breaking news
Raja Meenakshi
-
తప్పు చేసి.. మళ్లీ నాపై నిందలా!
♦ లంచం ఆరోపణలపై మంత్రి సరోజ ..రాజామీనాక్షిపై ఆగ్రహం సాక్షి, చెన్నై : తప్పు చేసింది కాకుండా, తప్పించుకునేందుకు నిందల్ని తన మీద మోపుతున్నారని లంచం వ్యవహారంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సరోజ ఆవేదన వ్యక్తం చేశారు. రాజామీనాక్షి ఆరోపణలపై మంగళవారం ఆమె వివరణ ఇచ్చారు. ధర్మపురి జిల్లా శిశుసంక్షేమ శాఖ అధికారిణి రాజామీనాక్షి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సరోజపై గత వారం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను శిశుసంక్షేమ శాఖాధికారిణిగా కొనసాగాలంటే రూ.30 లక్షలు లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపించి రాజకీయంగా చర్చకు తెరలేపారు. లంచం కోసం తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు రాజా మీనాక్షి ఫిర్యాదు కూడా చేశారు. ఈ వ్యవహారంతో విమర్శల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మంత్రితో పాటు సీఎం పళని ప్రభుత్వానికి తప్పలేదు. రెండు మూడు రోజులుగా ఈ వ్యవహారంపై మంత్రి సరోజ కూడా నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రా జామీనాక్షి ఆరోపణల్ని తిప్పి కొడుతూ సరోజ ఓ ప్రకటన విడుదల చేశారు. తప్ప చేసి నిందలా: చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రాజామీనాక్షి నిందల్ని తన మీద వేస్తున్నారని మంత్రి సరోజ ఆవేదన వ్యక్తం చేశారు. శిశుసంక్షేమ శాఖలో రాజామీనాక్షి తాత్కాలిక ఉద్యోగిగా పేర్కొన్నారు. పనిచేస్తున్న చోట చేతి వాటం ప్రదర్శించి విచారణను ఎదుర్కొంటున్న రాజాలక్ష్మి తన మీద నిందలు వేసి రాజకీయ జీవితానికి, తన వైద్య వృత్తికి కలంకం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా, శిశు వైద్యురాలిగా తాను చేస్తున్న సేవలకు, రాజకీయ పయనంలో తన ఉత్సాహానికి మెచ్చి అమ్మ జయలలిత మంచి గుర్తింపు, పదవిని ఇచ్చారని గుర్తు చేశారు. సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న తన మీద రాజామీనాక్షి ఆరోపణలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజామీనాక్షి విచారణను ఎదుర్కొంటున్నారని, గత నెల విచారణకు రావాల్సి ఉన్నా, అనారోగ్య కారణాలతో తప్పించుకున్నట్టు వివరించారు. ఆమె చేతివాటం ప్రదర్శించారన్నది ధ్రువీకరించబడి ఉందని, ఇక ఆమెపై చర్యలు తప్పదన్న నిర్ణయానికి సంబంధిత జిల్లా అధికారులు వచ్చి ఉన్నారని తెలిపారు. గత వారం తన వద్దకు వచ్చిన రాజామీనాక్షి పర్మినెంట్ చేయాలని, విచారణ నుంచి బయటపడే మార్గం చూపించాలని, చెన్నైకు బదిలీ చేయాలని కోరడం జరిగిందన్నారు. ఇందుకు తాను అంగీకరించకుండా బయటకు పంపించానని, దీంతో ఆమె చేసిన తప్పును కప్పిపుచ్చుకునే యత్నంలో తన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడాల్సినంత అవసరం తనకు లేదు అని, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు. -
లంచం..కలకలం
► మంత్రి సరోజ ఓ లంచగొండి ► నాలుగేళ్లలో రూ.4వేల కోట్ల లక్ష్యంగా ముడుపులు ► బదిలీకి రూ.30 లక్షల డిమాండ్ ► పోలీసు కమిషనర్‌కు శిశుసంక్షేమశాఖ అధికారిణి ఫిర్యాదు ► రక్షణ కల్పించాలంటూ వేడుకోలు ఆమె ఓ సాధారణ స్థాయి అధికారిణి. లంచం విషయంలో చిర్రెత్తిపోయారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిపైనే గురువారం పోలీస్ కమిషనర్‌కుఫిర్యాదు చేశారు.నాలుగేళ్లలో రూ.4 వేల కోట్ల ముడుపులు లక్ష్యంగా మంత్రికి సహకరించాలని కోరారని, తన బదిలీకి రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ధర్మపురి జిల్లా శిశుసంక్షేమ శాఖాధికారిణిగా పనిచేస్తున్న రాజామీనాక్షి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సరోజపై సంచలన ఆరోపణలు చేశారు. శిశుసంక్షేమ శాఖాధికారిణిగా కొనసాగాలంటే రూ.30 లక్షలు లంచంగా ఇవ్వాలని మంత్రి తనను డిమాండ్ చేసినట్లు రాజకీయాల్లో కలకలం రేపారు. ఈనెల 7వ తేదీన చెన్నైలోని తన ఇంటికి రప్పించుకుని బెదిరించినట్లు ఆరోపించారు. చెప్పిన మాట వినకుంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందనే భయంతో బైటకు వచ్చేసినట్లు ఆమె తెలిపారు. ధర్మపురి జిల్లాలో మీడియాకు ఈ విషయాలు వివరించి చెన్నైకి చేరుకున్నారు. గురువారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చి మంత్రి సరోజపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లంచం అడిగి, బెదిరింపులకు గురిచేసిన మంత్రి సరోజపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి జిల్లా శిశుసంక్షేమశాఖలో భద్రతాధికారిణిగా తనను జయలలిత స్వయంగా నియమించారు. విధుల్లో నేను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను. అయితే జయలలిత మరణం తరువాత ఆ బాధ్యతల్లో నన్ను సరిగా పనిచేయనీయలేదు. మంత్రి సరోజ వల్ల తరచూ ఒత్తిడికి గురవుతున్నాను. ఈ విధులకు రూ.10లక్షలు తీసుకుని ఉత్తర్వులు ఇస్తానని చెబుతున్నారు. మంత్రి భర్త సైతం బెదిరింపులకు గురిచేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.10లక్షలు చెల్లించాను. అనారోగ్య కారణాలు, బిడ్డ పెంపకం కోసం చెన్నైలోనే ఉండి విధులు నిర్వర్తించేలా బదిలీ చేయాల్సిందిగా మంత్రికి వినతిపత్రం సమర్పించాను. ఈ వినతిపై మాట్లాడేందుకు రావాలని నన్ను మంత్రి ఇంటికి పిలిపించుకున్నారు. శాఖాపరమైన రికార్డులతో ఈనెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు చెన్నైలో మంత్రి ఇంట్లో కలువగా, ‘చెన్నైకి బదిలీ కోరుతూ నీ వినతిని పరిశీలించాను, బదిలీ చేయాలంటే రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది, ఇక నీకు అండగా నిలిచేవారు ఎవరూ లేరు, ఈ నాలుగేళ్లలో కనీసం రూ.4వేల కోట్లు సంపాదించాల్సి ఉంటుంది, వీలైతే ప్రస్తుత రేటు రూ.30లక్షలు ఇవ్వు, లేకుంటే అదే మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారికి నీ బాధ్యతలు అప్పగిస్తాను. ఈ ఆదేశాలను ధిక్కరించినా, లంచం విషయం బైట చెప్పినా నీ ఉద్యోగం ఊడగొట్టడంతోపాటు నిన్నుæ నామరూపాలు లేకుండా చేస్తాను’ అని మంత్రి బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వల్ల తరచూ వేధింపులకు గురవుతూ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని వాపోయారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని కలగకుండా రక్షణ కల్పించా లని కమిషనర్‌ను వేడుకున్నారు. కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించిన అనంతరం ఆమె మీడియాకు వివరించారు. విపక్షాల విమర్శల వెల్లువ: లంచం కోసం అధికారిణిని బెదిరించిన మంత్రి సరోజపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అక్రమార్జనలో మంత్రి విచ్చలవిడి తనం బట్టబయలైందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మంత్రి వర్గం నుంచి సరోజను బర్తరఫ్ చేయాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రజలు పలు సమస్యలు, కనీసం తాగునీరు కూడాలేక అల్లాడుతుండగా అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిపైనే పూర్తిస్థాయి దృష్టిపెట్టిందన్న తన ఆరోపణలు సరోజ రూపంలో రుజువయ్యాయని ఆయన అన్నారు. మంత్రి సుజాతపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ డిమాండ్ చేశారు.