nmr
-
ఎన్‌ఎంఆర్‌పై వైద్యుల నిర్లిప్తత
సాక్షి, అమరావతి: దేశంలో అర్హులైన అల్లోపతిక్ (ఎంబీబీఎస్) వైద్యులకు యూనిక్ ఐడీ జారీ చేయడం కోసం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) గతేడాది నేషనల్ మెడికల్ రిజిస్టర్(ఎన్ఎంఆర్)ను ప్రారంభించింది. వైద్య విద్య చదివి ప్రాక్టీస్ చేసే వైద్యుల కచ్చితమైన వివరాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఎన్‌ఎంఆర్‌కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.ఎనిమిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఒక శాతం లోపు వైద్యులు మాత్రమే దేశ వ్యాప్తంగా రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి దేశంలో జాతీయ, రాష్ట్ర వైద్య మండళ్లలో రిజిస్టరైన మెడికల్ ప్రాక్టీషనర్లు 13 లక్షలపైగా ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకూ 10,411 మంది వైద్యులు మాత్రమే ఎన్‌ఎంఆర్‌లో రిజిస్టర్ చేసుకోగా, 10,237 మంది దరఖాస్తులు ఆమోదం పొందాయి. మిగిలిన దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఏపీ వైద్య మండలిలో 1.38 లక్షల మంది రిజిస్టర్డ్ వైద్యులు ఉన్నారు. 2016లో విభజిత ఏపీలో వైద్య మండలిలో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించగా ఇప్పటి వరకూ 40 వేల మంది వైద్యులు సభ్యత్వం పొందారు. వీరిలో ఇప్పటి వరకూ 500 మంది మాత్రమే ఎన్‌ఎంఆర్‌కు దరఖాస్తులు చేసుకున్నట్టు వెల్లడైంది.సంక్లిష్ట రిజిస్ట్రేషన్ ప్రక్రియతోనే తలనొప్పి ఎన్ఎంసీ రూపొందించిన ఎన్ఎంఆర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా ఉండటంతో తలనొప్పిగా మారిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎన్ఎంఆర్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వైద్యులు ఆధార్, ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా, జాతీయ/రాష్ట్ర స్థాయి వైద్య మండలి జారీ చేసిన గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వైద్యుడు సమర్పించిన పత్రాలను సంబంధిత వైద్య మండలికి పంపి ధ్రువీకరిస్తారు. దరఖాస్తులోని వివరాలు సరైనవా? కావా? అన్నది సంబంధిత వైద్య కాలేజీకి పంపి నిర్ధారిస్తారు. ఈ వివరాలన్నీ సరైనవని తేలిన అనంతరమే ‘ఎన్ఎంఆర్ ఐడీ’ జారీ అవుతుంది.ఒకసారి వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి సమర్పించిన అనంతరం తప్పు జరిగితే సవరించడానికి వీల్లేకుండా చేశారు. వైద్య మండళ్లు తమకు వచ్చిన దరఖాస్తుల్లో సవరణలు చేయడానికి వీలు కల్పించ లేదు. ఎన్ఎంసీ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలన సమయంలో సందేహాలు తలెత్తితే సంబంధిత వైద్యులను సంప్రదించడానికి ఫోన్ నంబర్/మెయిల్ ఐడీ వివరాలు వైద్య మండళ్లకు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా వ్యక్తిగత వివరాలు, వైద్య మండళ్ల పేర్లు ప్రస్తుత డేటాతో సరిపోలకపోతే వైద్యులు అఫిడవిట్‌ను సమర్పించాలనే నిబంధన పెట్టారు. ఈ సమస్యల వల్ల వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఉద్యోగం ఉంటుందా?!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఎన్‌ఎంఆర్‌లుగా చేరి ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా పదోన్నతి పొందిన వందలాది మంది ఉద్యోగులు ఇప్పుడు తమ ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. దేవాదాయ శాఖలో ఏళ్ల తరబడి ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్న తమను రెగ్యులరైజు చేయాలంటూ ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. అలాగే గతంలో ఎన్‌ఎంఆర్‌గా పనిచేసిన ఉద్యోగులను కొందరు అధికారులు ప్రభుత్వం అనుమతి లేకుండా రెగ్యులరైజు చేశారంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ పరిధిలో మొదట ఎన్‌ఎంఆర్‌గా చేరి ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా పదోన్నతి పొందిన వారి సర్వీసు రికార్డులను అత్యవసరంగా ప్రభుత్వానికి చేర్చాలంటూ మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి, తిరుపతిలోని దేవాదాయ శాఖ ఉప ప్రాంతీయ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు, అన్ని జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు తమ పరిధిలో ఉండే ఆలయాల్లో ఈ తరహా ఉద్యోగుల సర్వీసు రికార్డులను ప్రత్యేక సిబ్బంది ద్వారా అత్యవసరంగా అందజేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్ల కిత్రం రెగ్యులరైజు అయిన ఉద్యోగాల గురించి ప్రభుత్వం అత్యవసరంగా సమీక్షించాలని నిర్ణయించడంతో ఎందుకో అర్థంకాక ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికీ ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాల్సి వస్తుందని ప్రభుత్వం కోర్టు కేసులు సాకు చూపి తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోమోనని భయాందోళన చెందుతున్నారు. ఆరువేల మంది ఎన్‌ఎంఆర్‌లు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తూ ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులను రెగ్యులరైజు చేయడానికి 1994 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆధారంగా 2000 సంవత్సరంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేసే వారిని రెగ్యులరైజ్ చేయడానికి అనుమతి తెలుపుతూ అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2000–2004 మధ్య కాలంలో దాదాపు 800 మంది ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజు చేసినట్టు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి రాజకీయ పైరవీలతో కొనసాగాయని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2005లో ఈ తరహా నియమకాలకు అప్పటి ప్రభుత్వం బ్రేక్‌లు వేసింది. అయితే తమనూ రెగ్యులరైజు చేయాలంటూ ఏళ్ల తరబడి ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. అందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేకపోవడంతో, కోర్టు కేసులు సాకుగా చూపి గతంలో రెగ్యులరైజు చేసిన ఎన్ఎంఆర్ ఉద్యోగుల నియామకాలపై పునరాలోచన చేయాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో 20,839 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అర్చకులు పోను 9,727 మంది కార్యనిర్వాహక ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 3,316 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతుండగా, వీరిలో 800 మంది ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన వారని అధికారులు చెబుతున్నారు. మరో 6,411 మంది ఇప్పటికీ ఎన్ఎంఆర్లుగానూ, కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. -
‘మొక్కే’శారు?
- నర్సరీ నిర్వహణలో బట్టబయలైన అవినీతి బాగోతం! - ఉపాధి పనికి వెళ్లని వారి పేర్లతో ఎన్‌ఎంఆర్‌లు బర్లి (బలిజిపేట రూరల్): మండలంలోని మిర్తివలస వద్ద ఉన్న నర్సరీ నిర్వహణలో అవినీతి బాగోతం బట్టబయలయింది. ఉపాధి పనికి వెళ్లని వేతనదారుల పేర్లతో ఎన్‌ఎంఆర్‌లు తయారుచేసి నిధులు స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మిర్తివలస నర్సరీ వద్ద సుమారు రెండు సంవత్సరాల నుంచి మొక్కల పెంపకం చేపడుతున్నారు. 4లక్షల మొక్కలను పెంచేందుకు రంగం సిద్ధం చేసి దాని నిర్వహణకు ఉపాధి కూలీల చేత పనులు చేయించుకుని నిధులు డ్రాచేసి వారికి చెల్లింపులు చేస్తున్నారు. జూలై నెలలో 013170033 ఐడి నంబరుతో బర్లి గ్రామం నుంచి మూడు గ్రూపులకు చెందిన 53 మంది ఉపాధి కూలీలతో 6 రోజులు పనిచేయించినట్టు ఎన్ఎంఆర్ రాశారు. దీనికి సంబంధించి రూ. 47,412 నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ విషయం ఉపాధి కూలీలకు తెలియదు. దీనిలో నుంచి కలిశెట్టి యశోదమ్మ రూ.896 బర్లి పోస్టాఫీసు నుంచి డ్రా చేయడంతో డొంక కదిలింది. పనిచేయని వాటికి ఎలా నిధులు వచ్చాయని ఉపాధి కూలీలు పాలూరు సింహాచలం, అన్నపూర్ణ, కోట్ల చిన్నమ్మడు, రాంబార్కి గౌరి, బెజ్జిపురపు సూర్యనారాయణ, గంగమ్మ, తదితరులు జుత్తు పీక్కుంటున్నారు. దీనికి సంబంధించి ఉపాధిహామీ పథకం అధికారులు, సిబ్బంది, నర్సరీకి చెందిన వారి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనిచేయని దానికి నిధులు మంజూరవడంతో వేతనదారులు డబ్బులు తీసుకోలేదు. అయితే ఈవిధంగా ఎన్నిరకాల నిధులు దుర్విని యోగమవుతున్నాయోననే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పీఓ హరనాథ్‌ను వివరణ కోరగా ఎటువంటి పొరపాటు జరగలేదని తెలిపారు. పనిచేసిన వారి పేర్లే ఎన్‌ఎంఆర్‌లో ఉన్నాయన్నారు. -
వయసు మీరినా విధులు !
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో పలువురు ఎన్‌ఎంఆర్‌లు వయసు మీరినా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నారని అధికారులు ఆలస్యంగా తెలుసుకున్నారు. సుమారు 70 మందికి పైగా ఎన్‌ఎంఆర్‌లకు 60 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారిని విధుల నుంచి తొలగించాలని, వారి వేతనాలను నిలిపివేయాలని ఎన్ఎస్పీ చీఫ్ ఇంజనీర్ ఆదేశాల మేరకు సాగర్ పరిధిలోని ఐదు జిల్లాల ఎస్ఈలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ నెల 24 లోగా తమకు వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. ఎన్ఎంఆర్ల వయసు 60 సంవత్సరాలు దాటగానే వారిని విధుల నుంచి తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయసు మీరిన తర్వాత కూడా పనిచేస్తున్నారు. ఎన్‌ఎంఆర్‌లు గతంలో కోర్టుకు సమర్పించిన వయసు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా 60 ఏళ్లు దాటిన వారిని తొలగించే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. అసలేం జరిగిందంటే... ఎన్నెస్పీ పరిధిలో కాల్వలు తవ్వే సమయంలో ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట్ల కొందరు పనులు చేశారు. ఆ తర్వాత తమను ఎన్‌ఎంఆర్‌లుగా కొనసాగించాలని కోరుతూ వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం సుప్రింకోర్టుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో వారి వయసును కూడా పొందపరుస్తూ కోర్టుకు జాబితా సమర్పించారు. దీనిపై విచారించిన సుప్రింకోర్టు వారిని ఎన్‌ఎంఆర్‌లను కొనసాగించాలంటూ 1987 డిసెంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 600 మంది ఎన్‌ఎంఆర్‌లుగా పనులు చేస్తూ నెలకు రూ. 8 వేల నుంచి 10 వేల వరకు వేతనం పొందుతున్నారు. కాగా, వీరిలో కొందరు తమను రెగ్యులర్ చేయాలని మళ్లీ కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వ ప్రమేయం లేకుండానే అధికారులను పట్టుకొని రెగ్యులర్ చేయించున్నారు. సమాచార హక్కు చట్టంతో విషయం వెలుగులోకి... ఎన్నెస్పీలో వయసు మీరిన వారు ఎన్‌ఎంఆర్‌లుగా పని చేస్తున్నారని, వారిని తక్షణం తొలగించాలని, వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని మిర్యాలగూడెంకు చెందిన ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పుడు మేల్కొన్న ఎన్నెస్పీ అధికారులు వయసు పైబడిన వారిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టుకు సమర్పించిన జాబితాలో పొందపరిచిన వయసు వివరాలను మరుగున పెట్టిన పలువురు ఎన్‌ఎంఆర్‌లు.. రేషన్‌కార్డులు, ఓటర్ గుర్తింపు, ఆధార్ కార్డులలో నమోదైన వయస్సును చూపిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన జాబితాలో పేర్కొన్న వయస్సుకు, ఈ కార్డులలో ఉన్న వయస్సుకు నాలుగు, ఐదు సంవత్సరాల తేడా ఉంది. దీంతో ఎన్నెస్పీ ఉన్నతాధికారులు ఎన్‌ఎంఆర్‌లు కోర్టుకు సమర్పించిన వయసును పరిగణలోకి తీసుకుని, దాని ఆధారంగా 60 ఏళ్లు పైబడిన వారిని ఇంటికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తప్పుడు పత్రాలతో ఇప్పటి వరకు వేతనాలు తీసుకున్న వారిపై పోలీసు కేసులు పెట్టి అదనంగా పొందిన వేతనాలు రికవరీ చేస్తారా.. లేక శాఖాపరమైన విచారణ చేసి ఇందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కాగా, ఎన్ఎంఆర్లలో వయసు మీరిన వారితో పాటు పలువురు బినామీలు కూడా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారి పేరున ఇతరులు, ఒకరిపేరున మరొకరు కూడా విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు... తప్పుడు పత్రాలతో విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎంఆర్‌లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలుంటాయని ఒక అధికారి చెప్పారు. వేతనాలు రికవరీ చేయడమా.. పోలీస్ కేసులు పెట్టడమా అనేది ఉన్నతాధికారులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఖమ్మం మానిటరింగ్ పరిధిలో 30 మంది ఎన్‌ఎంఆర్‌లు ఉండగా, అందులో ముగ్గురు వయసు మీరిన వారు ఉన్నారని, వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు.