breaking news
not effect
-
ఫిక్సింగ్ ఆరోపణల ప్రభావంపై ధోనీ
సాక్షి, చెన్నై : ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు చెన్నై సూపర్ కింగ్స్ పై ప్రభావం చూపబోవని టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు. సుమారు రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీం తిరిగి ఐపీఎల్లో ఆడబోతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎస్కే తరపున చెన్నైలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ధోనీ ప్రసంగించాడు. ‘‘సీఎస్కే జట్టులో తప్ప మరో ఫ్రాంఛైజీకి ఆడాలనే ఆలోచన నాకు ఎన్నడూ రాలేదు. చెన్నై నాకు మరో ఇల్లు. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఈ ఐపీఎల్ సీజన్లో సత్తా చాటి తీరతాం. ఫిక్సింగ్ ఆరోపణలు మా బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపించవు’’ అని ధోనీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు ఉన్నారని.. ఒకవేళ వేలంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చేజారితే కుర్రాళ్లతోనే ముందుకు వెళ్లేందుకు సిద్ధమని ధోనీ తెలిపాడు. కాగా, ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో లోథా కమిటీ నివేదిక ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు, రాజస్థాన్ రాయల్స్ లపై రెండేళ్ల పాటు బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. రజనీతో ధోనీ భేటీ...? చెన్నై పర్యటనలో భాగంగా ఎంఎస్‌ధోనీ.. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి 9గంటలకు పోయెస్ గార్డెన్‌లోని రజనీ ఇంటికి ధోనీ వెళ్లనున్నాడన్న వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. వీరిద్దరు సమావేశం కావటం ఖాయమనే మీడియా కథనాలు చెబుతున్నాయి. రజనీ రాజకీయ అరంగ్రేటం నేపథ్యంలో ధోనీ ఆయనకు అభినందనలు తెలియజేసే అవకాశం ఉందని ఆయా కథనాల సారాంశం. -
నక్సల్స్ ప్రభావం ఏమీ లేదు
టేకులపల్లి, న్యూస్‌లైన్ : గతంలో ఉన్నంతగా నక్సల్స్ ప్రభావం ప్రస్తుతం ఏమీ లేదని, ఏజెన్సీ, మైదాన ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు అన్నారు. మూడేళ్లకు ఒకసారి చేసే తనిఖీల్లో భాగంగా ఆదివారం ఆయన టేకులపల్లి సీఐ కార్యాలయన్ని తనిఖీ చేశారు. కానీ ఆరేళ్ల తర్వాత డీఐజీ ఇక్కడికి రావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇల్లెందు సబ్‌డివిజన్‌లో గతంలో ఉన్న పీపీజీ తదితర గ్రూపులన్నీ ఇప్పుడు లేవన్నారు. మోహన్‌తో సహా పలువురు మనుగడలో లేరని, న్యూడెమోక్రసీ రెండు గ్రూపులుగా విడిపోయాయని, వీటి వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా నక్సల్స్ జాడ కోసం నిఘా కొనసాగుతోందని అన్నారు. ప్రజలు వేరు, పోలీసులు వేరు కాదన్నారు. ప్రజల మాన, ప్రాణ రక్షణ కోసమే పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రజలతో మమేకమై వారితో సత్సంబంధాలను మెరుగుపర్చుకుంటూ సమాజ రక్షణలో పోలీసులు ముందుకు సాగుతున్నారని తెలిపారు. సమాజంలో పోలీసులు, ప్రజల సంబంధాలు, చట్టాలు, దురాచారాలు, మూఢ నమ్మకాలు, గుడుంబా తదితర వాటిపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని చైతన్య పరిచేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాబృందాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. గుడుంబా తయారీ, విక్రయం, నల్లబెల్లం విక్రయం జరిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలికలపై లైంగికదాడుల నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తున్నామని అన్నారు. బడి ఈడు పిల్లల్ని బడికి పంపకుండా పనికి పంపినా, వారిని పనిలో పెట్టుకున్నా శిక్షార్హులని అన్నారు. మద్యం దుకాణాల వద్ద నిర్వాహకులు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. విధిగా సీసీ కెమెరాలు అమర్చాలని, కౌంటర్ల వద్ద మద్యం సేవిస్తే చర్యలు తప్పవని అన్నారు. బెల్టు షాపుల విషయంలో ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు చేపడతామని హెచ్చరించారు. అక్రమ సారా, నల్లబెల్లం, బెల్టుషాపుల నివారణకు ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖ ఉందని వారు కోరినప్పుడు వారికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, దాడులు ముమ్మరం చేస్తామని తెలిపారు. యువత చెడు మార్గాలు పట్టకుండా ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకోవాలని, ఉచితంగా ఎఫ్ఐఆర్ అందజేయాలని తెలిపారు. సిబ్బంది క్వార్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. సమాజంలోని ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు 100, బాల బాలికల సమస్యలకు 1098 నెంబర్లకు డయల్ చేసి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ కె కృష్ణ, టేకులపల్లి, బయ్యారం సీఐలు రాజిరెడ్డి, జయపాల్, ట్రైనీ ఎస్సై సంజీవ్, ఏఎస్సై శంషుద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఆయనకు డీఎస్పీ, సీఐలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఐజీ ఏపీఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఉన్న సిబ్బంది క్వార్టర్లను, పరిసరాలను పరిశీలించారు. క్వార్టర్లలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఆవరణలో మొక్కలు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీరు, క్వార్టర్ల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్, క్వార్టర్లు, ఆవరణమంతా శుభ్రంగా ఉండాలని, మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. అనంతరం సీఐ కార్యాలయంలోని ఫైళ్ళను పరిశీలించారు. సీఐ విధుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.