breaking news
rdo enquiry
-
యువకుడి మృతిపై ఆర్డీఓ విచారణ
హిందూపురం అర్బన్ : లేపాక్షి మండలం పులమతికి చెందిన రమేష్ మృతిపై ఇన్చార్జ్ ఆర్డీఓ విశ్వనాథ్ మంగళవారం విచారణ చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ఎస్ఐ శ్రీధర్, సిబ్బంది పట్టుకొచ్చి లాఠీలతో చితకబాదడంతో దెబ్బలకు తాళలేక రమేష్ సోమవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారంటూ బంధువులు ఆరోపించారు. ఆ రోజు రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హిందూపురం ఆస్పత్రి ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. మృతదేహంతో ఆందోళన చేపట్టాలని బంధువులు, గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారిని పోస్టుమార్టం గది వైపు పోకుండా నియంత్రించారు. భారీ బందోబస్తు మధ్య శవ పరీక్షలు నిర్వహించారు. తమకు న్యాయం జరగకుంటే శవాన్ని తీసుకెళ్లేది లేదంటూ బాధితులు భీష్మించారు. ఇంతలో ఇన్చార్జ్ ఆర్డీఓ విశ్వనాథ్ అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. బాధితులందరినీ తహసీల్దార్ కార్యాలయం వద్దకు పిలిపించి మృతుడి భార్య పుష్ప, ఆమె తండ్రిని విచారణ చేసి, వాంగ్మూలం నమోదు చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన ఇతర వ్యక్తులను కూడా ఆర్డీఓ విచారణ చేశారు. చివరకు చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.4 లక్షల పరిహారం అందించేలా కృషిచేయడంతో పాటు నష్టపరిహారం కింద రూ.లక్ష ఇచ్చేలా హామీ చెప్పినట్లు తెలిసింది. అనంతరం భారీ బందోబస్తు మధ్య శవాన్ని పులమతి గ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
విద్యార్థినితో అసభ్యకర ప్రవర్తనపై విచారణ
హిందూపురం అర్బన్ : పట్టణ సమీపంలోని కొటిపి రోడ్డులో ఉన్న ఏపీఆర్జేసీ బ్రిడ్జి స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినితో వంటమనిషి అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు మేరకు ఆర్డీఓ రామ్మూర్తి, డీఎస్పీ సుబ్బారావు ఆదివారం విచారణ చేపట్టారు. శివరాత్రి రోజున బ్రిడ్జి స్కూల్లో వంటమనిషి సహాయకుడిగా పని చేస్తున్న ఓబుళపతి ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రహరీ వెనుక వైపునకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అది మిగిలిన విద్యార్థులు చూసి స్కూల్లోని సిబ్బందికి చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. వారు ఓబుళపతిని తీవ్రస్థాయిలో మందలించి అమ్మాయికి బుద్ధి చెప్పి గదికి తీసుకువచ్చారు. మరుసటి రోజు ఆ అమ్మాయిని ఇంటికి పంపించినట్లు కలెక్టర్కు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణం విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించడంతో ఆర్డీఓ, డీఎస్పీ స్కూల్లో విచారణ చేశారు. అయితే అక్కడ ఏం జరగలేదని అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి స్కూల్ ప్రిన్సిపల్ వివరణ మరోలా ఉంది. ఒకట్నిర నెల కిందట వంటమనిషి ఓబుళపతికి అదే స్కూల్లో పని చేస్తున్న టీచర్ ఉమా రూ.12 వేలు అప్పుగా ఇచ్చింది. డబ్బు ఇవ్వకపోవడంతో ఆమె బాగా దుర్భాషలాడింది. దీంతో ఓబుళపతి ఆమెపై కులంపేరుతో దూషించిందని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడు. దీంతో టీచర్ ఇలా ఫిర్యాదు చేసింది. అని బ్రిడ్జి స్కూల్ ప్రిన్సిపల్ జయలక్ష్మి చెప్పారు. కలెక్టర్కు అందించిన ఫిర్యాదుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ కోసం ఆర్డీఓ, డీఎస్పీ వచ్చి పూర్తిస్థాయిలో విచారణ చేశారన్నారు. అయితే ఆరోపణలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని ఆర్డీఓ, డీఎస్పీ చెప్పారు.