ఉత్తరప్రదేశ్ లో ఐఎస్ఐ ఉగ్రవాది అరెస్టు
చంఢీఘర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐఎస్ఐకు చెందిన ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 'భిందారానేవాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖాలిస్తాన్' కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐఎస్ఐ ఉగ్రవాది రతాన్ దీప్ సింగ్ ను బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ పూర్ లో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ ఉగ్రవాదిని కోర్టుకు తీసుకువెళ్లగా.. అతన్ని 10 రోజులు పోలీస్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీనికి సంబంధించి శుక్రవారం పంజాబ్ రాష్ట్ర అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ మన్మోహన్ సింగ్ మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. ఆ ఉగ్రవాది ఉత్తరప్రదేశ్ లో ఉన్నాడన్న సమాచారంతో 19 మంది సభ్యుల పంజాబ్ పోలీసుల బృందం గోరఖ్ పూర్ కు వెళ్లిందన్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. గురువారం ఆ ఉగ్రవాదిని అమృతసర్ కోర్టులో హాజరుపరచగా, అతనికి పోలీస్ రిమాంద్ విధించినట్లు మన్మోహన్ తెలిపారు.
కేసీఎఫ్ (ఖాలిస్తాన్ కమాండో ఫోర్స్) లో కీలక సభ్యుడైన రతాన్ దీప్ సింగ్.. ప్రస్తుతం మరో ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ బీకేఐ(బాబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్) సంస్థకు నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.