breaking news
PDP-BJP govt
-
వారంలో కొత్త ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌లో తొలగిన ప్రతిష్టంభన
వివాదాస్పద అంశాల్లో పీడీపీ-బీజేపీ మధ్య కుదిరిన అవగాహన సాయుధ దళాల చట్టం పరిధిపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం ముఖ్యమంత్రిగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ హోం, ఆర్థిక శాఖలు పీడీపీకి.. బీజేపీకి డిప్యూటీ సీఎం, పర్యాటకం... రెండు మూడు రోజుల్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న ముఫ్తీ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిష్టంభన దాదాపుగా తొలగిపోయింది. బీజేపీ-పీడీపీల సంకీర్ణ ప్రభుత్వం మరో వారం రోజుల్లోపే గద్దెనెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. కనీస ఉమ్మడి ప్రణాళికకు సంబంధించి ఆర్టికల్ 370, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దు వంటి వివాదాస్పద అంశాల్లో ఇరు పార్టీల మధ్య కీలక అవగాహన కుదిరింది. ఏ క్షణంలోనైనా కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని పీడీపీ నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సన్నిహితవర్గాలు వెల్లడించాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని మొత్తం 87 స్థానాల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎవరికీ పూర్తిస్థాయి మెజారిటీ రాని నేపథ్యంలో... పీడీపీ, బీజేపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ చేసిన పలు వాగ్దానాలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఆయా వివాదాస్పద అంశాలపై కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలతో తాజాగా పీడీపీ, బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి.. ఏయే ప్రాంతాల నుంచి దానిని ఉపసంహరించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. ఇక ఆర్టికల్ 370 అంశంపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని పీడీపీ డిమాండ్ చేసినా.. ఈ విషయంలో ఆందోళన చెందవద్దని బీజేపీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక హోం, ఆర్థిక శాఖలను పీడీపీ.. పర్యాటకం, జలవనరులు, ఆరోగ్యం, ప్రణాళికా శాఖలను బీజేపీ తీసుకోవాలని కూడా ఒప్పందానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ నేత నిర్మల్‌సింగ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో పూర్తికాలం పాటు పీడీపీ అధినేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు మరో రెండు మూడు రోజుల్లోనే ఆయన ప్రధానమంత్రి మోదీని కలుస్తారని.. ఆ వెంటనే జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. అంతకన్నా ముందు ఆదివారమే ముఫ్తీ ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలతో భేటీకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
జమ్మూ కాశ్మీర్ కొత్త సీఎంగా ముఫ్తీ మహమ్మద్!
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, పీడీపీల మధ్య చర్చలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. ఓ వారం రోజుల్లో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయ్యద్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో సయ్యద్... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై మోదీ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 87 స్థానాలు గల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
'పీడీపీ - బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చారిత్రక మార్పు'
శ్రీనగర్: పీడీపీ ప్రెసిడెంట్ ముఫ్తి మహ్మద్ సయ్యద్ గత రెండు నెలలుగా జమ్మూ - కశ్మీర్ ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో పీడీపీకి బీజేపీ మద్దతు ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే దేశానికే ఓ చారిత్రకావకాశం వచ్చినట్టు అవుతుందని ముఫ్తి అన్నారు. ఒప్పందం పూర్తయిందా.. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదిరిందనే వార్తలు వస్తున్నాయి, అయితే అది ఇంకా జరగలేదు. ఆరెస్సెస్ ప్రభావంతో ఉన్న బీజేపీని జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆదరించరు. పైగా శ్యాంప్రసాద్ ముఖర్జీని అరెస్టు చేయటం కూడా బీజేపీకి కలిసి రాని అంశం. ఇదొక చరిత్రగా భావిస్తున్నారు జమ్మూ ప్రజలు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతానికి తనకు తెలిసినంత వరకు బీజేపీ ఎలాంటి సందేహం లేకుండా పీడీపీతో కలిసి పోతుందని ముఫ్తి అన్నారు. ఈ రెండు పార్టీలు కలవటం దేశంలోనే ఓ చారిత్రకమార్పు అని అన్నారు. కాగా జమ్మూ - కశ్మీర్ కేవలం ముస్లిం మెజారిటీ రాష్ట్రం. అక్కడి ప్రజలు బీజేపీని ఆహ్వానించరనేది అక్కడ వినిపిస్తున్న వాదన. కాగా, సీఎం పీఠాన్ని దశలవారీగా రెండు పార్టీలు పంచుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు తాజా డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం. మరోవైపు, చర్చలు కొనసాగుతున్నాయని మంగళవారం బీజేపీ నేత రామ్‌మాధవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై కచ్చితమైన గడువును పేర్కొనకుండా.. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. పీడీపీతో చర్చలు ఆయన నేతృత్వంలోనే సాగుతున్న విషయం తెలిసిందే.