breaking news
prasadrao
-
'స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది'
సాక్షి, కాకినాడ : కాకినాడ జేఎన్టీయులో ఏడవ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, యునివర్సిటీ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉంది. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో విద్యార్దులు భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్ బలమైన అణుశక్తిగా ఎదిగిందని, ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు. గాంధీ కలలుగన్న భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ బిహెచ్ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావుకు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 119 మంది విద్యార్థులు గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డి పట్టాలు అందుకున్నారు. -
రెండో విడత ఎన్నికలపై పోలీసు అధికారుల దృష్టి
సాక్షి, హైదరాబాద్: మే 7న సీమాంధ్రలో జరిగే రెండో విడత పోలింగ్‌పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మరోవైపు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్‌కమిటీ కార్యకలాపాలపై గ్రేహౌండ్స్ బలగాలను అప్రమత్తం చేశారు. సీమాంధ్రలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో విశాఖ ఏజెన్సీ ఏరియాలో కూడా మావోయిస్టుల కదలికలపై నిఘాను పెంచారు. డీజీపీ ప్రసాదరావు సీమాంధ్రలో బందోబస్తు గురించి గురువారం సీనియర్ పోలీసు అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా హింసాయుత సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన హెచ్చరికలతో అప్రమత్తం అయ్యారు. అలాగే ఏవోబీలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. -
అడవుల రక్షణఅందరి బాధ్యత
వికారాబాద్/అనంతగిరి, న్యూస్‌లైన్: మానవజాతి మనుగడ కోసం అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి అన్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో అనంతగిరి లాంటి చక్కని అటవీ ప్రాంతం ఉండడం చాలా సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్ట అటవీ ప్రాంతంలో ఆదివారం అటవీశాఖ ఆధ్వర్యంలో 5 కృష్ణ జింకలు, 12 చారల జింకలను సీఎస్ మహంతి, డీజీ పీ ప్రసాదరావు, రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బీఎస్ఎస్ రెడ్డిలు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ.. ఆఫ్రికా ఖండంలో ఉన్న సవన్నా గడ్డి భూములు, అక్కడి వాతావరణం అనంతగిరి గుట్టలో గోచరిస్తోందని, జింకల ఎదుగుదలకు ఇక్కడి వాతావరణం తోడ్పడుతుందన్నారు. జంతువులు ఉండటానికి కేవలం దట్టమైన అడవులే అవసరం లేదని.. ఇక్కడ ఆ రెండూ కలిసి ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. ప్రకృతిలో సమతుల్యత లోపిస్తే ఇటు మానవ మనుగడకు, అటు జంతు జాలానికీ ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పర్యావరణాన్ని అభివృద్ధిపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతగిరి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. హైదరాబాద్‌కు చేరువలో అటవీ ప్రాంతం ఉండటం సంతోషకరమన్నారు. ప్రస్తుతం వదిలిపెడుతున్న జింకలు ఇంతకుముందున్న జంతు ప్రదర్శనశాలలో కన్నా ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తాయని.. వాటికి స్వేచ్ఛ మనకు పుణ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మానవ జాతి మనుగడకు అటవీశాఖ అభివృద్ధి చాలా అవసరమని స్పష్టంచేశారు. డీజీపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. జింకలు విహరించడానికి అనంతగిరి అడవుల్లో మంచి వాతావరణం ఉందన్నారు. అనంతగిరి అటవీ ప్రాంతంలోప్రస్తుతం 80లోపు వన్యప్రాణులు ఉన్నాయని, మరిన్ని వన్య ప్రాణులను సంరక్షించేందుకు అవకాశముందన్నారు. అడవుల పరిరక్షణకై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందని చెప్పారు. రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఎస్ఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు అటవీ సిబ్బంది ఉన్నారని, స్థానిక గ్రామాలకు చెందిన మరో ఐదుగురిని నియమించి వన్యప్రాణులను పరిరక్షిస్తామన్నారు. మనుషులు పరిసరాల్లోని వన్యప్రాణులపై దాడి చేయడం వల్ల అవి గ్రామాల్లోకి వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. అనంతగిరి అడవుల్లోని ప్రశాంత వాతావరణం అటవీ జంతువుల మనుగడకు చాలా అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. అనంతగిరి అడవిలో ప్రస్తుతం వివిధ రకాల వన్యప్రాణులు 100 వరకే ఉన్నాయని, ఇంకా వదిలిపెట్టడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ జోసెఫ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాష్ట్ర ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ రాజేష్ మిట్టల్, హైదరాబాద్ రేంజ్ కన్జర్వేటివ్ అధికారి రమణారెడ్డి, సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎస్పీ బి.రాజకుమారి, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎఫ్ఓ నాగభూషణం, సబ్ డీఎఫ్ఓ మాధవరావు, ఎఫ్ఆర్ఓ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. కాగా సీఎస్ మహంతి, డీజీపీ ప్రసాదరావు,లు అడవిలో జింకలు వదిలిపెట్టిన అనంతరం అడవిలో నడుచుకుంటూ అనంతపద్మనాభస్వామి ఆలయానికి వెళ్లారు. వీరిని ప్రధాన అర్చకుడు శేషగిరిశర్మ సాదరంగా ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.