breaking news
rajendra rathore
-
‘అది 440 వోల్ట్ల కరెంట్.. కాంగ్రెస్‌కే షాకిస్తుంది’
జైపూర్: రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 135 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఉంటుందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా "అండర్ కరెంట్" (లోలోపల అనుకూలత) ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర సింగ్ రాథోడ్ వ్యంగ్యంగా స్పందించారు. "అండర్ కరెంట్ ఉందని గెహ్లాట్ సాబ్ చెప్పింది నిజమే. అది 440 వోల్ట్లు. ఆయన చెబుతున్న అండర్ కరెంట్ కాంగ్రెస్‌కే షాక్ ఇస్తుంది" అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేదని, రాష్ట్రంలో ఆ పార్టీని గద్దె దించేందుకే ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ‘కాంగ్రెస్ అవమానకరమైన పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ 135 సీట్లకు పైగా సాధిస్తుంది. ఇది అతిపెద్ద ఎన్నికల విజయాలలో ఒకటి’ అని రాథోడ్ పేర్కొన్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
మంత్రి సీరియస్.. 15 మంది డాక్టర్లపై చర్యలు
విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 15 మంది సీనియర్ డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని, వాళ్లందరికీ చార్జి షీట్లు జారీ చేయాలని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. మంత్రి రాజేంద్ర రాథోడ్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వచ్చిన సమయంలో వైద్యులు ఎవరూ ఓపీ సమయానికి కూడా తమ ఛాంబర్లలో లేరు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ల గురించి అడిగితే.. రౌండ్లలో గానీ, ఆపరేషన్ థియేటర్లలో గానీ ఉండొచ్చని, అక్కడ కూడా లేకపోతే మెడికల్ కాలేజిలో క్లాసులు తీసుకుంటూ ఉంటారని చెప్పడంతో రాథోడ్ ఆగ్రహం మరింత పెరిగింది. దాంతో ఒళ్లు మండిన ఆయన.. వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులలోను బయోమెట్రిక్ మిషన్లు పెట్టి హాజరు తీసుకోవాలని ఆదేశించారు. ఓపీ కోసం కేటాయించిన సమయంలో తప్పనిసరిగా పేషెంట్లను చూడాలని చెప్పారు. ఆయన రిజిస్ట్రేషన్ కౌంటర్, నర్సింగ్, డాక్టర్ల గదులు అన్నీ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో టెస్టింగ్ సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగారు. డిసెంబర్ నాటికల్లా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు ఎవరైనా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాంటి వైద్యులను స్టింగ్ ఆపరేషన్ల ద్వారా కూడా గుర్తిస్తామని హెచ్చరించారు. ఉచిత మందుల కౌంటర్ల వద్ద వేచి ఉన్న రోగులతో కూడా ఆయన మాట్లాడారు. అక్కడ ఎక్కువ సేపు వేచి ఉండాల్సి రావడంతో వెంటనే మరో 11 కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. చికన్ గున్యా వచ్చి ఇటీవలే కోలుకున్న రాజేంద్ర రాథోడ్.. తన ఆకస్మిక తనిఖీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో డెంగ్యూ, చికన్ గున్యా లాంటి సీజనల్ వ్ఆయధులు ఎక్కువగా ఉన్నాయని, స్వైన్ ఫ్లూ కూడా కనిపిస్తోందని తెలియడంతో ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. ఓపీడీలో ఫార్మాసిస్టు గోవింద్ శర్మపై రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో అతడిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. హాజరు పట్టీలో సంతకాలు చేయని 51 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.