ఇది వీరప్పన్ బయోపిక్ కాదు!
‘‘వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్‌ను చంపడం అనే పాయింట్‌తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు.
ఆయన దర్శకత్వంలో బీవీ మంజునాథ్, ఇ. శివప్రకాష్, బీఎస్ సుధీంద్ర నిర్మించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. సందీప్ భరద్వాజ్ టైటిల్ రోల్ పోషించారు. ఈ చిత్రం టీజర్‌ను ఆవిష్కరించిన అనంతరం రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ - ‘‘వీరప్పన్ లైఫ్‌లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం.
‘ఆపరేషన్ కుకూన్’లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. డిసెంబర్ 4న తెలుగు, కన్నడం, తమిళంలో విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్‌చంద్ర పధిరి.