వారంలో కొత్త ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌లో తొలగిన ప్రతిష్టంభన | new government in jammu&kashmir | Sakshi
Sakshi News home page

వారంలో కొత్త ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌లో తొలగిన ప్రతిష్టంభన

Feb 22 2015 2:22 AM | Updated on Sep 2 2017 9:41 PM

జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిష్టంభన దాదాపుగా తొలగిపోయింది.

     వివాదాస్పద అంశాల్లో పీడీపీ-బీజేపీ మధ్య కుదిరిన అవగాహన
     సాయుధ దళాల చట్టం పరిధిపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
     ముఖ్యమంత్రిగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్
     హోం, ఆర్థిక శాఖలు పీడీపీకి.. బీజేపీకి డిప్యూటీ సీఎం, పర్యాటకం...
     రెండు మూడు రోజుల్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న ముఫ్తీ
 న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిష్టంభన దాదాపుగా తొలగిపోయింది. బీజేపీ-పీడీపీల సంకీర్ణ ప్రభుత్వం మరో వారం రోజుల్లోపే గద్దెనెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. కనీస ఉమ్మడి ప్రణాళికకు సంబంధించి ఆర్టికల్ 370, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దు వంటి వివాదాస్పద అంశాల్లో ఇరు పార్టీల మధ్య కీలక అవగాహన కుదిరింది. ఏ క్షణంలోనైనా కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని పీడీపీ నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సన్నిహితవర్గాలు వెల్లడించాయి.
 గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని మొత్తం 87 స్థానాల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎవరికీ పూర్తిస్థాయి మెజారిటీ రాని నేపథ్యంలో... పీడీపీ, బీజేపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ చేసిన పలు వాగ్దానాలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఆయా వివాదాస్పద అంశాలపై కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలతో తాజాగా పీడీపీ, బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి.. ఏయే ప్రాంతాల నుంచి దానిని ఉపసంహరించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. ఇక ఆర్టికల్ 370 అంశంపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని పీడీపీ డిమాండ్ చేసినా.. ఈ విషయంలో ఆందోళన చెందవద్దని బీజేపీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక హోం, ఆర్థిక శాఖలను పీడీపీ.. పర్యాటకం, జలవనరులు, ఆరోగ్యం, ప్రణాళికా శాఖలను బీజేపీ తీసుకోవాలని కూడా ఒప్పందానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ నేత నిర్మల్‌సింగ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో పూర్తికాలం పాటు పీడీపీ అధినేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు మరో రెండు మూడు రోజుల్లోనే ఆయన ప్రధానమంత్రి మోదీని కలుస్తారని.. ఆ వెంటనే జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. అంతకన్నా ముందు ఆదివారమే ముఫ్తీ ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలతో భేటీకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement