breaking news
panthangi RAMBABU
-
sagubadi: గడ్డి సాగుతోనే అధికాదాయం!
రైతు కుటుంబాలకు పంటలపై వచ్చే ఆదాయంతో పోల్చితే, పశుపోషణ ద్వారా సమకూరే నిరంతర ఆదాయం చాలా ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులు తమ పశువులకు గడ్డిని, దాణాను సరిపడా అందించలేకపోతు న్నారు. అందువల్లే మన దేశంలో పశువుల ఉత్పాదకత బాగా తక్కువగా ఉంది. పశువుల్ని పెంచే ప్రతి రైతూ కొన్ని సెంట్లు/ కొన్ని కుంటల్లో అయినా గడ్డిని కూడా పెంచుకోవాలి. సైలేజి గడ్డి, దాణాలను తానే తయారు చేసుకొని పశువులను మేపుకుంటే పశుపోషకులకు అధికాదాయంతో పాటు, ప్రతిరోజూ ఆదాయం వస్తుందని గుర్తించాలని సూచిస్తున్నారు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్టీవీయూ) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మంథా జ్ఞాన ప్రకాశ్. వాతావరణ మార్పుల నుంచి జన్యుపరమైన అభివృద్ధి వరకు అనేక కీలకాంశాలపై ఆయన ఇటీవల ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..క్లైమేట్ ఛేంజ్ ప్రతికూల పరిస్థితులు పశుపోషణపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ సెగ ఇప్పుడు మనకు విపరీతంగా అనుభవంలోకి వస్తోంది. సాధారణ ప్రజలకు కూడా ఈ సమస్య ఇప్పుడు అర్థమవుతోంది. ఇక్కడ కుండపోత వర్షాలు, టెక్సాస్‌లో కరువు, మరోచోట అధిక ఉష్ణంతో మంచు కరిగిపోవటం ఇవన్నీ క్లైమేట్ ఛేంజ్ వల్ల జరుగుతున్నవే. పశువుకు గానీ.. మనిషికి గానీ.. ప్రతి ప్రాణికీ అనువైన ఉష్ణోగ్రత రేంజ్ ఒకటి ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్లోనే అది సరిగ్గా పనిచేయగలదు. పాలు, మాంసం వంట ఉత్పత్తుల్ని సరిగ్గా ఇవ్వగలదు. కానీ, ఉష్ణోగ్రత అంతకన్నా పెరిగినప్పుడు దాని జీవక్రియలన్నీ ఇబ్బంది పడతాయి. రావలసినటు వంటి ఉత్పత్తి రాదు. ఇంకొకటేమిటంటే.. పశుగ్రాసం కూడా పొలాల్లో సరిగ్గా పెరగదు. రోగకారక క్రిముల తీవ్రత పెరుగుతుంది. ఎప్పుడో పోయిన క్రిములు కూడా మళ్లీ సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్ ఛేంజ్ నుంచి మన జీవరాశిని, గడ్డి జాతులను పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. భూతాపోన్నతి ప్రతికూలతల నుంచి పశు సంపదను ఎలా రక్షించుకోగలం?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవటానికి ఉపయోగపడే కొన్ని రకాల జన్యువులు ప్రతి ప్రాణిలో ఉంటాయి. ఆ జన్యువులపై పరిశోధనలు చేసి గుర్తించి, జన్యుపరంగా అభివృద్ధి చేయటం ద్వారా పెరిగిన ఉష్ణోగ్రతల్లోనూ అవి మంచి ఉత్పాదకతను ఇచ్చేలా మార్చుకోవచ్చు. 37 డిగ్రీల సెల్సియస్ దగ్గర కంఫర్టబుల్‌గా ఉండే జంతువును 39 డిగ్రీల దగ్గర కూడా కంఫర్టబుల్‌గా ఉండేలా జన్యుపరంగా అభివృద్ధితో చేసుకోవచ్చు. అసాధారణ ఉష్ణోగ్రతలతో ఏయే పశుజాతులకు ఎక్కువ ఇబ్బంది?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగ్గానే ముందు గేదెలకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. పునరుత్పత్తి సమస్యలు పెరుగుతాయి. దేశవాళీ ఆవుల కన్నా చల్లటి విదేశాల నుంచి తెచ్చిన జాతుల ఆవులకు పెరిగిన ఉష్ణోగ్రతల్లో మరీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి, పెరుగుతున్న ఉష్ణోగ్రత ల్లోనూ సజావుగా బతకగలిగేలా మన గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెల్లో జన్యుపరమైన సామర్థ్యం పెంపొందించుకోవాలి. భూతాపోన్నతికి పశువులు కూడా కారణం అవుతున్నాయా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకు పశువులు కూడా కారణం అవుతున్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు.. వీటి కడుపులో సూక్ష్మజీవుల ద్వారా జరిగే జీర్ణప్రక్రియ (మైక్రోబియల్ ఫర్మంటేషన్) వల్ల మీథేన్ వాయువు వెలువడుతుంది. ఇది వాతావర ణాన్ని అధికంగా వేడెక్కించే వాయువు. ఈ సమస్య ను తగ్గించాలంటే.. పశువులకు పెట్టే దాణాను, గడ్డిని తక్కువ మీథేన్‌కు కారణమయ్యేలా మార్చాలి. దాణాలో, పశువు కడుపులోని సూక్ష్మ జీవరాశిని కూడా తక్కువ మీథేన్ ఉత్పత్తి చేసేలా మార్పు చేసుకోవాలి. తద్వారా భూతాపం పెరుగుదలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు. పేడ నుంచి కూడా ఉద్గారాలు..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల పేడ వల్ల కూడా వాతావరణంలో మీథేన్ పెరుగుతోంది. దీన్ని కూడా అరికట్టాలి. 2–3 పశువులను పెంచుకునే చిన్న, సన్నకారు రైతులు కూడా మీథేన్‌ను తమ స్థాయిలో నియంత్రించగల పద్ధతులు ఉన్నాయి. పచ్చి పేడను ఆరుబయట వదిలేస్తేనే సమస్య. ఒక చిన్న గుంత తవ్వి అందులో రోజూ వేసి, గుంత నిండిన తర్వాత పైన కొన్ని ఎండు ఆకులు వేసి కప్పిపెట్టాలి. 60 రోజుల్లో మంచి కంపోస్టు ఎరువు తయారవుతుంది. వర్మీకంపోస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీథేన్ చాలా వరకు తగ్గుతుంది. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయా..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణ మార్పులకు అనుకూలంగా వ్యవసాయం చేయడానికి సంబంధించి ‘నిక్ర’ పేరుతో ఐసీఏఆర్ పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టింది. వ్యవసాయం, అనుబంధ రంగాలన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంస్థల్లో చేపట్టిన పరిశోధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మన పశువుల ఉత్పాదకత తక్కువ ఎందుకని?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: మన దేశంలో పాడి పశువు సగటు పాల దిగుబడి ఒక ఈతలో 1,500–1,700 లీటర్లయితే, ప్రపంచ సగటు 2,700 లీటర్లు. నెదర్లాండ్స్, యూకే, యూఎస్‌లలో ఇంకా చాలా ఎక్కువ. ముఖ్యంగా మన దగ్గర రైతులు చాలా మంది చిన్న, సన్నకారు రైతులు. వీళ్లు తెలిసీ తెలియక, పశువులను సరిగ్గా మేపలేకపోతున్నారు. వాటికి పోషణ సరిగ్గా అందటం లేదు. ఆ దేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే కారణమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ఒక్కటే కారణం కాదు. అంతకన్నా ముఖ్యమైనది జెనెటిక్ ఇంప్రూవ్మెంట్. అక్కడి పశువులను వాళ్లు జన్యుపరంగా బాగా అభివృద్ధి చేసుకోగలిగారు. మనం చేసుకోలేకపోయాం. జన్యుమార్పిడి(జీఎం) కూడా అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చాలు. మామూలుగా మన పశువుల్లో ఉన్న మంచి గుణాలున్న జన్యువులనే పెంపొందిస్తాం ఆ జీవిలో. జెనెటిక్ మాడిఫికేషన్ అంటే జంతువుల్లోని జన్యువు లను మార్చేస్తారు. ఒక జన్యువును తీయటం, వేరే దాన్ని పెట్టడం అనేది జెనెటిక్ మాడిఫికేషన్ అంటారు. అది రిస్క్‌తో కూడిన పని. అవసరం లేదు. జీన్ ఎడిటింగ్‌ను ఇప్పుడిప్పుడే వాడుతు న్నారు. ఇవి చాలా వివాదాస్పద అంశాలు.ప్రత్యేక బ్రీడ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటంలో దేశీ పశువులు మెరుగ్గా ఉంటాయి. అధిక ఉత్పాదకత కోసం సంకరజాతి పశువులను రూపొందించుకున్నాం. హీట్ టాలరెంట్ జన్యువు లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. జెనెటిక్ ఇంప్రూవ్‌మెంట్‌పై పరిశోధనలు కొనసాగుతు న్నాయి. పంటల్లో కొత్త వంగడాలు తయారు చేసినంత సులభంగా పశువుల్లో జన్యు అభివృద్ధి జరగదు. పంట కాలం ఆర్నెల్లయితే పశువు ఒక తరం 7–8 ఏళ్లు పడుతుంది. సేంద్రియ పశుపోషణకు ప్రత్యేక బ్రీడ్స్ అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల్లో ఆర్గానిక్ బ్రీడ్స్ అంటూ ఏమీ ఉండవు. కొత్త బ్రీడ్ సహజంగా ఎవాల్వ్ కావటానికి కనీసం వందేళ్లు (10–12 తరాలు) పడుతుంది. ఒంగోలు తదితర పశుజాతులన్నీ అనాదిగా ఆర్గానిక్‌గా ఎవాల్వ్ అయినవే. అయితే, పశువుల పెంపకమే ఈ కాలంలో సూక్ష్మ కుటుంబాలకు భారంగా మారింది. గ్రామాల్లో సేంద్రియ ఎరువుల లభ్యత కూడా అంత తేలిక కాదు. ప్రత్యేకంగా గడ్డి పెంపక క్షేత్రాలు నెలకొల్పినప్పుడే గడ్డి కొరత తీరి, పశుపోషణ సజావుగా కొనసాగుతుంది. అప్పుడే పెరిగే జనాభా అవసరాలకు తగిన పాలు, మాంసం లభిస్తాయి. ఆర్గానిక్ పశు ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉంటుందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అభివృద్ధి చెందిన దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిడ్యూస్, థెరప్యూటిక్ రెసిడ్యూస్ లేని ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతికి కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని యాంటీబయాటిక్స్‌ను 2 నెలల ముందే ఆపెయ్యాలి. కొన్నిటిని ఒక రోజు ముందు వరకు ఇవ్వవచ్చు. ఒక్కో మందుకు ఒక్కొక్క టైమ్ ఉంటుంది. పశువులు పెంచే రైతులకున్న ముఖ్యమైన సమస్య ఏమిటి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: గడ్డి భూములు, అడవులు తగ్గిపోవటమే పెద్ద సమస్య. అందువల్ల పశువులను రోజంతా కట్టేసి పెంచాల్సి వస్తోంది. అందువల్ల దాణా, పచ్చి మేత మన పశువులకు సరిపోను అందటం లేదు. పశువుకు ఇచ్చే ఆహారంలో మూడింట రెండొంతులు పచ్చి గడ్డి, ఒక వంతు దాణా కలిపి ఇస్తే ఆరోగ్యం. అయితే, చిన్న, సన్నకారు రైతులు, భూమి లేని రైతులు దాణా, పచ్చిమేత చాలినంత పెట్టలేకపోతున్నారు. పశువుల ఉత్పాదకత తగ్గిపోతోంది. పరిష్కారం ఏమిటి?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: రైతులు కొన్ని సెంట్లు/గుంటల్లో అయినా గడ్డి పెంచుకోవాలి. పాడిపై రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దిపాటి పొలంలో ఈ పశువుల కోసం పచ్చి మేతను పండించుకుంటే వచ్చే ఆదాయం కన్నా.. ఆ పొలంలో ఇతర పంటలు వేస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. సైలేజీ గడ్డి, పంట వ్యర్థాలతో దాణాలను సొంతంగా తయారు చేసుకొని వాడుకోవాలి.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబుఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
చెరకు ప్రకృతి సేద్యంతో బతుకు తియ్యన!
8’ గీ 2’ దూరంలో చెరకు నాటాలి..ఆకులన్నిటికీ ఎండ తగిలితేనే అధిక దిగుబడి సాధ్యం ఆచ్ఛాదన, జీవామృతంతో చక్కని దిగుబడి! ఎకరానికి 40 నుంచి 80 టన్నుల చెరకు దిగుబడి ఖాయం రికవరీ కూడా 9% నుంచి 14%కు పెరుగుతుంది అంతర పంటలతో ఏడాదంతా అదనపు ఆదాయం తెలుగు నాట చెరకు రైతులకు సుభాష్ పాలేకర్ మార్గదర్శనం సాగునీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్న పంటగా వరి తర్వాత స్థానాన్ని చెరకు పంట ఆక్రమిస్తున్నది.కరువు పరిస్థితుల్లో చెరకు సాగు కనాకష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చెరకు సాగును ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవడమే మేలన్న భావన వేళ్లూనుకుంటున్నది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని ఎన్.సి.ఎస్. సుగర్స్ ఎం.డి. నారాయణం నాగేశ్వరరావు వేలాది మంది రైతులకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ డా. సుభాష్ పాలేకర్ చేత ఇటీవల శిక్షణ ఇప్పించారు.ఆయన బొబ్బిలి వచ్చి రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయంలో చెరకు దిగుబడి ఎకరానికి 40 టన్నుల నుంచి 80 టన్నులకు పెరగడం ఖాయమని పాలేకర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న చెరకు తోటలు దిగ్విజయంగా ఎకరానికి వంద టన్నులకు పైగా దిగుబడినిస్తున్నాయన్నారు. చెరకు వరుసల మధ్య 8 అడుగుల దూరం పెట్టి.. ఏడాది పొడవునా అనేక అంతర పంటలు సాగు చేయవచ్చు అంటున్నారు. పాలేకర్ చెరకు సాగు పద్ధతి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చెరకు రైతులకు ఉపకరిస్తుందన్న భావనతో.. పాలేకర్ మాటల్లోనే సవివరంగా అందిస్తోంది ‘సాగుబడి’..! చెరకు ‘గ్రామీణి’ కుటుంబంలో గడ్డి జాతికి చెందిన బహువార్షిక మొక్క. గడ్డి మొలిచే ఏ భూముల్లోనైనా చెరకును సాగు చేయొచ్చు. పొలంలో ఒక్కసారి నాటితే వందేళ్లయినా కార్శి తోటలు తీసుకోవచ్చు. మూడేళ్లకే నరికేయాల్సిన పని లేదు. ఇది స్వప్నం కాదు, వాస్తవం. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో 12వ కార్శి తోటలు ఉన్నాయి. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎకరానికి 4 టన్నుల చెరకు విత్తనం వాడుతున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి కేవలం 240 కిలోల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 4.5 క్వింటాళ్ల పంచదారను ఉత్పత్తి చేయగలిగేంత చెరకు విత్తనాన్ని వృథాగా నేలపాలు చేస్తున్నారు. ఇది అర్థం లేని పని. వరుసల మధ్య ఎడాన్ని బట్టి దిగుబడి! చెరకు ‘ఫొటో సింథటిక్’ మొక్క. ప్రతి ఆకుకూ (8,500 నుంచి 12,000 ఫుట్ క్యాండిళ్ల) పూర్తి స్థాయిలో సూర్యరశ్మి అవసరం. మే, జూన్‌లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండనూ తట్టుకొని చెరకు ఆకులు ఆహారోత్పత్తి చేసుకుంటాయి. నీడ పనికిరాదు. చదరపు అడుగులోని చెరకు ఆకులు రోజుకు 12.5 కిలో కేలరీల సౌరశక్తిని గ్రహించగలవు. తద్వారా 2.25 గ్రాముల మేరకు చెరకు గడ పెరుగుతుంది. ఈ విధంగా ఎకరంలో ఏడాదికి 160 కోట్ల కిలో కేలరీల సౌరశక్తిని చెరకు ఆకులు గ్రహిస్తే.. 240 టన్నుల వరకు చెరకు దిగుబడి వస్తుంది. మీరిప్పుడు వరుసల మధ్య రెండు, మూడు అడుగుల దూరం పాటిస్తున్నారు. వరుసల మధ్య 3 అడుగుల దూరం పెడితే 33 శాతం ఆకులపైనే ఎండ పడి, ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. 5 అడుగుల దూరం పెడితే 40 టన్నుల దిగుబడి వస్తుంది. 8 అడుగుల దూరం పెడితే కింది ఆకులపైన కూడా పూర్తిగా ఎండపడి, ఎకరానికి 60 టన్నుల దిగుబడి వస్తుంది. 8‘“ 8‘ దూరంలో నాటితే అత్యధిక దిగుబడి వస్తుంది. అయితే, 8’“ 8’ దూరం మరీ ఎక్కువ అనిపిస్తే.. 8‘“ 2‘ దూరంలో నాటుకోండి. ఇందుకోసం ఎకరానికి 2,722 కన్నుల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 4 టన్నులకు బదులు 44 గడలను విత్తనంగా వాడితే రూ.11 వేల ఖర్చు తగ్గుతుంది. ఆచ్ఛాదన, జీవామృతంతో చక్కని దిగుబడి! 160 కోట్ల కిలో కేలరీల సౌరశక్తిని ఉపయోగించుకొని ప్రకృతి సేద్యంలో ఎకరంలో ఏడాదికి 240 టన్నుల చెరకు దిగుబడి తీయాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం 2.5% ఉండాలి. కర్బనం, నత్రజని 10:1 నిష్పత్తిలో ఉండాలి. కానీ, మన దేశంలో భూములు రసాయనిక ఎరువుల వల్ల నిస్సారంగా మారాయి. సేంద్రియ కర్బనం 0.07% మాత్రమే ఉంది. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే కొద్దీ పంటల దిగుబడి పెరుగుతుంది. దీన్ని 1%కి పెంచితే ఎకరానికి వంద టన్నుల చెరకు దిగుబడి సాధించవచ్చు. సేంద్రియ కర్బనం జీవనద్రవ్యం (హ్యూమస్) ద్వారా నేలకు అందుతుంది. జీవనద్రవ్యమే భూమికి సారం, దిగుబడి శక్తి, ఉత్పాదక శక్తి. ఆకులు, గడ్డీ గాదం వంటి పంటల అవశేషాలను భూమిలో కలిసి కుళ్లిపోయేలా చేస్తే జీవనద్రవ్యం పెరుగుతుంది. చెరకు ఆకులను తగులబెట్టవద్దు. చెరకు ఆకును పొలంలో వరుసల మధ్య ఖాళీలో వేస్తేనే మట్టిలో జీవనద్రవ్యం తయారవుతుంది. ఆచ్ఛాదన వేయకపోతే జీవనద్రవ్యం తయారు కాదు. మట్టిలో జీవనద్రవ్యం రకరకాల మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా తయారవుతుంది. నాటు ఆవు పేడలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులున్నాయి. టన్నుల కొద్దీ పేడ ఎరువు అవసరం కూడా లేదు. ఎకరానికి నెలకు 10 కిలోల దేశీ ఆవు పేడతో జీవామృతం తయారు చేసి వాడితే చాలు. పంటల అవశేషాల ద్వారా నేలకు కర్బనం ఎక్కువగా అందుతుంది. గాలిలో 78.6% ఉన్న నత్రజనిని గ్రహించి 36 రకాల సూక్ష్మజీవులు నేలకు అందిస్తాయి. అపరాల పంట వేళ్లలో ఉండే సూక్ష్మజీవులు జీవనద్రవ్యం తయారీకి ఉపకరిస్తాయి. అందువల్ల, చెరకు పొలంలో వరుసల మధ్య ఆకులు, కొమ్మరెమ్మలు, గడ్డీ గాదాన్ని ఆచ్ఛాదనగా వేయడంతోపాటు.. పప్పుధాన్యాలను అంతర పంటలుగా తప్పకుండా వేయాలి. అప్పుడే పంట దిగుబడులనందించే జీవనద్రవ్యం తయారవుతుంది. చెట్లకు కావాల్సిన పోషకాలలో 98.5% గాలి, ఎండ, బ్రహ్మాండ శక్తి (కాస్మిక్ ఎనర్జీ), తేమ ద్వారా ప్రకృతిసిద్ధంగా అందుతున్నాయి. మిగతా 1.5% పోషకాలను ఖనిజాల రూపంలో మొక్కలు మట్టి నుంచి తీసుకుంటున్నాయి. పంచభూతాలు, సూక్ష్మజీవులు, దేశీ ఆవు పేడ ఉంటే చాలు.. మార్కెట్లో వేటినీ కొనకుండానే నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. చెరకు సాగులో 90% సాగు నీరు ఆదా! పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చెరకు సాగులో డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండానే 90% సాగు నీటిని పొదుపు చేయవచ్చని సుభాష్ పాలేకర్ తెలిపారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. చెరకు సాళ్ల మధ్య 8 అడుగుల దూరం ఉంచాలి. సాళ్ల మధ్యలో 2 అడుగులకు ఒకటి చొప్పున 4 కాలువలు తవ్వుకొని అంతర పంటలు సాగు చేసుకోవాలి (వివరాలకు బొమ్మ చూడండి). చెరకు నాటిన తర్వాత మొదటి 3 నెలల పాటు సాళ్ల మధ్య ఉన్న ఈ 4 కాలువల్లోనూ నీటిని పారించాలి. చెరకు నాటిన 3 నెలల తర్వాత 1వ కాలువకు నీరివ్వడం పూర్తిగా ఆపేయాలి (ఈ కాలువలోనే చెరకు మొక్క నాటి ఉంటుంది). 2, 3, 4 కాలువలకు మామూలుగానే నీరివ్వాలి. – చెరకు నాటిన 6 నెలల తర్వాత.. 2, 4 కాలువలకు కూడా నీరివ్వడం ఆపేసి, 3వ కాలువకు మాత్రమే నీరివ్వాలి. ఇలా చేయడం వల్ల పంట మొక్కల వేళ్లు నీటి తేమ ఉండే 3వ కాలువ వైపే చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు వేరు పొడవు పెరుగుతుంది. ఆకుల సంఖ్యతో పాటు ఆహారోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కాండం పొడవు, చుట్టుకొలత, బరువు పెరుగుతాయి. దిగుబడి పెరుగుతుంది. చెరకు నరకడానికి నెల రోజుల ముందే ఆ ఒక్క కాలువకూ నీరివ్వడం ఆపేయాలి. తద్వారా చక్కెర / బెల్లం దిగుబడి పెరుగుతుంది. 3 కాలువలకు నీరు ఆపేయడంతో 75% సాగు నీరు ఆదా అయ్యింది. ఆచ్ఛాదన ద్వారా మరో 15% తేమ వాతావరణం నుంచి మొక్కలకు అందుతుంది. ఇలా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో 10% నీటి ఖర్చుతోనే పంటల సాగు పూర్తవుతుంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చెరకు, అంతర పంటల సాగు పద్ధతి భూమిని దున్ని సిద్ధం చేసిన తర్వాత చెరకును 8‘ “ 2‘ దూరంలో నాటుకోండి. అతి కొద్ది స్థలంలో 8‘ “ 4‘, 8‘ “ 8‘ దూరంలోనూ నాటుకొని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూడండి. తేడా మీకే తెలిసివస్తుంది. చెరకు విత్తనంగా ఒక కన్ను ముచ్చెను నాటుకుంటే చాలు. కన్ను ఆకాశం వైపు చూసేలా నాటాలి. వర్షాధారంగా చెరకు సాగు చేస్తుంటే.. వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్‌లో నాటాలి. సాగు నీరుంటే అక్టోబర్ – నవంబర్, జనవరి – ఫిబ్రవరి తదితర నెలల్లో వీలువెంబడి నాటుకోవచ్చు. చెరకు సాళ్ల మధ్య 8 అడుగుల దూరం తప్పనిసరి. 8 అడుగుల దూరంలో ఉన్న చెరకు సాళ్ల మధ్య.. అంతరపంటల సాగు కోసం 2 అడుగులకు ఒకటి చొప్పున 4 కాలువలు తీసుకోవాలి. పంట ఏదైనా స్థానిక / దేశవాళీ సూటి వంగడాలనే ఎంపిక చేసుకోవాలి. ఇవైతేనే ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడినిస్తాయి. విత్తనాలు గానీ, నారు గానీ కచ్చితంగా బీజామృతంతో శుద్ధిచేసిన తర్వాతే నాటాలి. 1వ కాలువ : ఎడమ కింది వైపు ఒంటి కన్ను చెరకు ముచ్చెను నాటుకోవాలి. పైన ఎడమ, కుడి వైపు ఉల్లి / వెల్లుల్లి వేసుకోవాలి. 2వ కాలువ : పైన ఎడమ వైపు పప్పుధాన్యాలు (శనగ, కంది, పొట్టి కంది, పెసర, మినుము, ఉలవ, బీన్స్, చెట్టు చిక్కుడు వంటి ద్విదళ జాతి కూరగాయ పంటలు) విత్తుకోవచ్చు. పైన కుడి వైపున కూరగాయ పంటలు, నూనె గింజలు విత్తుకోవచ్చు. 3వ కాలువ : ఎడమ, కుడి వైపులలో ఏకదళ పంటలైన వరి (సుగంధ వరి వంటి ఔషధ గుణాలున్న దేశీ వంగడాలు వేసుకోవాలి), రాగులు (తైదలు /చోళ్లు) నాటుకోవచ్చు. 4వ కాలువ : ఎడమ వైపు పైన ద్విదళ పంటలైన కూరగాయ పంటలు (మిరప, పసుపు, అల్లం, వంగ, టొమాటో, క్యాలీఫ్లవర్, క్యాబేజి, గోరుచిక్కుడు, చెట్టు చిక్కుడు, బెండ, ఆకుకూరలు), నూనెగింజలు (వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వు, లిన్సీడ్, ఆవాలు, సోయాబీన్స్) విత్తుకోవచ్చు లేదా నాటుకోవచ్చు. కుడి వైపు పైన పప్పుధాన్య పంటలు విత్తుకోవచ్చు. ఆచ్ఛాదన, అంతర పంటల మార్పిడి! చెరకు పంటలో మొదటి రెండు సాళ్ల మధ్య ఆచ్ఛాదన వేస్తే.. తర్వాత రెండు సాళ్ల మధ్య అంతరపంటలు పండించాలి. చెరకు ఒక సీజన్ పూర్తయ్యాక.. గతంలో ఆచ్ఛాదన వేసిన సాలులో ఈ దఫా అంతర పంటలు వేయాలి. గతంలో అంతర పంటలు పండించిన సాలులో ఈ దఫా చెరకు ఆకులు, పిలకలతో ఆచ్ఛాదన చేయాలి. ఆచ్ఛాదనగా వేసే గడ్డీ గాదంలో 25 శాతం పప్పు ధాన్య పంటల వ్యర్థాలు, 75 శాతం వరి, చిరుధాన్యాల పంటల గడ్డి కలిసి ఉండేలా చూస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది. మెట్ట పొలాలకు ఘనజీవామృతం మెట్ట పంటల సాగులో ద్రవ జీవామృతాన్ని నేలకు ఇవ్వడం కష్టం కాబట్టి ఘనజీవామృతాన్ని నేలకు ఇవ్వొచ్చు. అనంతపురం జిల్లాలో కరువు కాలంలోనూ వేరుశనగ వర్షాధార సాగులో ఘనజీవామృతం అద్భుత ఫలితాలనిచ్చింది. మన దేశంలోనే కాదు దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఘన జీవామృతంతో వర్షాధార సేద్యంలో సత్ఫలితాలొచ్చాయి. ఘనజీవామృతం తయారీ పద్ధతి... నాటు ఆవు పేడను ఎండబెట్టి పొడిగా చేసి జల్లెడ పట్టాలి. 200 కిలోల పేడ పొడిని ఒక ప్లాస్టిక్ పట్టాపై పరచి.. దానిపై 20 లీటర్ల ద్రవ జీవామృతాన్ని చల్లాలి. నిలువుగా, అడ్డంగా పారతో కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని నీడలో 48 గంటల పాటు నిల్వ ఉంచాలి. ఎండ, వాన పడకుండా జాగ్రత్త వహించాలి. కలిపిన 48 గంటల తర్వాత ఘనజీవామృతాన్ని ఎండలో పల్చగా పరచి ఎండబెట్టాలి. రోజుకు 2,3 సార్లు కలియదిప్పుతూ బాగా ఎండేలాæ చూడాలి. తేమ పూర్తిగా ఎండిన తర్వాత.. ఒక చెక్కతో ఉండలన్నింటినీ చితిపి పొడిగా మార్చాలి. గోనె సంచిలో నింపి నిల్వ చేసుకోవాలి. ఘనజీవామృతాన్ని ఏడాది వరకు వాడుకోవచ్చు. చెరకు తోటకు ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతాన్ని దుక్కిలో వేసి కలియదున్నాలి. సీజనల్ పంటలకైతే ఎకరానికి 200 కిలోల చొప్పున వేసుకుంటే చాలు. జీవామృతాన్ని 15 రోజుల వరకు వాడొచ్చు! రసాయనిక ఎరువులే కాదు, పేడ ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, సూక్ష్మపోషక ఎరువులు వంటివి అసలు వాడకుండానే ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. ఘనజీవామృతం, జీవామృతంలను సొంతంగా రైతులే తయారు చేసి వాడుకుంటే చాలు.. చక్కని పంట దిగుబడులు పొందవచ్చు. జీవామృతం ఎరువు కాదు. మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్యను పంట భూముల్లో ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే సంవర్ధనమే (మదర్ కల్చర్ – తోడు) ద్రవ జీవామృతం. జీవామృతాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత 15 రోజుల వరకు వాడుకోవచ్చని సుభాష్ పాలేకర్ ఇటీవల బొబ్బిలిలో చెరకు రైతుల శిక్షణా తరగతుల్లో చెప్పారు.. వివరాలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం.. జీవామృతం తయారీ పద్ధతి పంట ఏదైనా ఎకరానికి ఒక విడతకు 200 లీటర్ల జీవామృతం సరిపోతుంది. ప్లాస్టిక్ డ్రమ్ము లేదా సిమెంటు తొట్టెను నీడలో ఉంచి.. 200 లీటర్ల నీరు పోయాలి. 10 కిలోల దేశీ ఆవు తాజా పేడ కలపాలి (సగం నాటు ఆవు పేడ కచ్చితంగా వాడాలి. సగం నాటు ఎద్దు పేడ వాడొచ్చు. మొత్తం నాటు ఎద్దు పేడ వాడొద్దు). 5–10 లీటర్ల నాటు లేదా దేశీ ఆవు మూత్రం కలపాలి (శాకాహారి అయిన మనిషి మూత్రం కూడా కొంత కలపవచ్చు). కిలో నల్లబెల్లం కలపాలి (నల్ల బెల్లం కాకపోతే ఎర్రటి / పసుపు రంగు బెల్లం వాడొచ్చు. తెల్లని చక్కెరను మాత్రం జీవామృతం తయారీలో వాడొద్దు. బెల్లానికి బదులు తీపి పండ్ల గుజ్జు వాడొచ్చు లేదా 3 లీటర్ల చెరకు రసం లేదా 4 కిలోల చెరకు ముక్కలు వాడొచ్చు). కిలో పప్పుధాన్యాల పిండి కలపాలి. పిడికెడు చేను గట్టు మీద మట్టి లేదా అడవిలోని మట్టి కలపాలి (జీవామృతంలో సూక్ష్మజీవరాశిని పెంపొందించేందుకు మట్టిని కలపాలి). ఇవన్నీ కలిపిన తర్వాత 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధమవుతుంది. అప్పటి నుంచి 15 రోజుల వరకు పంటలకు వాడుకోవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కుడి వైపునకు తప్పకుండా కర్రతో కలపాలి. సూక్ష్మజీవరాశి పెంపొందడానికి ఇది చాలా అవసరం. చెరకు తోటలో జీవామృతాన్ని పోసే పద్ధతి నీటిపారుదల సదుపాయం ఉన్న చెరకు తోటలో జీవామృతాన్ని ఎకరం పొలానికి 200 లీటర్ల చొప్పున నెలకు కనీసం ఒకసారి లేదా రెండుసార్లు ఇవ్వాలి. మధ్య మధ్యలో రెండు, మూడుసార్లు ఎకరానికి నెలకు 400 లీటర్ల జీవామృతం ఇవ్వాలి. ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తొలి ఏడాది ఎన్ని ఎక్కువ సార్లు జీవామృతాన్ని భూమికి ఇస్తే అంత మంచి ఫలితాలు కనిపిస్తాయి. చెరకు 8‘ “ 8‘ (సాళ్లు, మొక్కల మధ్య 8 అడుగుల దూరం) తోటలో నెలకు ఒకటి లేదా రెండు సార్లు మొక్కకు లీటరు చొప్పున జీవామృతం (నేల మీద పోసేటప్పుడు జీవామృతానికి నీరు కలిపి పలచన చేయాల్సిన అవసరం లేదు) పోయాలి. 8‘ “ 2‘ దూరం పెట్టినప్పుడు నెలకు ఒకటి లేదా రెండు సార్లు మొక్కకు పావు లీటరు చొప్పున పోయాలి. నీటి వసతి లేని మెట్ట పంటలో కూడా జీవామృతం పోసి అద్భుత ఫలితాలు పొందవచ్చు. చెరకుపై జీవామృతం పిచికారీ పద్ధతి 1వ పిచికారీ : చెరకు కన్ను నాటిన తర్వాత 21 రోజులకు మొదటి విడత పిచికారీ చేయాలి. ఎకరానికి 100 లీటర్ల నీటిలో 5 లీటర్ల జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. చెరకు పంటతోపాటు అంతరపంటలపై కూడా పిచికారీ చేయాలి. 2వ పిచికారీ : 1వ పిచికారీ తర్వాత 21 రోజులకు ఎకరానికి 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 3వ పిచికారీ : 2వ పిచికారీ తర్వాత 21 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 4వ పిచికారీ : 3వ పిచికారీ తర్వాత 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్ల మజ్జిగ కలిపి పిచికారీ చేయాలి. 5వ పిచికారీ : 4వ పిచికారీ తర్వాత 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 6వ పిచికారీ : 5వ పిచికారీ తర్వాత 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 5 నెలల తర్వాత మనిషి వెళ్లే ఖాళీ ఉండదు కాబట్టి జీవామృతం పిచికారీ సాధ్యపడదు.