breaking news
pandragastu
-
అందరి దృష్టి గోల్కొండపైనే..
పంద్రాగస్టు నేపథ్యంలో... బారికేడ్లు, వేదిక,సుందరీకరణ పనులు ముమ్మరం అడుగడుగునా తనిఖీలు వేడుకల ప్రాంతాన్ని సందర్శించిన జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో అందరి దృష్టి గోల్కొండపై పడింది. ఇందుకు గాను ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అన్ని శాఖల అధికారులు గోల్కొండను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరిసరాలను చదును చేయడం, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. వాహనాల పార్కింగ్, వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండకు దారి తీసే మార్గాలను కూడా ముస్తాబు చేస్తున్నారు. గస్తీ ముమ్మరం.. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. పంద్రాగస్టు రోజున మాసబ్‌ట్యాంక్ నుంచి గోల్కొండలోని స్వాతంత్ర వేడుకలు జరిగే ప్రదేశం వరకు మొత్తం 26 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్లో నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు. వేడుకకు హాజరయ్యే వారి కోసం నానల్‌నగర్ చౌరస్తా నుంచి టిప్పుసుల్తాన్ బ్రిడ్జి, గొల్కొండ ప్రధాన దర్వాజా నుంచి మకాయిదర్వాజా, బంజారా దర్వాజా నుంచి షేక్‌పేట్ నాలా ఇలా ఆరు రూట్లను కేటాయించారు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలో ముందుగానే పోలీసులు సూచనలతో కూడిన కరపత్రాలు, పాస్‌లను అందరికి అందజేయనున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. అసలే మిలటరీ ఏరియా కావడం.. ఒక రూట్లో వెళ్లాల్సిన అతిథులు మరో దారిలో వెళ్తే మిలటరీ వారితో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే విషయమై ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా రూట్లను సూచించేలా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 45 నిమిషాల పాటు సాగే స్వాతంత్య్ర వేడుకల కోసం బందోబస్తు ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వు, తెలంగాణ స్పెషల్ పోలీసులతో పాటు గ్రేహౌండ్స్ దళాలు బందోబస్తులో పాల్గొంటున్నాయన్నారు. కోటను సందర్శించిన మేయర్, కమిషనర్ గోల్కొండ : వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ కోట ప్రాంతాన్ని శనివారం నగర మేయర్ మాజిద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తదితరులు సందర్శించారు. టోలిచౌకి నుంచి ఏర్పాట్ల పనులు పరిశీలిస్తూ కోటకు వచ్చారు. బంజార దర్వాజ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పూర్తి చేసి ఆ ప్రాంతంలో పూల మొక్కలు నాటాలని వారు ఆదేశించారు. కోటలో సీఎం కేసీఆర్ స్వీకరించే గౌరవ వందనం ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన పనులను అధికారులకు సూచించారు. -
పంద్రాగస్టు పండుగ కోటలోనే..
నిర్ణయించిన జిల్లా యంత్రాంగం వేదిక స్థలం పరిశీలించిన అధికారులు ముస్తాబవుతున్న కోట పరిసరాలు ఖిలావరంగల్ : తెలంగాణ రాష్ట్రం లో తొలిసారి జరుగుతున్న స్వాతం త్య్ర వేడుకలను చారిత్రక కాకతీ యుల రాజధాని వరంగల్ కోటలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. కోటలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. వేడుకలు జరిగే స్థలాన్ని వరంగల్ నగరపాలక సంస్థ కార్మికులు చదును చేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సురేందర్‌కరణ్, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు,అడిషనల్ ఎస్పీ యాదయ్య, ట్రాఫిక్ ఓస్డీ వాసుసేన, డీఎస్పీ రాజమహేంద్రనాయక్ శుక్రవారం ఖిలావరంగల్‌కు వచ్చి వేడుకల స్థలాన్ని పరిశీలించారు. స్వాతంత్య్ర వేడుకలకు ఖుష్‌మహల్ పక్కన ఉన్న ప్రైవేటు స్థలాన్ని పరిశీలించారు. ప్రధాన వేదిక, పరేడ్, ప్రేక్షకులు కుర్చునే స్థలం, శకటాల ప్రదర్శన, రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, వీవీఐపీల భధ్రత లాంటి ప్రత్యేక అంశాలను దృష్టిలో పెట్టుకుని కోట పరిసరాలను పరిశీలించారు. కేంద్ర పురావస్తుశాఖ సమన్వయకర్తలు కుమరస్వామి, సుబ్బారావులను.. ఖుష్‌మహల్ విస్తీర్ణం, అందుబాటులో ఉన్న స్థలం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖుష్‌మహల్ పక్కనే ఉన్న రెండు ఎకరాల ప్రైవేటు స్థలం, మినీ పార్క్ స్థలం రెండూ కలిపితే వేడుకలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఖుష్‌మహల్ పక్కన పిచ్చిమొక్కలతో నిండి ఉన్న స్థలాన్ని త్వరగా తీర్చిదిద్దాలని డీఆర్వో సురేందర్‌కరణ్ వరంగల్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.