breaking news
rekka
-
పంచ్‌డైలాగ్స్‌కు కష్టపడ్డా!
పంచ్‌డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు నటుడు విజయ్‌సేతుపతి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన నటిస్తున్న తాజా చిత్రాల్లో రెక్క ఒకటి. ఇంతకు ముందు ఆరెంజ్మిఠాయ్ చిత్రాన్ని నిర్మించిన బి.గణేశ్ నిర్మిస్తున్న తాజా చిత్రం రెక్క. రతన్‌శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటించారు. దర్శకుడు కేఎస్.రవికుమార్,సతీష్,కిషోర్,శ్రీరంజని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక సత్యం సినిమాల్లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు కేఎస్.రవికుమార్ ఆవిష్కరించగా దర్శకుడు పన్నీర్‌సెల్వం తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఆ స్థాయిని తాను ఊహించలేదన్నారు.ఇదంతా మీరు అందించిందే(అభిమానులను ఉద్దేశించి) అని పేర్కొన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు.కాస్త దడగా ఉంది అని అన్నారు.అయితే మీ ఉత్సాహం మాత్రం యమ కిక్కు ఇస్తోందన్నారు.గత శుక్రవారమే ఆండవన్ కట్టళై చిత్రం తెరపైకి వచ్చిందని,ఇప్పుడు రెక్క చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతోందనిఅన్నారు. మరో రెండు వారాల్లో మరో చిత్రం తెరపైకి రానుందని తెలిపారు. ఇదంతా చూస్తుంటే తనకే ఒక మాదిరిగా ఉందన్నారు.ఇలా తన చిత్రాలు వరుసగా విడుదల కావడానికి కాలం అలా అమిరిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చే శారు. కథపైనా,తనపైనా నమ్మకంతో నిర్మాత గణేశ్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారని అన్నారు.చిత్రంలో నటించడానికి ఎక్కడా శ్రమ పడలేదు గానీ పంచ్‌డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు.ఇందులో నటి లక్ష్మీమీనన్ పాత్ర బాగుంటుందని చెప్పారు. డి.ఇమాన్ చాలా మంచి సంగీతాన్ని అందించారనీ విజయ్‌సేతుపతి తెలిపారు. -
విజయదశమికి రెక్క
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాకు ప్రచారం చాలా అవసరం. అయితే అలాంటి ప్రచారాన్ని ప్రారంభించకుండానే కొన్ని చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి వాటిలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం రెక్క. అందుకు ఈ చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి ఒక కారణం కావచ్చు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన నటిస్తున్న తాజా చిత్రం రెక్క. ఆయనకు జంటగా లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. రతన్‌శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కామన్మ్మాన్ ప్రెజెంట్స్ పతాకంపై బి.గణేశ్ నిర్మిస్తుండగా డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు రతన్‌శివ తెలుపుతూ విజయ్‌సేతుపతి పర్ఫార్మెన్స్ నటుడిగానే అందరికీ తెలుసన్నారు. అలాంటి ఆయన్ని రెక్క చిత్రం పక్కా యాక్షన్ హీరోగా చూపిస్తుందన్నారు. ఇందులో ఆయన కుంభకోణానికి చెందిన యువకుడిగా నటించ గా నటి లక్ష్మీమీనన్ మదురై అమ్మాయిగా నటించారన్నారు. చిత్రం పేరుకు తగ్గట్టుగానే మదురై, కుంభకోణం, కారైకుడి, బ్యాంకాక్‌లను చుట్టి చిత్రీకరణను పూర్తి చేసుకుందని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర హక్కులను సొంతం చేసుకున్న శివబాలన్ పిక్చర్స్ అధినేత అక్టోబర్‌లో ఆయుధపూజ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి సుభా గణేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.