breaking news
prevention of abuses
-
ప్రభుత్వ ఉద్యోగుల తక్షణ అరెస్టు వద్దు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నివారణ) చట్టం–1989కి సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ చట్టం కింద కేసు నమోదైతే నిందితులెవ్వరినీ తక్షణమే అరెస్టు చేయకూడదనీ, కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే అరెస్టు చేయాలంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వారి సంబంధిత నియామక విభాగం అనుమతి పొందిన తర్వాతనే అరెస్టులు చేయాలని జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ చట్టాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసులతో బెదిరిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారనీ, అమాయక పౌరులను వేధిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘నిజంగా నేరాలు జరిగిన కేసుల్లో మాత్రమే ముందస్తు బెయిలు మంజూరు చేయకూడదు. నేరం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కానప్పుడు కూడా బెయిల్ ఇవ్వకపోతే అప్పుడు నిర్దోషులకు రక్షణ లేనట్లే’ అని న్యాయమూర్తులు తమ 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ‘దురుద్దేశంతో కేసు పెట్టారని, నేరం జరగలేదని ప్రాథమికంగా తెలిసినప్పుడు.. అలాంటి కేసుల్లో ముందస్తు బెయిలు ఇవ్వడంపై సంపూర్ణ నిషేధమేదీ లేదు. అమాయకులను వేధించడానికి చట్టాలను దుర్వినియోగం చేస్తుంటే.. దానిని అరికట్టే అధికారం మాకుందని మరోసారి చెబుతున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ ఆదేశాల ద్వారా తాము ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 18ని నిర్వీర్యం చేయడం లేదనీ, నిజంగా నేరాలు జరిగిన కేసుల్లో, కస్టడీలో నిందితులను విచారించాల్సిన కేసుల్లో ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టులు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘పోలీసులు, ఇతరులు దురుద్దేశంతో పౌరులపై వేధింపుల కోసం చట్టాన్ని ఆయుధంగా వాడుకోకూడదు. కానీ ఇలా జరిగినట్లు అనేక సందర్భాల్లో బయటపడింది’ అని కోర్టు పేర్కొంది. ‘ఒక పౌరుడి కులమతాలేవైనా అతణ్ని వేధించడం రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం. ఆ హక్కుకు ఈ కోర్టు రక్షణ కల్పిస్తుంది. చట్టం వల్ల కుల విద్వేషాలు రాకూడదు’ అని న్యాయమూర్తులు అన్నారు. -
దురాచారాల నివారణకు కళాజాత ప్రదర్శనలు
♦ బెల్టుషాపులపై కొరడా ♦ నిర్వాహకులకు రూ.50 వేల జరిమానా ♦ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేసులు ♦ నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటుకు మున్సిపాలిటీకి లేఖ ♦ బహిరంగ ధూమపానం చేస్తే కఠినచర్యలు ♦ తాండూరు ఏఎస్పీ చందనదీప్తి గ్రామాల్లో సాంఘిక దురాచారాల నివారణకు ప్రజలను చైతన్యం చేసేందుకు కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తాం. బెల్టుషాపులపై కొరడా ఝుళిపిస్తాం. అక్రమంగా కల్లు దుకాణాలు నిర్వహిస్తే సంబంధిత ఎస్ఐలపై చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు. బహిరంగంగా ధూమపానం చేస్తే కేసులు నమోదు చేస్తాం. - చందనదీప్తి, తాండూరు ఏఎస్పీ తాండూరు: బాల్య వివాహాలు, రెండు గ్లాసుల పద్ధతి, మూఢనమ్మకాలు తదితర దురాచారాలపై నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏఎస్పీ చందనదీప్తి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ఆరంభిస్తామన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో అక్రమ కల్లు దుకాణాలతోపాటు బెల్టుషాపులపై కొరడా ఝళిపించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. సంబంధిత ఎస్ఐలు అక్రమ కల్లు దుకాణాలు, బెల్టుషాపులను అరికట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ విషయంలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల్లో బెల్లుషాపులు, అక్రమ కల్లు దుకాణాలు ఉన్నట్టు తేలితే సదరు ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని చందనదీప్తి స్పష్టం చేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే బైండోవర్ చేస్తామని, రెండోసారి అయితే రూ.50 వేల జరిమానా విధించనున్నట్టు ఏఎస్పీ స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. పట్టణంలోని బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, హోటళ్ల వద్ద ద్విచక్రవాహనాలు, ఇతర భారీ వాహనాలు అడ్డగోలుగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య వస్తున్నట్టు గుర్తించామన్నారు. ఆయా సంస్థల నిర్వాహకులకు, ట్రాన్స్‌పోర్టు సంస్థలకు నోటీసులు జారీ చేయాలని అర్బన్ సీఐ, ఎస్ఐలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆయా సంస్థల నిర్వాహకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. వాహనదారులకు జరిమానాలతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. నో పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాయనున్నట్టు చెప్పారు. బహిరంగంగా ధూమపానం చేసినా, ప్రజలకు అసౌకర్యంగా వ్యవహారించినా ఐపీసీ 290 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏఎస్పీ చందనదీప్తి హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని, పునరావృతమైతే కేసులు పెడతామని స్పష్టం చేశారు. పోలీసుశాఖ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఏఎస్పీ చందనదీప్తి కోరారు.