ధనుష్‌కు జంటగా విద్యాబాలన్
యువనటుడు ధనుష్ బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్‌తో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. వేల ఇల్లా పట్టాదారి, మారి చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న ధనుష్ ప్రస్తుతం వీఐపీ 2 చిత్రాన్ని పూర్తి చేసి ప్రభుసాలమన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. కాగా తదుపరి చిత్రానికి కూడ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనికి ఎదుర్‌నీశ్చల్, కాక్కిసట్టై చిత్రాల దర్శకుడు దురై సెంధింల్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు.
నేటి రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో కూడిన ఈ చిత్రంలో ప్రస్తుతం సమాజంలోని ఒక బర్నింగ్ ప్రాబ్లమ్‌ను చర్చించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఇందులో ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. అన్నదమ్ములుగా నటించనున్న ఈ చిత్రంలో అన్న పాత్రకు బాలీవుడ్ నటిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో భాగంగా కహానీ భామ విద్యాబాలన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. విద్యాబాలన్ ఇంతకు ముందు మణిరత్నం తెరకెక్కించిన గురు చిత్రంలో మెరిశారు. ఆ తరువాత కోలీవుడ్ తెరపై కనిపించలేదు. తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.