breaking news
the power
-
20 అణు బాంబుల శక్తి
కఠ్మాండు: నేపాల్‌కు తీరని విషాదం మిగిల్చిన శనివారం నాటి భూకంపం అంచనాలకు మించిన శక్తితో ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం తీవ్రత ఏకంగా 20 హైడ్రోజన్ బాంబుల విస్ఫోటం వల్ల వెలువడే శక్తికి సమానమని నిపుణులు అంచనా వేశారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్‌లోని హిరోషిమా నగరాన్ని తుడిచిపెట్టేసిన అణుబాంబు కన్నా అనేక రెట్లు శక్తిమంతమైన ఇరవై అణు బాంబులు పేలితే ఎంత శక్తి వెలువడుతుందో, కఠ్మాండు లోయను కుదిపేసిన భూకంపం వల్ల కూడా అంత శక్తి వెలువడిందని చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులోనే ఏర్పడటం కూడా ప్రకంపనల తీవ్రతను పెంచిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒకవేళ భూకంపం ఇంకా లోతుగా ఏర్పడినట్లయితే భూమిలోకి శక్తి ఇంకిపోయి, ప్రకంపనల తీవ్రత తగ్గేదని వారు తెలిపారు. జనసమ్మర్ధమైన కఠ్మాండు నగరానికి 40 మైళ్ల దూరంలోనే భూకంపం సంభవించడం వల్ల కూడా ప్రాణనష్టం భారీగా పెరిగిందన్నారు. భూకంపాలు సంభవించిన తర్వాత తదనంతర ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) రావడం సాధారణమే. అయితే, నేపాల్‌లో భూకంపం వచ్చిన అరగంటకే 6.6 తీవ్రతతో శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. దానితో పాటు మొత్తం 20 సార్లు ప్రకంపనలు రావడంతో అవి స్వల్ప తీవ్రతతో వచ్చినా కూడా భూకంపం కారణంగా అప్పటికే బలహీనమై ఉన్న కట్టడాలు కూడా కుప్పకూలిపోయాయి. అయితే, ఇండియన్, యురేసియన్ భూఫలకాలు కలిసేచోట ఉండటమే నేపాల్‌కు శాపమని, ఈ ఫలకాలు ఢీకొంటుండటం వల్ల హిమాలయాలు సైతం ఏటా కొన్ని మిల్లీమీటర్ల మేరకు ఎత్తు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
విద్యుత్ పొదుపు తూచ్..!
కర్నూలు (రాజ్‌విహార్) : విద్యుత్‌ను పొదుపు చేయండి అంటూ ఊదరగొట్టే ఆ శాఖ దానిని అమలు చేయడంలో విఫలమవుతోంది. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే అని చెబుతున్న విద్యుత్ శాఖ అధికారులు.. పొదుపు చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో ప్రతి రోజూ లైన్‌లాస్ కింద 13 లక్షల యూనిట్లు వృథా అవుతున్నా.. దాన్ని అరికట్టేందుకు కసరత్తు చేయడం లేదు. లైన్‌లాస్ నివారణకు 2009లో రూ.50 కోట్లతో హెచ్‌వీడీఎస్ (హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) పనులు చేపట్టారు. ఆ తరువాత మరిన్ని ఫీడర్లలోని గ్రామాలను ఎంపిక చేసి రెండో విడతలో రూ.75 కోట్లతో పనులు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం నివేదికలు కోరింది. దీంతో స్థానిక అధికారులు సర్వే పనులు పూర్తి చేసి నివేదికలు పంపించినా ఇప్పటివరకు కదలిక లేదు. ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా లక్షల యూనిట్లు వృథా అవుతున్నా చర్యలు లేవు. వృథా అయిన విద్యుత్‌ను లైన్‌లాస్ కింద చూపి వినియోగదారులపైనే ఆ భారం మోపుతున్నారు. హెచ్‌వీడీఎస్‌తో లైన్‌లాస్ నివారణ.. రైతులకు ఎల్టీ లైను ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ దూరంగా ఉండడంతో తీగల దూరాన్ని, మోటర్ల వినియోగాన్ని బట్టి విద్యుత్ వృథా అవుతుంది. దీంతో సంస్థ రూ.లక్షల ఆదాయాన్ని కోల్పోతుంది. వృథా అవుతున్న విద్యుత్ (లైన్‌లాస్)ను నివారించేందుకు దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హెచ్‌వీడీఎస్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ కనెక్షన్ కోసం మోటార్ల వద్దకు ఎల్టి లైన్‌కు బదులు హెచ్‌టీ లైను ద్వారా సరఫరా అందించేందుకు ఈ పథకాన్ని శ్రీకారం చుట్టారు. మూడు లేదా నాలుగు వ్యవసాయ మోటార్లు ఉన్న ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సరఫరా అందించేందుకు ఈ విధానాన్ని ఆచరణలో పెట్టారు. జిల్లాలో తొలి విడత (సమైక్య రాష్ట్రంలో మూడో విడత)గా 35 ఫీడర్లు (80 గ్రామాలు)ల్లో పనులు మంజూరు కాగా 23 ఫీడర్లలో పనులు చేపట్టారు. కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి, నల్లకాలువ, అగవెళ్లి, చెరుకుచెర్ల, దూపాడు, ఆలమూరు, ఐకే పేట, పసుపుల, పెద్ద హోతూరు, తంగరడోణ, గాజులదిన్నె, ఇరుపాపురం, కైరుప్పల, బురాన్‌దొడ్డి తదితర ఫీడర్లలో పనులు చేపట్టారు. మొత్తం 100 కేవీఏల ట్రాన్స్పార్మర్లు తొలగించి 16, 25 కేవీఏల సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ పనుల కాంట్రాక్టును టెండరు ద్వారా దక్కించుకున్న కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన స్కిల్‌టెక్ సంస్థ సకాలంలో చేపట్టలేకపోయింది. దీంతో ఐదు సార్లు గడువు పొడిగించారు. అప్పటికీ పూర్తి కాకపోవడంతో కాట్రాక్టరుపై జరిమానా విధించిన సందర్భాలున్నాయి. ఇందులో జరిగిన పనుల కారణంగా 16 శాతం ఉన్న లైన్‌లాస్ 13 శాతానికి తగ్గింది. ముందుకు సాగని రెండో విడత పనులు జిల్లాలో రెండో విడతగా (రాష్ట్రంలో నాలుగో విడత) హెచ్‌వీడీఎస్ పనులు చేపట్టేందుకు 2012లోగ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 100 ఫీడర్లలో ఈ పనులు చేపట్టేందుకు ఏపీ సీపీడీసీఎల్ రూ.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. కర్నూలు డివిజన్ పరిధిలోని పంచలింగాల, జి.శింగవరం, ఉలిందకొండ, లద్దగిరి, గుండ్రేవుల, నన్నూరు, కె.నాగులాపురం, కొత్తపల్లి సబ్ స్టేషన్ల పరిధిలోని 18 ఫీడర్లలో ఈ పనులు చేపట్టనున్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో గోనవరం, గాజులపల్లి, బుక్కాపురం, బండి ఆత్మకూరు, వెలుగోడు, పి.బోధనం, గోస్పాడు, ఉయ్యాలవాడ, నందవరం, కోవెలకుంట్ల, దొర్నిపాడు, రామాపురం, అవుకులో పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే కొలిమిగుండ్ల సబ్ స్టేషన్ల పరిధిలోని 47 ఫీడర్లలో, ఆదోని డివిజన్లోని దిబ్బనకర్, 132 కేవీ సబ్ స్టేషన్, మార్కెట్‌యార్డు, కుమ్మరచేడు, హోళగుంద, బి.అగ్రహారం, మద్దికెర, దేవనకొండ, ఈదుల దేవరబండ, జొన్నగిరి, మద్దికెర, ఆర్ఎస్ పెండేకల్,తుగ్గలి, నందవరం, నాగులదిన్నె, తుంగభద్ర సబ్ స్టేషన్ల పరిధిలోని 35 ఫీడర్లలో పనులు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ చేయూత లేక ఈ పనులు ఆగిపోయాయి. సర్వే పూర్తి చేసి యాజమాన్యానికి నివేదికలు పంపి రెండేళ్లయినా ఇప్పటి వరకు పురోగతి లేదు.