breaking news
panjagutta car accident case
-
రెండు రోజుల పోలీస్ కస్టడీకి శ్రావెల్
హైదరాబాద్: పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో నిందితుడు, ఇంజినీరింగ్ విద్యార్థి శ్రావెల్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. కారు నడిపిన శ్రావెల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపర్చారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు పోలీసులు అతన్ని విచారించనున్నారు. ఈ నెల ఒకటో తేదీన ఇంజినీరింగ్ విద్యార్థులు తప్పతాగి కారు నడపడంతో పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై నుంచి వాహనం కిందపడింది. ఫ్లైఓవర్ కింద కారులో ప్రయాణిస్తున్న రమ్య కుటుంబసభ్యులపై కారు పడింది. ఈ ప్రమాదంలో రమ్య, ఆమె బాబాయి రాజేష్ మృతిచెందగా.. ఆమె తల్లి ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. -
రమ్య మృతి బాధాకరం, నిందితుడికి కఠినశిక్ష : సీపీ
హైదరాబాద్: పంజాగుట్ట కారుప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య మృతిచెందడం అత్యంత బాధాకరమని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీ ఆదేశాల మేరకు డీసీపీ వెంకటేశ్వరరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలపై సీపీ మహేందర్‌రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి కారణమైన నిందితుడికి కఠినశిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామని సీపీ తన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కారు ప్రమాదం తీవ్రత దృష్ట్యా యాక్సిడెంట్ కేసులా కాకుండా..తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనం నడిపిన డ్రైవర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపామని..నిందితుడికి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశముందన్నారు. ఈ కేసుకు సంబంధించి మద్యం సేవించడం, సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు అన్నీ ఆధారాలను సేకరించినట్లు వెల్లడించారు. నిందితుని గుర్తింపు కోసం పరేడ్ నిర్వహిస్తామన్నారు. నిందితుడి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. 21 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మద్యం అమ్మినందుకు బార్‌పై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్‌కు నివేదిక పంపినట్లు తెలిపారు. కారు నడిపిన వ్యక్తిని షవెల్గా గుర్తించినట్లు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తమ విచారణలో నిర్థారించినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారని.. అందరు మైనర్లేనన్నారు. వెహికల్ ఓనర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు శ్రద్థ వహించాలని సీపీ సూచించారు. కారు నడిపిన షవెల్ ప్రస్తుతం జైలులో ఉన్నాడని..అతనికి శిక్ష పడేలా 164 స్టేట్మెంట్ తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మహేందర్ రెడ్డి తన ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల ఒకటో తేదీన పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై జరిగిన కారు ప్రమాదంలో రమ్య కుటుంబం చిన్నాభిన్నమైంది. ఈ ప్రమాదంలో రమ్య బాబాయి రాజేష్ అక్కడిక్కడే మృతిచెందగా, 9 రోజులుగా రమ్య మృత్యువుతో పోరాడి మృతిచెందింది. రమ్య తల్లి, తాతయ్య ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. -
రమ్య మృతి బాధాకరం, నిందితుడికి కఠినశిక్ష