breaking news
phc visit
-
నెలలో ఓ రోజు ఆసుపత్రిలో నిద్రిస్తా: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘క్షేత్రస్థాయిలోని సమస్య లు తెలుసుకునేందుకు, తక్షణం పరిష్కరించి ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రతినెలా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను తప్పనిసరిగా సందర్శించాలి. నెలలో ఒకరోజు రాత్రి పీహెచ్‌సీల్లో నిద్ర చేయాలి. నేను కూడా ఓ రోజు నిద్ర చేస్తాను’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నెలవారీ సమీక్షలో భాగంగా పీహెచ్‌సీల పనితీరు, పురోగతిపై ఆదివారం ఆయన అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌ౖ వైజరీ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఎన్సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సి–సెక్షన్ల రేటు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టి–డయాగ్నొస్టిక్, ఐహెచ్ఐపీ తదితర వైద్యసేవలపై జిల్లాలు, పీహెచ్‌సీలవారీగా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం.. శిశు మరణాల రేటు 23 నుంచి 21కి తగ్గిందని, 2014లో ఇది 39 ఉండేదన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరగటం, కేసీఆర్ కిట్లు, ఆరోగ్యలక్ష్మీ, 102 వాహన సేవలు, మారుమూల ప్రాంతాలకు సైతం మెటర్నిటీ సేవలు విస్తరించడం, ప్రత్యేకంగా చిన్నపిల్లలకు ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు వంటి వి శిశు మరణాలరేటు తగ్గుదలకు దోహదం చేశాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 60 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, ఇవి చాలావరకు తగ్గాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర సిజేరియన్లు జరగకుండా చూడాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో అన్ని పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్నివేళల్లో అందించాలని ఆదేశించారు. అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో అప్లోడ్ చేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు శ్వేతామహంతి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్‌ఎంసీఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మీ ఇంటిని ఇలాగే పెట్టుకుంటారా?
మనుబోలు పీహెచ్సీ వైద్యురాలిపై కలెక్టర్ ఆగ్రహం మనుబోలు: మనుబోలు పీహెచ్సీలో బెడ్లు, కాన్పుల గది అపరిశుభ్రంగా ఉండడంతో కలెక్టర్ ముత్యాలరాజు వైద్యాధికారిణి సుజాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటిని ఇలాగే పెట్టుకుంటారని ప్రశ్నించారు. మనుబోలు పీహెచ్సీ, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల పర్యవేక్షణకు అడిషనల్ జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలను నోడల్ అధికారులుగా నియమిస్తామన్నారు. రెండు నెలలలో పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాతా శిశు మరణాలను అరికట్టేందుకు కృషి చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. ప్రతి నెలా 9న ఆస్పత్రిలో మదర్స్‌డే నిర్వహించాలని తెలిపారు. పేద మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలన్నారు. పాఠశాల పరిశీలన కేఆర్‌పురంలోని సీఎంనగర్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని వంట మనిషి ఇంటి నుంచి తీసుకువస్తున్నట్లు చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల వద్దే వంట చేయాలన్నారు. 5వ తరగతి విద్యార్థికి ప్రశ్నలు సంధించి చెప్పలేకపోవడంతో విద్యా ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మందులను చెత్తలో పడవేయడంపై అంగన్వాడీ ఉపాధ్యాయురాలిని ప్రశ్నించారు. ఆమె సమాధానం చెప్పకుండా ఏఎన్ఎంలపై చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆయన వెంట ఐసీడీఎస్ పీడీ విద్యావతి, సీడీపీఓ శారద, ఏటీసీ సాల్మన్‌రాజు, డీఎంహెచ్ఓ వరసుందరం ఉన్నారు.