breaking news
Prahaar
-
ప్రహార్ క్షిపణి పరీక్ష సక్సెస్
బాలసోర్: భారీ వర్షం మధ్యనే స్వల్ప శ్రేణి క్షిపణి ‘ప్రహార్’ను భారత్ గురువారం ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో–డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనేజేషన్) అభివృద్ధి చేసింది. వివిధ దిశల్లో ఉన్న బహళ లక్ష్యాలను ప్రహార్ ఛేదించగలదని అధికారులు చెప్పారు. చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిపిన పరీక్షలో క్షిపణి అనుకున్న ప్రకారం పనిచేసిందనీ, 200 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిందని వారు వెల్లడించారు. ఈ క్షిపణిలో అత్యాధునిక దిక్సూచి వ్యవస్థ, అడ్వాన్స్డ్ కంప్యూటర్ సహా పలు విశేషాలు ఉన్నాయనీ, అన్ని రకాల వాతావరణాలు, ప్రాంతాల్లో ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని అధికారులు చెప్పారు. -
భారత్లో 70 లక్షల ఉద్యోగాలు కట్ !
-
2050 నాటికి దేశంలో...70 లక్షల ఉద్యోగాలు కనుమరుగు
న్యూఢిల్లీ: దేశంలో గత నాలుగేళ్ల నుంచీ ప్రతీ రోజూ 550 చొప్పున ఉద్యోగాలు కనుమరుగవుతున్న విషయం తెలుసా...? ఇదే విధమైన ధోరణి కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు అంతరించిపోయే ప్రమాదం ఉందట. దేశంలో ఉపాధి అవకాశాలకు సంబంధించి ఢిల్లీకి చెందిన సివిల్ సొసైటీ గ్రూపు ‘ప్రహార్’ నిర్వహించిన అధ్యయనంలో విధాన రూపకర్తలను, నిరుద్యోగులను కలవరపెట్టే ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. రైతులు, రిటైల్ వర్తకులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు ఎక్కువగా ప్రభావితమైన వర్గాలని, ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో జీవనోపాధి ముప్పును ఎదుర్కొంటున్నారని ప్రహార్ సంస్థ తెలిపింది. 2016 ప్రారంభంలో కేంద్ర కార్మిక బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారం చూస్తే 2015లో దేశంలో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు 1.35 లక్షలుగానే ఉన్నాయి. కానీ ఈ సంఖ్య 2013లో 4.19 లక్షలు, 2011లో 9 లక్షలుగా ఉందన్న విషయాన్ని గమనించాలి. దేశంలో ఉపాధి అవకాశాలు పెరగకపోగా రోజూ 550 చొప్పున తరిగిపోతున్నాయి. ఇలానే కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు అంతరిస్తాయి. దేశ జనాభా అదనంగా 60 కోట్ల మేర వృద్ధి చెందుతుంది. ‘దీన్ని బట్టి చూస్తే దేశంలో ఉద్యోగాల సృష్టి అన్నది తగ్గిపోతుందని తెలుస్తోంది. ఇది చాలా కలవరపెట్టే అంశం. వ్యవస్థీకృత రంగం అందించే ఉపాధి నామమాత్రంగా ఉంటోంది. ఈ రంగం కల్పించే ఉపాధి అవకాశాలు ఒక శాతం కంటే తక్కువే. వ్యవస్థీకృత రంగంలో 3 కోట్ల ఉద్యోగాలు ఉంటే, అవ్యవస్థీకృత రంగంలో 44 కోట్ల ఉద్యోగాలున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. తిరిగి మూలాలకు వెళ్లాలని... ప్రస్తుతం 99 శాతం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగాలైన వ్యవసాయం, చిల్లర దుకాణాలు, సూక్ష్మ, చిన్న స్థాయి సంస్థలను కాపాడే చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ రంగాలకు ప్రభుత్వ సాయం కావాలేగానీ నియంత్రణలు కాదని... 21వ శతాబ్దంలో దేశానికి కావాల్సింది స్మార్ట్ గ్రామాలేగానీ, స్మార్ట్ సిటీలు కాదని అధ్యయనం హితవు పలికింది.