breaking news
Raithu Garjana
-
రైతును మోసం చేసే సభ: వినోద్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రైతు గర్జన పేరిట కాంగ్రెస్ నేతలు లేనిపోని అబద్దాలతో వారిని మోసం చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముమ్మాటికీ కరెక్టేనని సమర్ధించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులతో కలిసి వినోద్‌కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘గతంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మహారాష్ర్ట ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న 250పైగా ప్రాజెక్టులను నిలువరించలేకపోయిందన్నారు. దాని ఫలితంగానే నేడు వర్షాలు కురుస్తున్నా నేటికీ ఎస్సారెస్పీ నిండక... ఈ ప్రాంత రైతులు నాట్లు కూడా వేయలేని దుస్థితి నెలకొందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకునే 2014 నుంచి గోదావరిపై నీటి లభ్యతపై సర్వేలు నిర్వహించిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. పదేపదే రీడిజైనింగ్, అవినీతి గురించి మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ప్రశ్నలకు సమాధానమివ్వాలని సవాల్ విసిరారు. -
కాంగ్రెస్ రైతు గర్జన ఎవరికోసం?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రైతు గర్జన పేరుతో హంగామా చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ జిల్లాల్లో తిరిగితే పరిస్థితి తెలిసేదన్నారు. అధికారంలో కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు చేసే రైతుగర్జన ఎవరికోసమో అర్థం కావడం లేదన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి అదనంగా 2,642 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.23.80 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఆయన మాక్లూర్ మండలంలోని గుత్ప, జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లిల వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మునిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఏమి చేస్తున్నారో రైతు గ ర్జనలో చెప్తారా? లేక మా వల్లే నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్ ప్లేగ్రౌండ్‌లా మారిందని చెప్తారా? అని హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పుడు కర్ణాటక మునిగిపోయేంత వర్షాలు పడితే తప్ప నిజాంసాగర్‌లోకి నీరు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు నింపాలన్న ప్రయత్నాన్ని ఓ వైపు అడ్డుకుంటూ.. మరోవైపు రైతు గర్జన చేయడం ప్రజాద్రోహం అవుతుందని పేర్కొన్నారు. సింగూరు జలాలను గత పాలకులు హైదరాబాద్ తాగునీటికోసం తరలించడం వల్ల మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా జలాలను తరలిస్తున్నందున సింగూరు జలాలను ఈ రెండు జిల్లాల ఆయకట్టుకే కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, వీజీ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వం అవసరం: డీఎస్ తెలంగాణ ఏర్పాటు ఎంతటి చారిత్రక అవసరంగా నిలిచిందో.. ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అంతే అవసరం అని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వాన్ని పటిష్ట పరచాలని పిలుపునిచ్చారు. మంజీర నదిపై పొరుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదని నిజామాబాద్ ఎంపీ కవిత ఆరోపించారు.