breaking news
Rama Krishnudu
-
యనమల ఇంట్లో టికెట్ లొల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడికి ఇంటిపోరు పెద్ద తలనొప్పిలా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం తునిలో తన రాజకీయ వారసురాలిగా కూతురిని తెరపైకి తీసుకొచ్చి.. తమ్ముడు యనమల కృష్ణుడికి మొండిచేయి చూపుతూ చక్రం తిప్పారు. ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఇన్చార్జిగా యనమల కృష్ణుడే అన్నీ తానై చూసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమ నాయకుడిని కాదని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ఎక్కడో ఉన్న రామకృష్ణుడి కుమార్తె దివ్యను రంగంలోకి దించడంతో కృష్ణుడి అనుచరవర్గం మండిపడుతోంది. ఇప్పుడు రామకృష్ణుడు తన చిన్నాన్న కుమారుడైన కృష్ణుడికి పూర్తిగా చెక్ పెట్టేందుకు.. సొంత సోదరుడి కుమారుడు రాజేష్‌ను రంగంలోకి దించడంతో తాడేపేడో తేల్చుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యారు. పక్కా వ్యూహంతో తమ్ముడిని దెబ్బకొట్టిన యనమల యనమల కృష్ణుడి వల్లే టీడీపీ నష్టపోయిందనే సాకుతో అభ్యర్థి బరి నుంచి ఆయనను తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించింది. ఇది కృష్ణుడి వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. మరోవైపు దివ్యకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఎదురు కాకుండా కృష్ణుడిని పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రామకృష్ణుడు సోదరుడి కుమారుడు రాజేష్‌ను పావుగా వాడు కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దివ్యను టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సందర్భంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కృష్ణుడు.. పార్టీ మారే ఆలోచన కూడా చేశారనే ప్రచారం జరిగింది. దివ్య నియామకాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణుడి వర్గం బాహాటంగానే వ్యతిరేకించింది. పార్టీని ఇంతకాలం మోసిన కృష్ణుడిని పక్కన పెట్టిన రోజే యనమల కుటుంబంలో ఇంటి పోరుకు తెరలేచింది. అనంతర పరిణామాల్లో ఆయనను బుజ్జగించడంతో కృష్ణుడిని దారిలోకి తెచ్చుకున్నామని రామకృష్ణుడు సంబరపడ్డారు. లోలోన రగిలి పోతున్న కృష్ణుడు సమయం కోసం వేచిచూశారు. రాజేష్ రాకతో కాక రామకృష్ణుడి సోదరుడి కుమారుడు రాజేష్, కృష్ణుడి వర్గాలు రామకృష్ణుడి సమక్షంలోనే ఇటీవల పరస్పరం కొట్లాటకు దిగారు. దివ్యను ఇన్చార్జిగా నియమించిన సమయంలో కృష్ణుడు రాజకీయంగా అస్త్రసన్యాసం చేసి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దివ్య వెంట రాజేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉండగా, రాజేష్ తొండంగి మండల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలోనే కృష్ణుడు ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని రామకృష్ణుడి వర్గం కృష్ణుడికి పొమ్మనకుండానే పొగబెట్టేలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ కార్యకలాపాలకు కృష్ణుడు దూరంగా ఉన్నంతసేపు ఖుషీగా ఉన్న ఆ వర్గానికి.. కృష్ణుడు తిరిగి పార్టీలో చురుగ్గా ఉండటం రుచించడం లేదంటున్నారు. ఇందుకు రాజేష్‌ను పావుగా వాడుకుంటూ కృష్ణుడిపైకి ఉసిగొల్పుతున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు యనమల కృష్ణుడు సిద్ధం రాష్ట్ర రాజకీయాల్లో రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుండగా.. ఆయన తరఫున తునిలో అన్నీ తానై చూసుకున్న కృష్ణుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే వెనకాల వచ్చిన రాజేష్‌కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఉంటే రాజేష్ అయినా ఉండాలి లేక తమ నాయకుడికైనా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కృష్ణుడి వర్గం వాదన వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. తునిలో బుధవారం జరగనున్న చంద్రబాబు సభలోపు ఈ విషయంపై తాడోపేడో తేల్చాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులతో యనమల రామకృష్ణుడికి ఎటూ పాలుపోని పరిస్థితి ఉంది. ఈలోగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
జగన్ భూములే అయితే జనానికి పంచరేం?
- మంత్రి యనమల మౌనంలో ఆంతర్యమేమిటి? - కేఎస్ఈజెడ్ ప్రభుత్వ భూములపై ‘దేశం’ నేతల కన్ను - అడ్డుకోవడానికి న్యాయ పోరాటం సాగిస్తాం - వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల తుని : కాకినాడ సెజ్ భూములన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డివని గతంలో ప్రచారం చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ భూములను రైతులకు పంచకుండా మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఆయన గురువారం తొండంగి మండలం పెరుమాళ్లపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆ భూములు తనవే అయితే వెంటనే రైతులకు పంచాలని ఇటీవల జగన్ డిమాండ్ చేసినా యనమల స్పందించక పోవడం వెనుక రహస్యాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడ సెజ్ భూములను కారు చౌకగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వంకార్పోరేట్ సంస్థ అయిన జీఎంఆర్‌కు ధారాదత్తం చేసిందని విమర్శించారు. పట్టిసీమలో ఎకరానికి రూ.23 లక్షల పరిహారం ఇచ్చారని, ఇక్కడ రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని, లేకపోతే పట్టిసీమ లాగే ఇక్కడా రూ.23 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెజ్ భూములకు సమీపంలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములను రహస్య ఒప్పందం ప్రకారం టీడీపీ నేతలు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి ఆధారాలు సేకరించామని, దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి తాము సహకరిస్తామన్నారు. అయితే ఇక్కడ జరిగేది పచ్చ చొక్కాల నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారుల అండదండలతో సాగుతున్న అవినీతిపై పోరాటం మాత్రమే అన్నారు. పెట్రో కారిడార్ వల్ల ఈ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తక్కువ ఓట్ల శాతంతో గద్దెనెక్కిన టీడీపీ నాయకులు జీవితాంతం అధికారంలో ఉంటామనుకుంటే సాధ్యం కాదన్నారు. ఏది ఏమైనా సెజ్ రైతులకు న్యాయం జరిగే వరకు అహర్నిశలు పోరాటం సాగిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.