breaking news
permission must
-
అనుమతి లేకుంటే ఉపేక్షించొద్దు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జిల్లాలో అనుమతి లేకుండా మొరం, కంకరను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లాస్థాయి పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో అక్రమంగా మొరం, కంకరను తరలిస్తే వారిపై నిఘా పెట్టి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కంకర క్వారీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జాప్యం లేకుండా అనుమతులివ్వాలన్నారు. దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత శాఖల నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ పొంది, శాఖాపరంగా సర్వే చేసి అనుమతులు జారీ చేయాలన్నారు. జిల్లాలో సర్వేయర్లు లేని పక్షంలో ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై తెప్పించుకుని సర్వేను పూర్తి చేయాలని సూచించారు. క్వారీల రెన్యూవల్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి కూడా నిర్ణీత కాల వ్యవధిలోగా అనుమతులు జారీ చేయాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ ప్రసాద్, ఆర్డీఓ వినోద్ కుమార్, భూగర్భ గనులశాఖ అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి... ఈ నెల 26న శ్రీరామ నవమి, 31న జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని, ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు సిబ్బంది, వలంటీర్లతో పాటు తాగునీటి వసతి, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అలాగే దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య, తదితరులున్నారు. -
అనుమతి తప్పనిసరి
విజయవాడ : మంచినీటి చేపల చెరువుల తవ్వకానికి తహసీల్దార్ల అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ బాబు.ఎ అన్నారు. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మత్స్యశాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి చేపల చెరువుల తవ్వకానికి ఆటోక్యాడ్ సర్టిఫికెట్ అనుమతి దరఖాస్తుతో పాటు దాఖలు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లాలో ఏడు మండలాల పరిధిలో 80 మంది మంచినీటి చెరువుల తవ్వకానికి పెట్టుకున్న దరఖాస్తులను కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఇకపై ఎప్పటికప్పుడు చెరువులకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 671 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చేపల చెరువులకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కర విధులు నిర్వహించే గజ ఈతగాళ్ల వివరాలను వారి ఆధార్ నంబరుతో సహా పుష్కర సెల్‌కు అందించాలని మత్స్యశాఖ జేడీని కలెక్టర్ ఆదేశించారు. ఘాట్లవారీగా గత ఈతగాళ్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వారికి ప్రత్యేకమైన జాకెట్‌తో సహా తగు డ్రెస్ కోడ్ అమలు చేయాలని చెప్పారు. అనంతరం నమూనా జాకెట్‌ను పరిశీలించారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్లకు ప్రత్యేక చానల్ ద్వారా స్నానాలకు నీటిని ఏర్పాటుచేస్తున్న దృష్ట్యా అక్కడ గజ ఈతగాళ్ల అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.కోటేశ్వరరావు, మత్స్య పరిశ్రమ ఆదర్శ రైతు నరసింగరాజు యాదవ్, వ్యవసాయ శాఖ డీడీ ఎస్.బాలూనాయక్, ఇరిగేషన్ ఈఈ పి.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.