breaking news
Raj kot
-
ఐదు వికెట్లతో చెలరేగిన జడ్డూ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లోయార్డర్ ఆటగాడు మార్క్ వుడ్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ మరో డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 238 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. జైశ్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్(91), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్(68*) అద్భుతంగా రాణించారు. ఫలితంగా ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్ధేశించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సైతం భారత్ 445 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) భారత్ సెకెండ్ ఇన్నింగ్స్: 257/3 (యశస్వి 115 నాటౌట్) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 122/10 -
రాజపుత్రుడి అశ్విక దళం!
గుర్రాలపై రవీంద్ర జడేజా మోజు క్రికెటర్లలో భిన్నమైన సరదా రాజ్‌కోట్: పిచ్చి పలు రకాలు...ఇక సెలబ్రిటీల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఆటపరంగా ఎంతో ప్రొఫెషనలిజం కనబరిచే క్రికెటర్లు సొంత ఇంటికి వచ్చే సరికి మాత్రం భిన్నంగా మారిపోతారు. సరదాలు తీర్చుకుంటూ తమదైన ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు. భారత క్రికెటర్లలో రవీంద్ర సింహ్ జడేజాది కూడా ఇదే శైలి. రాజ్యాలు పోయినా...రాజులు పోయినా రాజపుత్ర వంశం అనే తోక మాత్రం జడేజాకు మిగిలిపోయింది. అప్పటి ప్రభావం అతనిపై ఇంకా మిగిలే ఉన్నట్లుంది...అందుకే జడేజాకు గుర్రాలంటే అమిత ఇష్టం. ఎప్పుడు విరామం దొరికినా తన స్వస్థలం జామ్‌నగర్‌కు వెళ్లిపోయి గుర్రాలపై స్వారీ చేస్తాడు. వాటితో ఆడుకోవడమే అతనికి పెద్ద సరదా. లక్కీ నంబర్ 8 ప్రస్తుతం జడేజా వద్ద నాలుగు మేలు జాతి అశ్వాలు ఉన్నాయి. ధన్‌రాజ్, గంగ, కేసర్, జానకి అని వాటికి అతను పేర్లు పెట్టాడు. మూడేళ్ల క్రితం అతను జామ్‌నగర్ శివార్లలో ఎనిమిది ఎకరాల స్థలం కొని అక్కడ ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే తన గుర్రపు శాల కూడా సిద్ధం చేశాడు. వాటిని పోషించేందుకు ప్రత్యేక ట్రైనర్‌ను నియమించిన జడేజా...మ్యాచ్‌లు లేని సమయంలో ఆ గుర్రాలతోనే టైమ్‌పాస్ చేస్తాడు. వాటిపై స్వారీ చేస్తూ సమీప ప్రాంతాలన్నీ అతను చుట్టి వస్తుంటాడు. అదే ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలోనే గుర్రాలకు కావాల్సిన ఆహారపు పెంపకం కూడా జరుగుతుంది. ‘ఇప్పుడు నా వద్ద నాలుగు గుర్రాలు ఉన్నాయి. కానీ నా అదృష్ట సంఖ్య ఎనిమిది. కాబట్టి కనీసం మరో 4 గుర్రాలు కొనాల్సి ఉంది’ అని జడేజా అన్నాడు. క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆరంభంలో అతను పెద్ద సంఖ్యలో పావురాళ్లు, కుందేళ్లు, కుక్కలు, విభిన్న రకాల చేపలు ఇంటికి తెచ్చేవాడు. చిన్నప్పటినుంచే పక్షులు, జంతువులను పెంచుకునేవారా అని అడిగితే...‘అప్పుడు మా తిండికే దిక్కు లేదు. ఇక వీటిని ఎక్కడ పోషిస్తాను’ అని తన పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటాడు ఈ ఆల్‌రౌండర్. చెబితే వింటేగా... ‘గుర్రాలకంటే బైక్‌లు ఎంతో మెరుగని ఎన్నో సార్లు అతనికి చెప్పాను. బైక్‌లను ఒక్కసారిగా గ్యారేజీలో పడేసి అవసరమున్నప్పుడు పెట్రోల్ పోసి బైటికి తీయవచ్చు. అదే గుర్రాలైతే రోజూ మేపాలి. నాలుగు గుర్రాలకు జడేజా పెట్టిన డబ్బుతో నేను నాలుగు బైక్‌లు కొంటాను. కానీ ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోడు’ - ఎంఎస్ ధోని, భారత కెప్టెన్ ప్రియ నేస్తాలు... ఎప్పుడు అవకాశం దొరికినా గుర్రాలపై తన ప్రేమను ప్రదర్శించేందుకు జడేజా వెనుకాడడు. ‘గుర్రాలు దగ్గరగా ఉంటే దెయ్యాలులాంటివి కూడా దరి చేరవని నేను చదివాను. వాటి లక్షణాలను బట్టి నేను అవి ఏ జాతివో గుర్తించగలను. అన్నట్లు...కేసర్ చతేశ్వర్ పుజారాలాంటిది. చాలా పని చేస్తుంది కానీ సెలైంట్‌గా ఉంటుంది’ అని జడేజా నవ్వేస్తాడు.