breaking news
PALAKONDA Area Hospital
-
చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ
- నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి - చూపరులను కంటతడి పెట్టించిన తండ్రి రోదన పాలకొండ రూరల్ : ‘అమ్మా..బంగారం...లేఅమ్మ... నాన్నను వచ్చాను... నా వైపు చూడమ్మా.. నీ కోసం చాక్లెట్ తెచ్చాను... ఒక్కసారి లేతల్లీ...’ అంటూ ఆ తండ్రి పెట్టిన రోదనలు చూపరులను ఆసుపత్రిలో కంటతడి పెట్టించాయి. వివరాల్లోకి వెళ్తే...వీరఘట్టం మండలం అడారి గ్రామానికి చెందిన వడ్డిపల్లి సంతోష్, సుమతి దంపతుల ఏకైక కుమార్తె రీనా(1) వారి కళ్ల ముందే అప్పటి వరకు శనివారం ఆడుకుంది. పాప కళ్ల ముందే ఉందన్న భ్రమలో తల్లిదండ్రులు ఉండగా మృత్యువు నీళ్ల బకెట్ రూపంలో ముంచుకొచ్చింది. చిన్నారిని చంపేసింది. తమ ముందే అప్పటి వరకు ఆడుకుంటున్న పాపను ఏమరపాటుతో గుర్తించకపోవడంతో పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో రీనా పడిపోయింది. పనిలో ఉన్న తల్లిదండ్రులు ఆ విషయూన్ని గమనించలేదు. తరచి చూసే సరికి బకెట్లో పడి ఉండడాన్ని చూసి హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే పాపలో చలనం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇంతలోనే చిన్న పిల్లల వైద్యాధికారి జె.రవీంద్రకుమార్తో పాటు వైద్య సిబ్బంది పాపకు ఆక్సిజన్ అందించడంతో పాటు గుండెలపై అదిమి బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా పాప నోటి నుంచి చిన్నపాటి గాలి బయటకు వచ్చింది. రీనా ఊపిరి పీల్చుకుందేమోనని తండ్రి, బంధువులు ఆశగా చూశారు. అప్పటికే రీనా తుది శ్వాస విడిచిందన్న విషయూన్ని వైద్యులు చెప్పడంతో తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. రోదించాడు. ఆయన రోదనలు వైద్యులను, సిబ్బందిని, అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. -
చిట్టి @ 5 కిలోలు
అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా మూడు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఔరా అని ఆశ్చర్యపోతాం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఓ మాతృమూర్తికి రెండో కాన్పుగా ఐదు కిలోల బరువు ఉన్న పాప పుట్టింది. కొత్తూరు మండలం శోభనాపురం గ్రామానికి చెందిన యర్లంకి ప్రమీల ప్రసవ నొప్పులతో గురువారం ఉదయం ఆస్పత్రిలో చేరగా.. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే సాయంత్రం 4 గంటల సమయంలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయమై స్త్రీ వైద్య నిపుణురాలు ప్రసూన మాట్లాడుతూ తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోవటం, మంచి పౌష్టికాహారం కారణంగా ఐదు కిలోల బరువుతో బిడ్డ జన్మించినట్టు చెప్పారు. - పాలకొండ రూరల్