రుణాల స్వాహాపై విచారణ
నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకు, చెట్టుపల్లి పీఏసీఎస్‌లో అక్రమాలపై ఆరా
నర్సీపట్నం టౌన్ : ఆంధ్రా బ్యాంకు, ప్రాథమిక స హకార సంఘంలో జరిగిన అక్రమాలపై ఆర్డీవో కె.సూర్యారావు శుక్రవారం విచారణ నిర్వహించారు. ఆం ధ్రా బ్యాంక్ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి తనయుడు కుమ్మక్కై రైతు రుణాల పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిని గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.
ఇందుకు పాల్పడిన బ్యాంకు మేనేజర్ బదిలీ కావడం, కొత్తగా వచ్చిన మేనేజర్ అక్రమాలపై దృష్టిసారించి సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఈ అక్రమాలపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకు, చెట్టుపల్లి ప్రాథమిక సహకార సంఘంలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కోటవురట్ల మండలం రాజుపేట సర్పంచ్ తనయుడు సూరిశెట్టి గంగాధర్ (బ్రాంచ్ పోస్టుమాస్టర్), భార్య సత్య సుజాత (అంగన్వాడీ సూపర్వైజర్) ఆంధ్రా బ్యాంక్ పాత మేనేజర్ ఆడమ్‌రాజు, ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్వర్‌రెడ్డి కుమ్మక్కై 152 మంది రైతుల రుణాల పేరిట రూ.38 లక్షలు కాజేశారని ప్రచారంలో ఉంది. దీంతో కొత్తగా వచ్చిన మేనేజర్ జయంతి శ్రీనివాసరావు ఈ వ్యవహారాన్ని బయటకు తీశారు. పై నలుగురిపై ఆయన ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు.
ఇదిలావుండగా, చెట్టుపల్లి ప్రాథమిక సహకార సొసైటీలో రైతులకు తెలియకుండా సొసైటీ కార్యదర్శి పిట్టా చలపతి రూ.లక్షలు స్వాహా చేశాడు. దీనిపై కూడా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ యువరాజ్ ఆదేశాలతో శుక్రవారం ఆర్డీవో కె.సూర్యారావు విచారణ చేపట్టారు. జరిగిన అక్రమాలపై అధికారుల సమాధానాలను, బాధితుల వ్యాజ్యాలను డెప్యూటీ తహశీల్దార్ ప్రసాద్, తహశీల్దార్ పార్వతీశ్వరరావు రికార్డు చేశారు. లోన్ల వ్యవహారంలో రుణమాఫీ పొందే అవకాశం ఏ మేరకు ఉంది, రుణమాఫీ ఆశించి కుంభకోణం జరిగిందా అనే విషయాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారని ఆర్డీవో తెలిపారు. అప్పటి బ్యాంక్ మేనేజర్ ఎం.ఆడమ్‌రాజు, అప్పటి గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌రెడ్డి, గంగాధర్ శ్రీనివాస్, సత్య సుజాత ఈ వ్యవహారానికి పాల్పడినట్టు బ్యాంక్ మేనేజర్ జయంతి శ్రీనివాసరావు ఆర్డీవోకు వివరించారు. ఈ అంశంపై బ్యాంకు జోనల్ అధికారులు తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను బదిలీ చేశారని, గంగధార్ శ్రీనివాస్, అతని భార్య సత్యసుజాత, సహకరించిన అధికారులపై పోలీసు కేసు నమోదు చేసినట్టు ఆర్డీవోకు తెలిపారు. చెట్టుపల్లి సొసైటీలో కూడా విచారణ చేపట్టి అధికారులు, బాధితుల నుంచి వివరాలు నమోదు చేశారు.