breaking news
Plymouth University
-
కాటుక రంగులోకి కడలి!
ఆ చల్లని సముద్రగర్భం.. అంటూ సాగే దాశరథి పాట వినే ఉంటారు. ఇప్పుడు ఆ నల్లని సముద్రం అని కూడా పాడుకోవాలేమో. ప్రపంచవ్యాప్తంగా భూమినంతటినీ చుట్టేసిన సాగరజలం నెమ్మదిగా నీలి రంగు నుంచి నలుపు వర్ణంలోకి మారిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ధరణిపై దాదాపు 71 శాతం ఉపరితలాన్ని సముద్రజలాలే కప్పేస్తున్నాయి. అంటే భూమిపై దాదాపు 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర సముద్రనీరే ఉంది. ఇందులో 21 శాతం అంటే 7 కోట్ల చదరపు కిలోమీటర్ల సముద్రజలాలు గతంలో ఎన్నడూలేనంతగా కొత్తగా నల్లగా మారిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మార్పు కేవలం గత 20 సంవత్సరాల్లో జరిగిందని గణాంకాలు స్పష్టంచేశాయి. సంబంధిత వివరాలు గ్లోబల్ చేంజ్ బయోలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సముద్రజలాలు నలుపు రంగులోకి మారడంతో సూర్యరశ్శి సాగర జలాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లడం సాధ్యపడట్లేదు. దీంతో సముద్ర ఉపరితల జలాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాంతిమయ పరిస్థితులే 90 శాతం సముద్రజీవుల మనుగడకు ప్రాణాధారం. సూర్యరశ్శి సముద్ర ఉపరితల జలాలపై కొంతమేరకే పరిమితమైతే ఎన్నో రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయం, ప్లైమౌత్ మెరైన్ లేబొరేటరీలోని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2003 ఏడాది నుంచి 2022 ఏడాది దాకా అంతర్జాతీయంగా పలు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటాను సంఖ్యాశాస్త్ర నమూనాలతో సరిపోల్చి ఈ విపరిణామాన్ని కనుగొన్నారు. వేడినిచ్చే సూర్యకాంతితోపాటు చల్లని వెలుతురునిచ్చే చంద్రకాంతి సైతం పరోక్షంగా సముద్రజీవుల జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. లోతైన సముద్రజలాలతోపాటు తీరం వెంట జీవుల ఉనికికీ ఈ రెండు కాంతులూ ముఖ్యమే. భారీగా తగ్గిన కాంతి లోతు అలజడులు లేని, ప్రశాంతంగా ఉన్న సముద్రజలాల్లో తేటగా ఉన్న సందర్భాల్లో సూర్యకాంతి చాలాలోతుదాకా వెళ్లగలదు. కానీ గత 20 ఏళ్లలో గమనిస్తే ఆఫ్రికా ఖండం అంత పరిమాణంలో అంటే 9 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి చొచ్చుకెళ్లే ప్రాంతాలు బాగా తగ్గిపోయాయి. ఇక్కడ గతంతో పోలిస్తే సూర్యకాంతి 50 మీటర్లు తక్కువలోతుకే వెళ్లగల్గుతోంది. మరో 2.6 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి వెళ్లగలిగే లోతు ఏకంగా 100 మీటర్లు తగ్గిపోయింది. అయితే ఒక 10 శాతం సముద్రజలాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ లోతులకు సూర్యకాంతి చొరబడగల్గుతోంది. సూర్యకాంతిలోనే మనగలిగే సముద్రజీవులు చాలా ఉంటాయి. ఎన్నో రకాల జలచరాల ఉనికి, పునరుత్పత్తి, ఆహారానికి ప్రత్యక్షంగా సూర్యకాంతి అత్యావశ్యకం. ‘‘కొన్ని చోట్ల సూర్యకాంతి లభ్యత తగ్గిపోవడంతో వేరే చోట్లకు జీవులు వలసపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆయా జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అని ప్లైమౌత్ విశ్వవిద్యాలయంలోని సముద్ర సంరక్షణ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ డెవిస్ చెప్పారు.నల్లగా ఎందుకు మారుతోంది?పర్యావరణానికి సంబంధించి ఎన్ని దేశాల్లో ఎన్నెన్నో కఠిన చట్టాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఆయా సంస్థలు గుట్టుచప్పుడుకాకుండా నేరుగా నదుల్లో పారబోస్తున్నాయి. గరళంగా మారిన నదీజలాలు నేరుగా సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటికి వ్యవసాయ వ్యర్థాలూ తోడవుతున్నాయి. వీటితో పోషణ సంబంధ మూలకాలు సముద్రంలోకి పోటెత్తుతున్నాయి. ఈ పోషకాలను సంగ్రహించిన నాచు వంటి అతిసూక్ష్మ మొక్కలు సముద్ర ఉపరితల జలాలపై ఏపుగా పెరుగుతున్నాయి. గనుల తవ్వకం తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను వర్షపు నీరు నదుల ద్వారా సముద్రాల్లోకి కొట్టుకొచ్చేలా చేస్తోంది. ఇవికాక సూర్యకిరణాలను అడ్డుకునే జీవజాలం సముద్రఉపరితలంపై మరింతగా పేరుకుపోతోంది. ఇవన్నీ కలగలిసి సాగరాలను కాంతిహీనం చేస్తున్నాయి. అలా అవి నల్లరంగులోకి మారిపోతున్నాయి. శైశవాల పెరుగుదల, భూతాపోన్నతి కారణంగా అధికమవుతున్న సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రత సైతం తమ వంతుగా ఈ దుష్ప్రభావానికి ఆజ్యం పోస్తున్నాయి.మత్స్య పరిశ్రమకూ పెనుముప్పు లోతైన సముద్రాల వద్ద సూర్యకాంతి తగ్గిపోయి ఆహార లభ్యత కృశించిపోవడంతో దిక్కులేక పలు రకాల జలచరాలు తీరాలకు చేరి అక్కడి జీవులతో కలిసి ఆహారం కోసం పోటీపడుతున్నాయి. దీంతో ఆయా జీవుల ఆహార వనరుల కొరత ఏర్పడుతుంది. సముద్రచేపలు, రొయ్యలు, ఇతర జలచరాల లభ్యత తగ్గిపోయే వీలుంది. దీని ప్రభావం భవిష్యత్తులో అన్ని సముద్రతీర దేశాల మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘లోతైన సముద్ర ప్రాంతాల్లో సూర్యకాంతి చొచ్చుకుపోయే సామర్థ్యం మరో 50 మీటర్లు తగ్గిపోతే అక్కడి జీవులు తమ ఆవాసాలను సముద్రతీరాలకు మార్చుకుంటాయి. అప్పుడు యావత్ సాగర జీవావరణ వ్యవస్థలో శాశ్వత మార్పులు సంభవించే ప్రమాదం దాపురిస్తుంది’’అని ప్లైమౌత్ మెరైన్ లే»ొరేటరీలో ప్రొఫెసర్ టిమ్ స్మిత్ విశ్లేíÙంచారు. ‘‘సముద్రాల్లో సూర్యకిరణాలు లోపలికి వెళ్లలేకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదని నింపాదిగా కూర్చునే కాలం కాదిది. ప్రభుత్వాలు తక్షణం మేల్కొనాలి. సముద్రాల్లోకి చేరే నదీజలాలు వీలైనంత వరకు పారిశ్రామిక వ్యర్థాలకు ఆవాసంగా మారకుండా చూసుకోవాలి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుచేయాలి. వ్యర్థాల పారబోతపై పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చూయింగ్ గమ్ నమిలితే రూ. 80 కోట్లు ఆదా
చూయింగ్ గమ్ నమలడం ముఖానికి మంచి వ్యాయామమని, అది ముఖ ఆకృతిని అందంగా తీర్చిదిద్దుతుందని వ్యాయామ నిపుణులు చెబుతుంటారు. అలాగే చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆరోగ్యం కోసం వెచ్చించే సొమ్ము బోలెడు ఆదా అవుతోందట. యూకేలోని ప్లిమౌత్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత చూయింగ్ గమ్ నమలడం వల్ల నేషనల్ హెల్త్ సర్వీస్‌కు ఏటా దాదాపు రూ. 80 కోట్లు (82 లక్షల పౌండ్లు) ఆదా అవుతుందని తేలింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రతివారం 10 లక్షల మంది ఎన్హెచ్ఎస్ ద్వారా దంత సంబంధిత సేవలు పొందుతున్నారు. తద్వారా ఎన్హెచ్ఎస్పై ఏటా దాదాపు రూ. 33,634 కోట్ల భారం పడుతోంది. దంత సంబంధిత సమస్యల కారణంగా 12 ఏళ్ల లోపు పిల్లల్లో 35 శాతం మంది హాయిగా నవ్వలేకపోతున్నారని ఓ అధ్యయనంలో గుర్తించారు. దీనికి సరైన పరిష్కారం చూయింగ్ గమ్ నమలడమేనని వారు పేర్కొంటున్నారు. ఏదైనా తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత చక్కెర రహిత చూయింగ్ గమ్ నమలడం వల్ల నోటిలో ఉమ్ము ఉత్పత్తి అవుతుందని, అది పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగించడంలో సహకరించడమే కాకుండా.. పళ్లను బలహీనపరిచే ప్లేక్ యాసిడ్స్‌ను క్రమబద్ధీకరిస్తుందని చెప్పారు. అందువల్ల పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చూయింగ్ గమ్ నమలడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ లిజ్ కే స్పష్టం చేశారు. అధ్యయనం ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, ప్రజలు తమ నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఈ విధానం ఎంతగానో సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల లోపు పిల్లలు రోజుకు ఒక సుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమిలితే ఎన్హెచ్ఎస్ కు ఏడాదికి దాదాపు రూ. 27 కోట్లు ఆదా అవుతుందని వివరించారు. అదే రోజుకు రెండు చూయింగ్ గమ్స్ తీసుకోవడం వల్ల దాదాపు రూ.32 కోట్లు, మూడు చూయింగ్ గమ్స్ వల్ల దాదాపు రూ.80 కోట్లు ఆదా చేయొచ్చని తెలిపారు. ఈ విధానాన్ని కేవలం 12 ఏళ్ల లోపు పిల్లలకే కాకుండా మిగతావారికి వర్తింపజేస్తే మరింతగా సొమ్ము ఆదా అవుతుందని పేర్కొన్నారు.