breaking news
PREMIUM RATE
-
ఇక మోత మోగనున్న వాహన ప్రీమియం
న్యూఢిల్లీ : మిడ్ సైజ్డ్ కార్లకు, ఎస్‌యూవీలకు, మోటార్ సైకిళ్లకు, కమర్షియల్ వెహికిల్స్ కు ఇక ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు మోత మోగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ వాహనాలపై 50 శాతం ప్రీమియం పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. అయితే చిన్న కార్లకున్న(1,000సీసీ వరకున్న) థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఐఆర్డీఏఐ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కార్లకు ప్రస్తుతమున్న రూ.2,055 ప్రీమియంనే కొనసాగించనుంది. మిడ్ సైజ్డ్ కార్లు(1000-1500సీసీ), ఎస్‌యూవీలు, పెద్ద కార్లకు మాత్రమే 50 శాతం ప్రీమియంను పెంచాలని ఐఆర్డీఏఐ నిర్ణయించింది. 1000సీసీ వరకున్న కార్లకు రూ.3,355, పెద్ద వాటికి రూ.9,246 వరకు ప్రీమియం రేట్లను ఐఆర్డీఏఐ పెంచనుంది. అదేవిధంగా స్పోర్ట్స్ బైక్, సూపర్ బైక్స్ 350సీసీ కంటే ఎక్కువున్న వాటికి ప్రీమియం ప్రస్తుతమున్న రూ.796 నుంచి రూ.1,194కు పెరగనుంది. ఎంట్రీ లెవల్ బైక్స్(77-150 సీసీ) కూడా ప్రీమియం రేట్లను పెంచాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. 6హెచ్‌పీ వరకున్న ట్రాక్టర్స్ కు ఇక ప్రీమియం రూ.765. ఈ-రిక్షాల ప్రీమియం రేట్లను పెంచాలని ఐఆర్డీఏఐ ప్లాన్ చేస్తోంది. -
మీ కారు బీమా మారుస్తారా..?
కారు కొనుక్కునేటప్పుడు అనేక విషయాలు ఆలోచిస్తాం. బోలెడంత రీసెర్చ్ చేస్తాం. మన లైఫ్‌స్టయిల్‌కి, బడ్జెట్‌కి తగినట్లుగా ఉంటుందా లేదా అనేది చూసుకుని కొంటాం. ఇలా లక్షలు పోసి కొనుక్కున్న కారు నుంచి పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందాలంటే .. దాని మెయింటెనెన్స్ కూడా ముఖ్యమే. అలాగే, ఎలాంటి దుర్ఘటనా జరగకుండా.. కారు రోడ్డెక్కడానికి ముందే బీమా రక్షణ ఉండటమూ అవసరమే. మరి బీమా పాలసీ తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి చూద్దాం... చాలామటుకు పాలసీలు ఒకే విధంగా కనిపిస్తాయి. ఒకోసారి ఏది తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుంటుంది. ఇలాంటప్పుడు అయిదు అంశాలను కొలమానంగా పెట్టుకుంటే పాలసీ ఎంపిక కొంత సులువవుతుంది. అవేంటంటే.. బ్రాండు, పాలసీ కవరేజీ, కస్టమర్ సర్వీసు, సేవల లభ్యత, ప్రీమియం. బ్రాండు.. కంపెనీ (బ్రాండు) ఎంత పెద్దదైనా కావొచ్చు. క్లెయిముల చెల్లింపులు తదితర అంశాల్లో దాని రికార్డు ఎలా ఉందో చూడాలి. ఎన్ని క్లెయిములు సెటిల్ చేసింది? క్లెయిమ్ సెటిల్మెంట్కు ఎంత సమయం తీసుకుంటోంది? ఇవన్నీ ఆయా బీమా కంపెనీల వెబ్సైట్లలో సాధారణంగా పొందుపర్చి ఉంటాయి. ఈ విషయాల్లో మెరుగైన ట్రాక్ రికార్డున్న సంస్థల పాలసీలు తీసుకుంటే మంచిది. ఒకవేళ ఇప్పటికే వేరే కంపెనీల నుంచి తీసుకున్నా.. మరొక కంపెనీకి బదలాయించుకునేందుకు మోటార్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సదుపాయం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో క్రితం పాలసీ ప్రయోజనాలేమీ నష్టపోనక్కర్లేదు. కవరేజీ... ఏ కంపెనీ నుంచి పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకున్నాక.. కవరేజీ గురించి చూసుకోవాలి. సాధారణంగా కారు ఇన్సూరెన్స్ పాలసీలో థర్డ్ పార్టీ లయబిలిటీ, ఓన్ డ్యామేజి అని రెండు కవరేజీలుంటాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ తప్పనిసరి. ఓన్ డ్యామేజి అన్నది ఐచ్ఛికం. కానీ, ఈ రెండు కవరేజీలు ఉండేలా తీసుకుంటే అటు థర్డ్ పార్టీ రిస్కులతో పాటు ప్రమాదవశాత్తు కారుకేమైనా జరిగినా బీమా రక్షణ ఉంటుంది. కారు ప్రమాదానికి గురైనా, మంటలు.. తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ, ఉగ్రవాద దుశ్చేష్టల్లో ధ్వంసమైనా బీమా రక్షణ లభిస్తుంది. ఇక, కారు ఢీకొనడం వల్ల వేరొకరు గాయపడినా, మరణించినా థర్డ్ పార్టీ లయబిలిటీ కింద కవరేజీ లభిస్తుంది. ప్రస్తుతం పాలసీల్లో పలు యాడ్-ఆన్ ఫీచర్లు కూడా వస్తున్నాయి. క్లెయిమ్ కారణంగా కారు రిపేర్ల కోసం గ్యారేజిలో ఉన్నంత కాలం పాలసీదారు రోజువారీ ప్రయాణ ఖర్చులను కూడా చెల్లించేలా యాడ్ ఆన్ కవరేజీ తీసుకోవచ్చు. ఇలాగే, నిల్ డెప్రిసియేషన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్ట్ లాంటి యాడ్ ఆన్ కవరేజీలు కూడా ఉన్నాయి. అవసరాలకు అనుగుణమైన కవరేజీలను పాలసీదారు ఎంచుకుని తీసుకోవచ్చు. కస్టమర్ సర్వీసులు... మోటార్ ఇన్సూరెన్స్‌లో కస్టమర్ సర్వీసుల విషయానికొస్తే.. ముఖ్యంగా మూడంశాలుంటాయి. అవేంటంటే, పాలసీ జారీ చేయడం, క్లెయిమ్స్‌ని డీల్ చేయడం, ఫిర్యాదులను పరిష్కరించడం. గతంలోలా రోజుల తరబడి నిరీక్షించాల్సిన పని లేకుండా ప్రస్తుతం చాలా బీమా కంపెనీలు అప్పటికప్పుడు పాలసీలను జారీ చేస్తున్నాయి. మార్పులు, చేర్పులూ ఏమైనా చేయాల్సి వచ్చినా సత్వరమే చేస్తున్నాయి. ఇక క్లెయిమ్‌ల విషయానికొస్తే.. పలు కంపెనీలు క్యాష్‌లెస్ సెటిల్మెంట్ కోసం చాలా చోట్ల గ్యారేజీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తద్వారా పాలసీదారుకు శ్రమ తగ్గుతోంది. కాబట్టి, విస్తృతంగా గ్యారేజీలతో ఒప్పందాలు ఉండటంతో పాటు క్లెయిములను వేగంగా సెటిల్ చేసే బీమా కంపెనీలను ఎంచుకోవాలి. సేవల లభ్యత.. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఎవర్ని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితి నెలకొనొచ్చు. ఇలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా .. పాలసీదారు అవసరాలకు అనుగుణంగా సత్వరమే స్పందించగలిగే కంపెనీని ఎంచుకోవాలి. పలు కంపెనీలు కస్టమర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ సేవలు అందిస్తున్నాయి. ప్రీమియం.. పాలసీ తీసుకోవడంలో.. ఎంత ప్రీమియం చెల్లిస్తున్నామన్నది ముఖ్యమే అయినా, ఇదే ప్రామాణికం కాకూడదు. అన్నింటికన్నా తక్కువ ప్రీమియం ఉందనే కారణంతో కంపెనీని ఎంచుకోకూడదు. పై అంశాలన్నీ చూసి మరీ సంస్థను ఎంచుకోవాలి. సాధారణంగా ప్రమాదాలు ఎంత ఎక్కువ జరిగే అవకాశం ఉంటే.. ప్రీమియాలూ అంత ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా కారు మోడల్, దాన్ని ఉపయోగించే ప్రాంతాన్ని బట్టి ప్రీమియం రేటు ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు కారు ఎంత పాతది, ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, రోజువారీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది వంటివికూడా ప్రీమియం రేటు నిర్ధారణలో పరిగణనలోకి తీసుకుంటారు.