breaking news
port stadium
-
ఎర్రపూల సౌరభం
♦ ఘనంగా ప్రారంభమైన సీపీఎం 21వ మహాసభలు ♦ ఆతిరథులతో కళకళాలడిన పోర్టు స్టేడియం ♦ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మండిపాటు ఉద్యమాల పురిట గడ్డ మరోసారి ఎరుపెక్కింది... అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు మొగ్గతొడిగిన నేలపై మరోసారి ఎర్రపూలు పూశాయి... ప్రజాపోరాటలకు వేదికైన విశాఖ యవనిక మీద ఎర్రదండు కదం తొక్కింది.... విప్లవోద్యమాలకు లాల్‌సలాం చేస్తూ విశాఖపట్నంలో సీపీఎం 21వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజనానంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఓ పార్టీ జాతీయమహాసభలకు ఆతిథ్యం ఇస్తుండటంతో విశాఖ అందరి దృష్టిని ఆకర్షించింది. వర్తమాన రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కసరత్తు చేస్తున్న సీపీఎం జాతీయ మహాసభలు కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ జాతీయ మహాసభలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందుకోసం కొన్ని నెలలుగా సన్నాహాలు చేస్తూ వచ్చింది. మహాసభలను ఘనంగా ప్రారభించింది. వీటికి వామపక్ష పార్టీల కీలక నేతలు, సీపీఎం ప్రతినిధుల రాకతో విశాఖలోని పోర్టు కళావాణి ఇండోర్ స్టేడియం కళకళలాడింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై, సీతారాం ఏచూరి, బిమల్ బోస్, మాణిక్‌సర్కార్, బృందా కారత్, బీవీరాఘవులు, పి.విజయన్, కె.వరదరాజన్, కె.బాలకృష్ణన్, ఎం.ఎ.బేబీ, సూర్యకాంత్ మిశ్రా, ఏకే పద్మనాభన్ తదితర ప్రముఖులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖలో పోర్టు కళావాణి ఆడిటోరియంలో మంగళవారం సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభసూచికగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. సీనియర్ కార్మికోద్యమనేత మహ్మద్ అమీన్ జెండాను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం అక్కడే స్థూపం వద్ద మృతవీరులకు నివాళులు అర్పించారు. కనుమూసిన వీరులారా... మీ త్యాగం వృథాపోదు’అని ప్రజానాట్యమండలి కళాకారులు గేయాలతో విప్లవజోహార్లు అర్పించారు. కార్మికోద్యమ నేత సమన్ ముఖర్జీ, మిల్లు కార్మికుల ఉద్యమ నేత ఎన్.వరదరాజన్, స్వాతంత్య్ర సమరయోథుడు, కార్మికోద్యమ నేత ఆర్.ఉమాపతి, నేతాజీ ఆజాద్హింద్ఫౌజ్ కెప్టెన్ లక్ష్మీసెహగల్, ఐద్వా మాజీ అధ్యక్షురాలు శ్యామిలీ గుప్తా, గోవా విముక్తి ఉద్యమ నేత కేఎల్ బజాజ్ తదితరులకు విప్లవజోహార్లు అర్పించారు. బీజేపీ, టీడీపీ విధానాలను మండిపాటు వర్తమాన రాజకీయ పరిణామాలపై లోతైన చర్చకు పోర్టుకళావాణి ఇండోర్ స్టేడియం వేదికైంది. సీపీఎంతోసహా వామపక్ష పార్టీల నేతలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై వక్తలు మండిపడ్డారు. రైతులు, సామాన్యులను కొల్లగొట్టి కార్పొరేట్పెద్దలకు ప్రయోజనం కలిగిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రకాష్ కారత్, సూరవరం సుధాకర్‌రెడ్డి, కవితా కృష్ణన్, బిమల్ బోస్, పి.మధు తదితరులు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల కార్పోరేట్ అనుకూల విధానాలను ఎండగట్టారు. భూసేకరణ ఆర్డినెన్స్, రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్‌బ్యాంక్ విధానాలను దుయ్యబట్టారు. కార్పొరేట్ పెద్దలకు భూపందేరం కోసమే రాష్ట్రంలో ఏకంగా 75వేల ఎకరాలతోల్యాండ్బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయించారని విమర్శించారు. సీపీఎంతోసహా వామపక్ష పార్టీలన్నీ ఏకతాటి మీదకు రావల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విశాఖ ఉద్యమస్ఫూర్తికి జోహార్ విశాఖపట్నంతోసహా ఉత్తరాంధ్ర విప్లవోద్యమ స్ఫూర్తిని సీపీఎం మహాసభలు ప్రతిఫలించాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్ తన ప్రసంగంలో విశాఖపట్నం విప్లవోద్యమ చరిత్రను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్టీల్‌ప్లాంట్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, బీహెచ్ఈఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు వందలాది చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు ఉన్న విశాఖ కార్మికోద్యమాలకు వేదికగా నిలుస్తోంది. కార్మిక పక్షాలు ఏకమై విజయవంతంగా ఉద్యమాలు నడిపిన చరిత్ర విశాఖకు ఉంది. మరోసారి అలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడింది’అని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కూడా తన ప్రసంగంలో అల్లూరి మన్యం పోరాటం, శ్రీకాకుళం రైతాంగ పోరాటాలను ప్రస్తుతించారు. గురజాడ, గిడుగు, రావిశాస్త్రి, శ్రీశ్రీ తదితరుల అభ్యుదయ, విప్లవ రచనలు ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని ప్రస్తుతించారు. సీపీఎం మహాసభల సందర్భంగా నిర్వహించిన కళాప్రదర్శలను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. -
ముంబను నిలువరించిన టైటాన్స్
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు మీదున్న యు ముంబ జట్టును తెలుగు టైటాన్స్ నిలువరించింది. ఆదివారం పోర్ట్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో 44-43 తేడాతో టైటాన్స్ విజయం దక్కించుకుంది. రాహుల్ రైడింగ్‌కు యుముంబ ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఏకంగా తను 22 రైడ్ పాయింట్లు సాధించాడు. తొలి అర్ధభాగం మరో నిమిషంలో ముగుస్తుందనగా నలుగుర్ని అవుట్ చేయడంతో జట్టు 22-15 ఆధిక్యం సాధించింది. ఆట ముగిసేందుకు ఐదు నిమిషాల గడువు ఉందనగా టైటాన్స్ ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి లోనా సాధించింది. యు ముంబలో అనూప్, పవన్‌లు 13 రైడ్ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 52-30 తేడాతో పాట్నా పెరైట్స్ విజయం సాధించింది. -
విశాఖలో క్రికెట్ సందడి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: యువ క్రికెటర్ల టోర్నీలకు తరచుగా ఆతిథ్యం ఇస్తున్న విశాఖపట్నంలో మరోసారి కుర్రాళ్లు సందడి చేయనున్నారు. భారత్ ‘ఎ’- న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య సిరీస్ నేడు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య ఒక మూడు రోజుల మ్యాచ్, ఒక నాలుగు రోజుల మ్యాచ్, మూడు వన్డేలు నిర్వహిస్తారు. మూడు రోజుల మ్యాచ్ బుధవారం నుంచి పోర్ట్ స్టేడియంలో జరుగుతుంది. మిగిలిన మ్యాచ్‌లన్నీ వైఎస్ఆర్ వీడీసీఏ స్టేడియంలో జరుగుతాయి. భారత్ యువ జట్టుకు అభిషేక్ నాయర్, న్యూజిలాండ్ జట్టుకు లాథమ్ సారథ్యం వహిస్తున్నారు. భారత్ ఆడే వన్డే సిరీస్‌కు మాత్రం ఉన్ముక్త్ చంద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మంగళవారం ఇరు జట్లు వైఎస్ఆర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాయి.