళ్ల క్రితం టీ బంకు నడిపారు. ఈ సమయంలో నిరంజనపై కన్నేసిన మణికంఠన్ తరచూ సెల్ఫోన్లో ఇబ్బందికరమైన సంభాషణ చేసేవాడు. అనేకసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో భర్తకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కారణంగా టీ బంకును ఎత్తివేసి ఇరువురూ వేర్వేరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయినా బుద్ధి మార్చుకోని మణికంఠన్ నిరంజనకు సెల్‌ఫోన్ ద్వారా అసభ్య సంభాషణలు కొనసాగించాడు. దీంతో విసిగిపోయిన నిరంజన శనివారం ఉదయం భర్తతో కలిసి మణికంఠన్ దుకాణానికి వెళ్లి నిలదీసింది. ఈ సమయంలో ఘర్షణ వాతావారణం చోటుచేసుకోగా నిరంజన తన వెంట తెచ్చుకున్న కొడవలితో మణికంఠన్‌ను హతమార్చింది. రక్తం మడుగులో ఉన్న మణికంఠన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. భార్యాభర్తలిద్దరూ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా వారిని అరెస్ట్ చేశారు. -
చిన్నారిని కబళించిన మృత్యువు
అనుమసముద్రంలో విషాదం అనుమసముద్రంపేట : ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిని క్షణాల్లో మృత్యువు కబళించింది. ఈ సంఘటన మండలంలోని అనుమసముద్రం మిట్టమీద తూర్పువీధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. ఏఎస్‌పేటకు చెందిన మహేష్, లక్ష్మి దంపతులు రెండేళ్లుగా అనుమసముద్రంలో బాడుగ ఇంటిలో ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర వయసు కలిగిన కౌషిని దుహిజ అనే కుమార్తె ఉంది. శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచిన కౌషిని ఇంటి ముందు ఆడుకుంటుంది. అదే వీధిలో వారింటికి ఎదురుగా ఉన్న ఇంటిలో ఖాజాపీర్ అనే ఆటోడ్రైవర్ ఉంటున్నాడు. ఉదయాన్నే తన టాటా మ్యాజిక్ ఆటోను ఏఎస్‌పేటకు తీసుకెళ్లేందుకు ఖాజాపీర్ బయలుదేరాడు. అయితే చిన్నారి ఆటో వద్ద ఉండడాన్ని ఖాజాపీర్ గమనించలేదు. స్టార్ట్ చేసి ముందుకెళ్లాడు. టాటా మ్యాజిక్ వాహనం కింద ఉన్న చిన్నారి కౌషిని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అదే వాహనంలో పాపను ఏఎస్‌పేటలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనుమసముద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఏఎస్‌పేట ఎస్సైలు అంకమ్మ, రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారిని ఆత్మకూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.