breaking news
Ravindra Patil
-
నలిగిపోయిన నాలుగో సింహం!
సినిమాకూ, నిజజీవితానికీ చాలా తేడా ఉంటుంది. సినిమాలో డ్రామా ఉంటే..రియల్‌లైఫ్‌లో లైఫ్ మాత్రమే ఉంటుంది. అందుకేనేమో ఎక్కడలేని ఆసక్తినీ రేకెత్తించే సినిమా కథలే హిట్టై కూర్చుంటున్నాయి. సామాన్యుల జీవితాలేమో ఫట్‌మంటున్నాయి. సినిమా హీరోలు రారాజులుగా వెలుగుతుంటే.. వారిని ఆరాధించే సామాన్యుడు దిక్కులేని చావు చస్తున్నాడు. వారి చక్రాల కిందపడి నలిగిపోతున్నాడు. జీవితపు చరమాంకంలో ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకు తిరిగిన రవీంద్ర పాటిల్ కూడా అలాగే నలిగిపోయాడు. మహారాష్ట్రలోని చాలామంది కుర్రాళ్లలాగే రవీంద్ర పాటిల్‌కు కూడా సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచీ అతడి కండలు తిరిగిన దేహాన్నే చూస్తూ పెరిగాడు. తన హీరోలాగే తానూ కండలు పెంచాలనుకున్నాడు. చివరకు పెంచాడు కూడా. ఈ దేహదారుఢ్యమే అతడిని పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించేలా చేసింది. 1997లో ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్‌గా చేరాడు. కెరీర్ ప్రారంభించిన రెండేళ్లకే ఉగ్రవాదుల ఆటకట్టించే ‘స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్’ కమాండోగా శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా అప్పుడే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌కు ముంబై అండర్‌వరల్డ్ నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కావాలనీ పోలీస్ కమిషనర్‌కు విన్నవించుకున్నాడు సల్మాన్. కమీషనర్ ఆదేశంతో బాడీగార్డ్ కోసం వేటలో పడ్డారు అధికారులు. ఆ సమయంలోనే వారి కంటపడ్డాడు రవీంద్ర పాటిల్. రూపంలో సల్మాన్‌కు పోటీగా ఉన్నాడు. ఓ రకంగా సల్మాన్‌ను మించిన ఫిజిక్‌తో పోలీసు అధికారుల దష్టిని ఆకర్షించాడు. ఇలాంటి వాడైతేనే సూపర్‌స్టార్‌కు సరైన జోడు అనుకున్నారో ఏమో.. స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్ నుంచి పాటిల్‌ను తప్పించారు. సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పనిచేయమంటూ ఆదేశించారు. ఇది పాటిల్‌లో ఎక్కడలేని సంతోషాన్ని నింపింది. ఎగిరి గంతేశాడు. ‘‘ఇకపై సల్మాన్‌కు దగ్గరగా ఉండబోతున్నాను.. సల్మాన్‌ను రోజూ చూస్తాను.. సల్మాన్ కుటుంబంలో ఒకడిగా మారబోతున్నాను..’’ ఇలా ఒకటా రెండా బోలెడన్ని ఆలోచనలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వెంటనే విధుల్లో చేరిపోయాడు. అయితే, ఆ రోజు అతడికి తెలియలేదు. అదే అతడి జీవితాన్ని సర్వనాశనం చేయబోతోందని..! రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. సల్మాన్‌తో కలిసి తిరగడం వల్ల ప్రముఖులతో పరిచయాలు, భారీ పార్టీలు, ఖరీదైన గిఫ్టులు, బ్రాండెడ్ దుస్తులు.. ఇలా తన జీవితంలో ఎన్నడూ చూడని మార్పును చూస్తున్నాడు పాటిల్. సల్మాన్‌ను చూడాలని ఉందనే తన స్నేహితుల కోరికా కాదనేవాడు కాదు. ఎలాగోలా వారు సూపర్‌స్టార్‌ని కలిసేలా చేసేవాడు. దీంతో బంధుమిత్రుల దగ్గర పరపతినీ పెంచుకున్నాడు. అలా జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. కానీ, 2002 సంవత్సరం పాటిల్ జీవితంపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. సెప్టెంబర్ 28 అర్ధరాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఐదుగురి మీదుగా సల్మాన్‌ఖాన్‌కు చెందిన టయోటా ల్యాండ్ క్రూజర్ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా మిగిలినవారు గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో కారు వెనక సీటులో కూర్చున్న రవీంద్ర పాటిల్.. ప్రమాదానికి కారణం సల్మాన్ ఖాన్ తప్పతాగి డ్రైవ్ చేయడమేనని పేర్కొన్నాడు. తాను వద్దని వారిస్తున్నా, వినకుండా వేగంగా కారు నడిపాడని.. ఫలితంగా ప్రమాదం సంభవించిదనీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఇదే అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. సల్మాన్ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచీ, వెలుపలి నుంచీ పాటిల్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల వేధింపులు తాళలేకపోయాడు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా ఎవరెన్ని చెప్పినా దానికి అంగీకరించలేదు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలా అదశ్యం కావడంతో కేసు విచారిస్తున్న న్యాయస్థానం పాటిల్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో, 2006లో మహాబలేశ్వరంలో పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కపెట్టాడు. తర్వాత బెయిల్‌పై విడుదలైనా కుటుంబ సభ్యులు అతడిని ఆదరించలేదు. భార్య విడాకులు తీసుకుంది. ఎక్కువ కాలం విధులకు హాజరు కాలేదంటూ పోలీస్ శాఖ పాటిల్‌ను ఉద్యోగం నుంచి తప్పించింది. దీంతో, ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకునే స్థితికి దిగజారాడు. మరోవైపు, అతడిని క్షయ వ్యాధి పట్టిపీడించింది. ఈ దశలో 2007లో బిచ్చమెత్తుకున్న డబ్బుతోనే ఆసుపత్రికి చేరాడు. అక్కడే అక్టోబర్ 4న కన్నుమూశాడు. తాను చనిపోవడానికి రెండ్రోజుల ముందు కలిసిన స్నేహితుడితో..,‘‘ఆ ప్రమాదం నా జీవితాన్ని సర్వనాశనం చేసింది’’ అని వ్యాఖ్యానించాడు. చివరి వరకూ ఒకే మాటపై నిలబడిన ఆ కానిస్టేబుల్ తుదిశ్వాస వరకూ న్యాయం జరుగుతుందనే భావించాడు! -
సల్మాన్ ను వెంటాడుతున్న కష్టాలు
ముంబై: 'హిట్ అండ్ రన్' కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ మృతిపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. పుణేకు చెందిన సామాజిక కార్యకర్త హేమంత్ పాటిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రవీంద్రపై సల్మాన్ ఖాన్ ఒత్తిడి తీసుకొచ్చిన విషయం కేసు విచారణ సమయంలో ప్రస్తావనకు రాలేదని గుర్తు చేశారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని రవీంద్రపై ఒత్తిడి తెచ్చిన సల్మాన్ పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని హేమంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన రోజు పోలీస్ స్టేషన్ లో రవీంద్ర పాటిల్ ఇచ్చిన సాక్ష్యంతోనే ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. -
నా కొడుకు మాట మార్చలేదు
- కడవరకు నిజమే చెప్పాడు - రవీంద్ర తల్లి సుశీల పాటిల్ సాక్షి, ముంబై: ‘మా కుటుంబం సంస్కారం నేర్పింది కాబట్టే నా కుమారుడు కడవరకు నిజమే చెప్పాడు. మాట మార్చలేదు. ప్రమాదం జరిగిన రోజు పోలీసు స్టేషన్లో అతడిచ్చిన సాక్షమే నేడు సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడేలా చేసింది.మృతి చెందిన, గాయపడిన వారికి న్యాయం జరిగింది’ అని దివంగత రవీంద్ర పాటిల్ తల్లి సుశీల పాటిల్ అన్నారు. తన కొడుకు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. నిజం చెప్పడమే తన తప్పయితే మున్ముందు నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కొడుకు రవీంద్ర స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అంగరక్షకుడిగా తన బాధ్యత నెరవేర్చాడని అన్నారు. అందుకు తమ కుటుంబం భారీ మూల్యం చెల్లించిందని, చేతికొచ్చిన కొడుకు పోయాడని, కుటుంబం విచ్ఛిన్నమైందని కంటతడి పెట్టింది. నిజం చెప్పడమే తన కొడుకు చేసిన తప్పా అని ప్రశ్నించింది. ఒకవేళ అదే నిజమైతే.. ఇక ముందు నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రారని చెప్పింది. సల్మాన్‌కు ప్రస్తుతం బెయిల్ దొరికినప్పటికీ తర్వాత జరిగే విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు. న్యాయమంటే ఉరి తీయడం కాదు చట్ట ప్రకారం సల్మాన్ కేసును చూడాలని, భావావేశాల ప్రకారం కాదని దేశ అదనపు సోలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ అన్నారు. సల్మాన్ నటుడు అయినప్పటికీ చట్ట ప్రకారం విచారణ జరగాలని అన్నారు. గోవాలో జరుగుతున్న వుమెన్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆమె పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ను ముంబై కోర్టు దోషిగా తేల్చగా, బాంబే హైకోర్టు దాన్ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పింకీ స్పందిస్తూ.. క్రిమినల్ నేరాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరికీ చట్టం ఉరిశిక్ష విధించదని, సల్మాన్‌కు ఐదు సంవత్సరాల శిక్ష పడటం సబబే అని అన్నారు. సల్మాన్ కేసు తీర్పు వెలువడినప్పుడు కేసు ఎందుకు జాప్యం అయిందని, కేవలం ఐదేళ్ల శిక్ష సల్మాన్‌కు ఎలా విధిస్తారని పలువురు అడిగారని ఆమె అన్నారు. న్యాయం అంటే చేసిన నేరానికి ఉరితీయడం కాదని, నేరానికి తగ్గ శిక్ష విధించడం అని అన్నారు. కాకా మానసిక ఒత్తిడికి గురయ్యాడు రవీంద్ర పాటిల్ సోదరుడి కుమారుడు ప్రశాంత్, కుమార్తె మానసీ మాట్లాడుతూ.. సల్మాన్ కారు ప్రమాదం తరువాత కాకా (రవీంద్ర) మానసిక ఒత్తిడికి గురయ్యాడని చెప్పారు. అంతకు ముందు చలాకీగా ఉన్న కాకా ఒక్కసారి ఎందుకలా మారాడో అర్థం కాలేదన్నారు. ఒత్తిళ్లు భరించలేక విధులకు సరిగా హాజరుకాకపోవడం, విధుల నుంచి సస్పెండ్ చేసిన తరువాత అదృశ్యం కావడం జరిగిపోయాయన్నారు. హిట్ అండ్ రన్ కేసులో కాకా హాజర కావాలని కోర్టు ఆదేశించడంతో ఆ కేసులో ప్రధాన, ప్రత్యక్ష సాక్షి తనే అని తెలిసిందన్నారు. హిట్ అండ్ రన్ సంఘటన జరగకున్నట్లయితే నేడు కాకా తమ మధ్య ఉండేవాడని అన్నారు. రవీంద్ర పాటిల్ స్పోర్ట్స్ కోటాలో 1998లో పోలీసు శాఖలో చేరాడు. ప్రొటెక్షన్ యూనిట్లో విధులు నిర్వహించేవాడు. సల్మాన్‌ఖాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో రవీంద్రను అంగరక్షకుడిగా నియమించారు.