breaking news
Ophthalmology
-
‘చూపు’తో చెలగాటం!
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రి అది. అక్కడ ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు.. ఎంఎస్ (ఆప్తాల్మాలజీ) అని చెప్పుకుంటూ కంటి వైద్యులుగా చలామణి అవుతున్నారు. కానీ వాళ్లు కూడా కంటి చికిత్సలు చేయడం లేదు. కేవలం అక్కడ పనిచేసే టెక్నీషియన్లే కంటి పరీక్షలు మొదలు చికిత్సలు, కంటి అద్దాలు సిఫారసు చేయడం వరకు చేసేస్తున్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి కంటి వైద్యుల పేర్లతో అనుమతులు పొందినప్పటికీ, ఆప్తాల్మాలజీ, ఆప్టోమెట్రీ టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బహిర్గతమైన ఈ తరహా కంటి వైద్యుల బాగోతాలు విస్మయం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ కంటి ఆసుపత్రులు, అర్హతల్లేని నకిలీ వైద్యుల అక్రమాలపై టీజీఎంసీ దృష్టి కేంద్రీకరించింది. ‘మిషన్ మిర్యాలగూడ ఎగైనెస్ట్ క్వాకరీ’(చికిత్సలకు అర్హతలేని ఆస్పత్రుల తనిఖీలు) కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన టీజీఎంసీ బృందం, పట్టణంలో కంటి వైద్య సేవల పేరుతో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చింది.టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ కె. మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు సభ్యులు డా. వి.నరేష్కుమార్, డా. కె.రవికుమార్, డా. జె.శ్రీకాంత్ వర్మ, విజిలెన్స్ అధికారి ఎం.రాకేశ్‌లతో కూడిన బృందం పట్టణంలోని పలు కంటి ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తనిఖీ చేయగా పలు అక్రమాలు వెలుగుచూశాయి. ఒక్క ఆస్పత్రిలో కూడా నిపుణులు లేరు! శ్రీ వెంకటేశ్వర (ఎస్వీ) ఐ హాస్పిటల్, శ్రీ మహాలక్ష్మి కంటి ఆస్పత్రి, అన్నపూర్ణ నేత్రాలయం, యశస్వి కంటి ఆస్పత్రి, షాలిని ఐ క్లినిక్, రఫా విజన్ కేర్ సెంటర్, శివ సాయి కంటి ఆస్పత్రి తదితర కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఏ ఒక్క కంటి ఆసుపత్రిలో కూడా అర్హత గల (ఎంఎస్– ఆఫ్తాల్మాలజీ) కంటి వైద్య నిపుణులు ప్రత్యక్షంగా పని చేయకపోవడం అధికారులను విస్మయపరిచింది. ఆయా ఆస్పత్రులు నిపుణులైన కంటి వైద్యులు లేకుండానే మందులు, పరీక్షలు సూచించడం, పరీక్షలు చేయడం, కొన్నిచోట్ల శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నట్లు ఈ బృందం గుర్తించింది. వీటికి సంబంధించి అనుమతులు పొందిన కంటి వైద్యులు హైదరాబాద్, ఇతర నగరాల్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నట్లు టీజీఎంసీ తేల్చింది. ఇక్కడ పరిస్థితి దారుణంమిర్యాలగూడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి, షాలిని కంటి ఆసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉందని టీజీఎంసీ అధికారులు వెల్లడించారు. ఎంబీబీఎస్ మాత్రమే చదివిన డా.ఎం.భరత్ భూషణ్, డా.కె.వెంకటేశ్వర్లు తాము ఎంఎస్ (ఆప్తాల్మాలజీ) చేసినట్లు తప్పుడు వివరాలు ప్రదర్శిస్తూ, కంటి వైద్య నిపుణులుగా ప్రచారం చేసుకుంటూ, కేవలం టెక్నీషియన్లతోనే ఆసుపత్రులు నడుపుతున్నట్లు తేలింది. ఆయా నకిలీ డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మెడికల్ ఎథిక్స్ అండ్ మాల్‌ప్రాక్టీసెస్ కమిటీ ముందు విచారణ చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అవసరమైతే వారి ఎంబీబీఎస్ డిగ్రీ లైసెన్సులను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ⇒ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉండి టెక్నీషియన్ల ద్వారా ఇక్కడ ఆసుపత్రులు నిర్వహిస్తున్న కంటి వైద్య నిపుణులు డా.శ్రీకుమార్, డా.ప్రభు చైతన్య, డా.బïÙర్, డా.అమర్‌లకు కౌన్సిల్ నుంచి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ⇒ కోమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నిర్వాహకుడు ఎ.కోటేశ్వర్రావు ఎలాంటి అర్హతలు లేకుండానే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో బెడ్లు ఏర్పాటు చేసి, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇష్టానుసారంగా ఇస్తున్నట్లు గుర్తించారు. మరో నకిలీ వైద్యుడు, ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు మునీర్ తనిఖీల సమాచారం తెలిసి పరారైనట్లు అధికారులు తెలిపారు. ⇒ అర్హత లేకపోయినా కంటి వైద్యం నిర్వహిస్తున్న టెక్నీషియన్లు నాగేష్ , వాల్కె శ్రీను, నాగరాజు, శివ కోటేశ్వరరావు, వెంకటేష్, వికాస్ కుమార్, అలాగే నకిలీ వైద్యుడు ఎ.కోటేశ్వరరావుపై ఎన్ఎంసీ, టీఎంపీఆర్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ సభ్యులు తెలిపారు. ⇒ కంటి ఆసుపత్రుల అవకతవకలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేయనున్నట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డా.వి.నరేష్ కుమార్ తెలిపారు. అర్హతకు మించి వైద్యం చేయడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆపరేషన్లు నిర్వహించడం, లింగ నిర్ధారణ, అ క్రమ గర్భస్రావాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని డా.కె.రవికుమార్, డా.జె.శ్రీకాంత్ స్పష్టం చేశారు. -
కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా..
బీరూట్: రెండు పుష్కరాల క్రితం అన్యమనస్కంగా అధ్యక్ష పీఠంపై కూర్చున్న అసద్ తదనంతరకాలంలో నిరంకుశ నేతగా ఎదిగిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డమాస్కస్ మెడికల్ కాలేజీలో చదివిన అసద్ తర్వాత ఆప్తమాలజీ చదివేందుకు బ్రిటన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అసద్ తొలినాళ్లలో లండన్‌లో నేత్ర వైద్యునిగా సేవలందించేవారు. 1971 సంవత్సరం నుంచి సిరియాను తన ఉక్కుపిడికిలి కింద పాలిస్తున్న తన తండ్రి హఫీజ్ మరణంతో 2000 సంవత్సరంలో అసద్ స్వదేశం తిరిగొచ్చాడు. సానుభూతిపరుల మద్దతుతో అయిష్టంగానే అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు. అధ్యక్ష పదవికి కనీస అర్హత వయసు అయిన 40 ఏళ్లుకూడా నిండకపోవడంతో ఈయన కోసం పార్లమెంట్లో చట్టసవరణ చేశారు. నిజానికి హఫీజ్ తన పెద్ద కుమారుడు బస్సెల్ను తన వారసునిగా చూడాలనుకున్నారు. అయితే 1994లో కారు ప్రమాదంలో బస్సెల్ మరణించడంతో అసద్ అసలైన వారసుడయ్యారు. 2011దాకా అసద్ పాలనపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ అరబ్ విప్లవం మొదలయ్యాక 2011 మార్చిలో అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు డమాస్కస్, డేరా నగరాల్లో వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేశారు. వీటిని అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి నుంచి అసద్ నిరంకుశ పాలనకు తెరలేపారు. మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాతి ఏడాది అలెప్పో సిటీలో ఘర్షణలు పెరిగాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమించుకోగా నాలుగేళ్లు కష్టపడి సైన్యం తిరిగి స్వాధీనంచేసుకుంది. ఆ తర్వాత తూర్పు ఘాతాలో ప్రభుత్వం జరిపిన రసాయన ఆయుధ దాడిలో ఏకంగా వందలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. దీంతో ఐసిస్ ఉగ్రసంస్థ విజృంభించి రఖాను స్వాధీనం చేసుకుంది. 2019దాకా ఐసిస్ పట్టుకొనసాగింది. అయితే 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకున్నారు. అయితే 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా రంగ ప్రవేశం చేశాయి. 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ పలాయనం చిత్తగించక తప్పలేదు. అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 11 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు. అసద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్‌తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్‌ను నవంబర్ 15న హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు.


