breaking news
North Canal
-
మైలవరానికి ఆగిన గండికోట నీరు
మైలవరం: గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదలను నిలిపివేశారు. ఈ నెల 5 నుంచి 18 వరకు దాదాపు 0.728 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 0.935 టీఎంసీలు నిల్వ ఉంది. దక్షిణ కాలువకు జనవరి 27 నుంచి 80 క్యూసెక్కుల మేర నీరు విడుదల అవుతోంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల దాహార్తిని తీర్చుటకు నీటిని విడుదల చేస్తున్నారు. మైలవరం, వేపరాల, దొమ్మరనంద్యాల, మోరగుడి గ్రామాలకు ఉత్తర కాలువ ద్వారా పెన్నానది లోకి 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. -
మైలవరం జలాశయం ఉత్తర కాలువకు నీరు విడుదల
మైలవరం: మైలవరం జలాశయం ఉత్తర కాలువకు శుక్రవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండుతున్న పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు పైరుకు తగ్గట్టుగా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు ఫసల్ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జలాశయంలో 0.947 టీఎంసీల నీరుందని, అధికారుల ఆదేశాల మేరకు 7 రోజుల పాటు ఉత్తర కాలువకు నీరు విడుదల చేస్తామని ఏఈ గౌతమ్‌రెడ్డి తెలిపారు. రోజుకు 200 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఈ సుధాకర్, డీఈ రామాంజులు, టీబీహెచ్‌ఎల్‌సీ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరకాలువలో నీరు సజావుగా సాగేలా చూస్తాం
తెలుగుగంగ సీఈ సుధాకర్‌బాబు ఆత్మకూరురూరల్: ఉత్తరకాలువ 96వ ప్యాకేజీలో 70వ కిలోమీటరు వరకు 750 క్యూసెక్కుల నీరు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామని తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు అన్నారు. మండలంలోని వెన్నవాడ – ఆరవీడు మధ్య ఉత్తరకాలువను ఆయన గురువారం పరిశీలించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూటూరు మురళీకన్నబాబుతో కలిసి మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పరిధిలో ఉత్తర కాలువను పరిశీలించి నీటి పారుదలలో ఎదురయ్యే సమస్యలను వివరించారు. వెన్నవాడ, ఆరవీడు మధ్య సుమారు 5 కిలోమీటర్ల మేర భూస్వాభావం వల్ల నీటిని ముందుకుసాగని పరిస్థితి ఉందని పరిశీలించామన్నారు. ఈ ప్రాంతంలో కాలువ డిజైన్‌లోని లోపాలను సరిదిద్ది కాలువకు ఇరువైపులా రిటైనింగ్‌గోడలు కట్టి సాగునీరు సజావుగా సాగేలా చేస్తామన్నారు. దీనికిగాను ఎస్టిమేషన్లు, జరగాల్సిన పనుల గురించి నివేదిక అందచేయాలని ఈఈ, డీఈలను ఆదేశించారు. ఉత్తర కాలువ ద్వారా సోమశిల జలాలు ప్రస్తుతం ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, కలిగిరి, దగదర్తి వరకు సరఫరా అవుతుందన్నారు. కొత్తగా కొండాపురం మండలంతో పాటు రాళ్లపాడు ప్రాజెక్టుకు 1.20 లక్షల ఎకరాల సాగునీటికి సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 2017 సంవత్సరం చివరినాటికి పనులు పూర్తయ్యేలా చేస్తామన్నారు. ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టు వద్ద ఉత్తర కాలువకు 750 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే ఏఎస్‌పేట మండలం రాజవోలు వరకు కేవలం 200 క్యూసెక్కుల మేరకే వస్తున్నాయన్నారు. దీంతో కాలువ పరిధిలో పరిశీలించి లోపాలను గుర్తించామన్నారు. గుర్తించిన పనులు పూర్తి చేసిన అనంతరం విడుదలయ్యే 750 క్యూసెక్కుల నీరు రాజవోలు వరకు 460 క్యూసెక్కులు చేరేలా చర్యలు తీసుకునేలా పనులు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ దేశ్‌నాయక్, డీఈ ఎం.రవి, ఏఈలు, రైతులు పాల్గొన్నారు.