breaking news
PLA troops
-
చైనా వక్రబుద్ధి.. పాకిస్థాన్ ఆర్మీ కోసం పీఓకేలో నిర్మాణాలు
న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదోరకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ ఆర్మీ కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), బలోచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్‌గా పిలుస్తారు. కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరోవైపు.. సింధ్, బలోచిస్థాన్ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే రానికోట్, నవాబ్షా, ఖుజ్దార్ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే.. పాకిస్థాన్ ఆర్మీకి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం ఎందుకు పాల్గొంటుందన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సీపెక్ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటం వల్లే పాకిస్థాన్ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపెక్ ద్వారా సింకియాంగ్‌ను గ్వాదర్ పోర్ట్‌తో అనుసంధానించాలని భావించారు, అయితే అది అక్కడికి చేరుకోవడానికి చాలా దూరంలో ఉంది. ఇదీ చదవండి: చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్ -
టిబెట్‌లో భారీ సైన్యం: చైనా యుద్ధ సన్నాహాలా??
న్యూఢిల్లీ: సిక్కింలోని సరిహద్దుల్లో భారత సైన్యంతో ప్రతిష్టంభన నేపథ్యంలో గత నెల చివర్లోనే చైనా భారీగా ఆయుధసంపత్తిని, ఆర్మీ వాహనాలను, బలగాలను టిబెట్‌కు తరలించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్‌తో సరిహద్దు అంశాలను చూసుకొనే పశ్చిమ థియేటర్ కమాండ్‌కు పెద్ద ఎత్తున ఈ సైనిక ఆయుధ సంపత్తి రోడ్డు, రైలు మార్గాల ద్వారా తరలినట్టు తాజాగా మీడియా కథనాలు వెల్లడించాయి. ‘వెస్ట్ థియేటర్ కమాండ్ పరిధిలోకి వచ్చే ఉత్తర టిబెట్‌లోని కున్లన్ పర్వతప్రాంతాల్లోకి అత్యంత భారీ సైనిక సంపత్తిని బట్వాడా చేశారు. కల్లోలిత జిన్జియాంగ్, టిబెట్‌తోపాటు భారత్‌తో సరిహద్దు అంశాలను వెస్ట్ థియేటర్ కమాండ్ చూసుకుంటుంది’ అని హంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక పేర్కొంది. గత నెలలోనే సైనిక హార్డ్‌వేర్‌ను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) టిబెట్ తరలించిందంటూ పీఎల్ఏ అధికారిక పత్రికను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. సిక్కింకు సమీపంలోని డొక్లామ్ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణాత్మక పరిస్థితి నెలకొన్న నాటినుంచి చైనా మీడియా పరుషమైనరీతిలో యుద్ధవ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.