breaking news
pop stars
-
‘ఆ దేవుడు నిన్నూ నన్నూ కలిపాడు.. విడదీసాడు కూడా’
తరచుగా ప్రకృతి విలయాల బారిన పడే ఇండోనేషియాలో సునామీ మృత్యు పాశమై అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి సముద్ర గర్భంలోని ఆనక్ క్రకటోవా అనే అగ్నిపర్వతం బద్ధలై.. సుమత్ర, జావా ద్వీపాల తీరాలపై సునామీగా విరుచుకుపడటంతో ఇప్పటివరకు దాదాపు 429 మంది మరణించారు. ఈ ప్రకృతి ప్రకోపానికి గురై నిరాశ్రయులైన వారు కొందరైతే... ప్రాణాలతో మిగిలి ఉన్నా తమ వారిని కోల్పోయి జీవచ్ఛవాలుగా మారామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సునామీ ధాటికి తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు స్నేహితులను, తన భార్య ఙ్ఞాపకాలను తలచుకుంటూ ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ లీడ్ సింగర్ రిఫియన్ ఫజార్షా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘దిలాన్ సహారా... నువ్వు లేకుండా ఎలా బతకాలి. అత్యుత్తమ భార్యగా ఉండేందుకు నువ్వు ఎల్లవేళలా కృషిచేశావు. నిజానికి నువ్వు అలాగే ఉన్నావు కూడా. అందుకే ఇక దేవుడిని నేను అడగాల్సింది ఏమీ లేదనే నిర్ణయానికి వచ్చాను. కానీ ఈ రోజు అంతా తలకిందులైంది. ఇప్పుడు నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం తప్ప నేనేం చేయగలను. మంచికో చెడుకో తెలియదు గానీ ఆ దేవుడు నిన్నూ నన్నూ కలిపాడు.. విడదీసాడు కూడా. అయితే నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, నిన్నెంత మిస్సవుతున్నానో ఆ భగవంతునికే తెలుసు. నువ్వు నాతో పాటు ఉంటే ఈరోజు నీ పుట్టిన రోజు వేడుకలు జరిగేవి కదా. నా వల్లగానీ, నా భార్య వల్లగానీ ఎవరికైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగి ఉంటే అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను’ అని తన భార్యను గుర్తు చేసుకుంటూ రిఫియన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా శనివారం ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ ప్రదర్శన ఇస్తుండగా, భారీ ఎత్తున్న నీటి అల వెనుకవైపు నుంచి వేదిక మీదకు వచ్చి పడింది. దీంతో వేదికపైనున్న కళాకారులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో తన భర్త కన్సర్ట్ను చూసేందుకు అక్కడి వచ్చిన రిఫియన్ భార్య సహా... ఈ గ్రూపులోని ముగ్గురు సభ్యులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో రిఫియన్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇండోనేషియా రాజకీయవేత్త కూతురైన సహారా(25) టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని ఆమె నిర్ణయించుకున్నారని.. ఈలోపే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని స్థానిక మీడియా పేర్కొంది. -
సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే వయసు ఆమెది. సరదా సరదాగా గడిపేయాల్సిన రోజులవి. సరదాకు మాత్రమే కాదు సామాజికస్పృహకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది ఇషిక. సోనాగచికి వెళ్లి అక్కడి పిల్లలతో గడపనిదే ఇషికాకు వారం గడవదు. అక్కడికి వెళ్లి పిల్లలకు చదువు చెబుతూ అక్షరాస్యులుగా చేయడానికి, ప్రపంచం గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తోంది... పాప్స్టార్స్ విడుదల చేసే కొత్త ఆల్బమ్స్ కోసం వెయిట్ చేయడం ఆమె హాబీ. కొత్తగా అప్‌గ్రేడ్ అయ్యే ఐఫోన్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొంటూ వాటిలో మునిగితేలడం అంటే కూడా ఇష్టం. రిహన్నా, బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ ఆల్బమ్స్ ఆమె ఐప్యాడ్‌లో ఉంటాయి.. లెవిస్, రీబక్‌లు ఆమె వార్డ్‌రోబ్‌లో ఉంటాయి. టామ్‌క్రూజ్, రణ్‌బీర్ కపూర్లు ఆమె హార్ట్ రోబ్‌లో ఉంటారు. ఖరీదైన అలవాట్లు, ఖరీదైన అభిరుచులు ఆమెవి. ఇంత ‘ఖరీదైన’ నేపథ్యం నుంచి వచ్చిన 17 యేళ్ల అమ్మాయి వీకెండ్ ఎలా గడుపుతుంది? అనే ప్రశ్నకు అందరూ ఒకేరకమైన సమాధానాన్ని ఊహించుకొంటారు. లాంగ్‌డ్రైవ్స్‌తోనూ, ఫ్రెండ్స్‌తో పార్టీలలో మునిగి తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు. అయితే ఎవరీ ఊహాగానాలకూ అందని రీతిలో, తన లైఫ్ స్టైల్‌కు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో సంస్కర్త హృదయంతో వారాంతాలను గడుపుతోంది ఇషికా సీల్! కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియా పేరు సోనాగచి. అత్యంత దుర్భర పరిస్థితుల్లో అక్కడ తమ తల్లుల మధ్య బతుకుతున్న చిన్నపిల్లలను చేరదీస్తూ వారికి చదువు చెబుతోంది ఇషిక. తల్లులను ఎడ్యుకేట్ చేసి పిల్లలను స్కూళ్లలో చేర్పిస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ పనిని పవిత్రకార్యంలా భావిస్తుంది ఇషిక. తాను చూసిన, చూస్తున్న ప్రపంచంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించడం ఒక ఎత్తు అయితే, తనకు పరిచయమే లేని ప్రపంచంలో మార్పు కోసం ప్రయత్నించడం మరో ఎత్తు. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడానికి సామాజిక పరిస్థితులతో పాటు కొందరు వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు. ఇషికకు స్ఫూర్తి ఆమె తల్లి మధుమిత. నిర క్షరాస్యతను నిర్మూలించడానికి పోరాడుతున్న మధుమిత తన ప్రయత్నంలో కూతురు కూడా భాగస్వామినవుతాను అంటే కాదనలేకపోయింది. దుర్భరమైన పరిస్థితుల మధ్య బతికే సెక్స్‌వర్కర్ల పిల్లలకు చదువుచెబుతానని, సంస్కరిస్తాను అంటే కూతురును నిరాశ పరచలేదు. ‘మంచి ఆలోచన’ అంటూ అభినందించింది కూడా. ‘చారిటీ బిగిన్స్ అట్ హోమ్’ అన్న వాక్యాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ సామాజికసేవ వైపు ప్రయాణం సాగిస్తున్న కూతురికి ఎలాంటి అడ్డంకులూ కల్పించలేదు మధుమిత. ప్లస్ టూ చదువుతున్న ఇషిక చదువులో కూడా రాణి స్తోంది. కుటుంబ నేపథ్యంతో వచ్చిన ఫ్రెండ్స్, ఎంజాయ్ మెంట్‌ను పక్కనపెట్టి.. పిల్లల ప్రపంచంలోకి వస్తోంది. ఈ విషయం గురించి ఇషికను అడిగితే ‘‘నేను అన్ని సౌకర్యాల మధ్య బతుకుతున్నాను. గొప్ప కాలేజీలో చదువుతున్నాను. సుఖసంతోషాలకు ఎలాంటి లోటు లేదు. అయితే ఇలాంటి అదృష్టం చాలా మంది పిల్లలకు లేదు. చిన్న చాక్లెట్ ముక్క ఇచ్చినా ఆ పిల్లల కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. అలాంటి ఆనందం వారికి శాశ్వతం కావాలి. అందుకోసమే నా ప్రయత్నం. చదువు విషయంలో, సౌకర్యాల విషయంలో వారి సమస్యలు ఏమిటో నాకు అవగాహన ఉంది. వాటిని పరిష్కరించడానికి నేను నా పరిధిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక ఫ్రెండ్స్‌ని, పార్టీలని మిస్సవుతున్నాననే ఫీలింగ్ లేదు. నాకు చిన్న పిల్లలతో గడపడమే సంతృప్తినిస్తోంది..’’ అని అంటుంది. యుక్త వయసులోనే ఇంత పరిణతి చూపుతున్న ఇషికకు ‘నేషనల్ కమ్యూనిటీ సర్వీస్’ అవార్డు వచ్చింది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఇషిక సేవా దృక్పథం గురించి ప్రముఖంగా ప్రచురించాయి. నేను అన్ని సౌకర్యాల మధ్య బతుకుతున్నాను. గొప్ప కాలేజీలో చదువుతున్నాను. సుఖసంతోషాలకు ఎలాంటి లోటు లేదు. అయితే ఇలాంటి అదృష్టం చాలా మంది పిల్లలకు లేదు. చిన్న చాక్లెట్ ఇచ్చినా ఆ పిల్లల కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. అలాంటి ఆనందం వారికి శాశ్వతం కావాలి. అందుకోసమే నా ప్రయత్నం. - ఇషిక