breaking news
pragathi vidyanikethan
-
హైదరాబాద్ బాలికలు విశాఖలో ప్రత్యక్షం..
- బాలికల పరారీ కథ సుఖాంతం - ఎంజాయ్ చేయాలని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వైనం ఆరిలోవ (విశాఖ తూర్పు): హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు బాలికలు శుక్రవారం విశాఖలో ప్రత్యక్షమయ్యారు. దీంతో రెండు రోజులుగా రాజధానిలో కలకలం రేపిన బాలికల పరారీ కథ సుఖాంతమైంది. హైదరాబాద్ అంబర్‌పేటలోని బాపూనగర్‌కు చెందిన సంగీత (12), ప్రీతి (12), నందిని (12), శ్రీనిధి (12), ప్రతిభ (12) స్నేహితులు. వీరంతా అంబర్‌పేటలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. గురువారంతో వారి పరీక్షలు ముగియడంతో వేరే ప్రాంతానికి వెళ్లి సరదాగా గడపాలని అనుకున్నారు. కొద్ది రోజుల నుంచే దీని కోసం వారంతా ప్రణాళిక వేసుకున్నారు. పరీక్షలు ముగిసిన రోజు తిరిగి ఇంటికి వెళ్లకుండా నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వారిలో ఓ బాలిక వద్ద రూ.4,000, మరో బాలిక వద్ద రూ.1,900, ఇంకో బాలిక వద్ద రూ.150 ఉన్నాయి. ఆ నగదే వారిని విశాఖ చేర్చింది. అయితే పరీక్ష అనంతరం ఇంటికి చేరకపోవడంతో ఆ బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారి స్నేహితులు, బంధు వులను వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఐదుగురిలో ఓ బాలిక వద్ద సెల్‌ఫోన్ ఉండటంతో గురువారం సాయంత్రానికి ఆ బాలికలు గన్నవరం వద్ద ఉన్నట్లు గుర్తించారు. అదేరోజు రాత్రి పోలీసులు, వారి తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. అనం తరం ఆ బాలిక సెల్‌ఫోన్ జాడ తెలియరాలేదు. గన్నవరం లోనే పోలీసులు, తల్లిదండ్రులు ఉండిపోయారు. తల్లిదండ్రుల చెంతకు బాలికలు.. ప్రభుత్వ బాలుర గృహంలో చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ హుస్సేన్ సమక్షంలో కమిటీ సభ్యులు, ఆరిలోవ పోలీసులు బాలికలను అక్కడకు వచ్చిన వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాలికల పరారీ కథ సుఖాంతమైంది. విశాఖలో వారి జాడ.. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఆ బాలికలు రైలులో విశాఖ చేరుకున్నారు. నేరుగా బీచ్‌కు వెళ్లారు. ఆర్కే బీచ్, ఉడా పార్కులో కొంతసేపు గడిపారు. అక్కడ నుంచి కైలాసగిరి చేరుకుని మధ్యాహ్నం వరకు గడిపి, జూ పార్కుకు చేరుకున్నారు. వన్యప్రాణులను తిలకించి జూలో క్యాంటీన్‌కు వెళ్లి అల్పాహారం తింటుండగా.. వారి యాసను బట్టి జూ ఉద్యోగి విజయ్ వారు తెలంగాణ నుంచి వచ్చినట్టు గుర్తించాడు. వారు పెద్దల సాయం లేకుండానే హైదరాబాద్ నుంచి వచ్చారని తెలుసుకుని.. హైదరాబాద్‌లో ఐదుగురు బాలికలు తప్పిపోయినట్టు టీవీల్లో ప్రసారమవుతున్న వార్త వీరి గురించేనని గుర్తించాడు. వెంటనే జూ అధికారులకు తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఆరిలోవ ఎస్సై శ్యామలరావు సిబ్బందితో అక్కడకు చేరుకుని రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల గృహానికి వారిని తరలించారు. అనంతరం అంబర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. గన్నవరంలో ఉన్న పోలీసులు, బాలికల తల్లిదండ్రులు వెంటనే విశాఖ చేరుకున్నారు. -
ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం కలకలం
హైదరాబాద్: ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం ఘటన నగరంలోని అంబర్‌పేటలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట- బాపునగర్‌లోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు నిధి, ప్రతిభ, సంగీత, ప్రీతి, నందినిలు కనిపించకుండా పోయారని సమాచారం. ఈ విద్యార్థినులు ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. బర్త్‌డే ఫంక్షన్‌కు వెళ్లిన విద్యార్థినులు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో విద్యార్థినుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.