breaking news
nirmal bharath abhiyan
-
పాఠశాలలు మూస్తే పేదలకు చదువు కల్ల
విపక్షాల ఆగ్రహం బీజేపీ వాకౌట్ మంచిది కాదన్న కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విపక్షాలు శుక్రవారం అసెంబ్లీలో వ్యతిరేకించాయి. పాఠశాలలను బలోపేతం చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, అలా కాకుండా వాటిని మూసివేస్తే పేదలు విద్యకు నోచుకోరని ఆందోళన వ్యక్తం చేశాయి. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ వాకౌట్ చేయగా, కాంగ్రెస్ సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేయడం మంచిది కాదన్నారు. తక్కువమంది విద్యార్థులున్నారని ఉపాధ్యాయులను బదిలీ చేయడం, పదిమందే ఉన్నారని పాఠశాలలనే మూసివేస్తే భవిష్యత్‌లో మారుమూల ప్రాంతాల పేద విద్యార్థులకు చదువుకునే అవకాశమే ఉండదన్నారు. హేతుబద్ధీకరణను అమలు చేస్తే హైదరాబాద్‌లోనే 450 పాఠశాల లు మూతపడతాయన్నారు. రాష్ట్రంలో 15వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరో సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి పేర్కొనగా, కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకున్న మాదిరిగా, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకటి రెండు పాఠశాలలను దత్తత తీసుకుని వాటి అభివృద్దికి పాటుపడితే బాగుంటుందని జి.కిషన్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది ఉపాధ్యాయులులేరని ఎమ్మెల్యే డీకేఅరుణ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 200 మంది విద్యార్థులు ఉన్న చోట ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీచర్లులేక 272 పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. గ్రామీణ పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హేతుబద్ధీకరణ అంటే మూసివేయడం కాదు పాఠశాలల హేతుబద్ధీకరణ అంటే మూసివేయడం కాదని, విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియ మాత్రమేనని విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. పాఠశాలలను మూసివేయాలన్న ప్రతిపాదన లేనేలేదని, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిన తరువాతే హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంలో సభ్యులు ఆందోళన చెందనవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు లేనిచోట కిలోమీటర్ పరిధిలోనే ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడం జరుగుతుందని, హేతుబద్ధీకరణలో మిగిలిపోయిన ఉపాధ్యాయులను ఆదే మండలంలో ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల పాఠశాలలుంటే అందులో 2,100 స్కూళ్లల్లో విద్యార్థినుల కోసం మరుగుదొడ్లు లేవన్నారు. 4,600 స్కూళ్లలో మంచినీరు లేదన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో టాయిలెట్ వస్తుందనే కారణంతో విద్యార్థినులు మంచినీరు తాగడం లేదన్నారు. సామాజిక బాధ్యతగా నీటి వసతి నిర్మల్ భారత్ అభియాన్‌ను స్వచ్ఛభారత్ కార్యక్రమంగా కేంద్రం మార్పు చేసిందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. సామాజిక బాధ్యత కింద కొన్ని సంస్థలకు సర్కారీ బళ్లలో మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించే బాధ్యత అప్పగిస్తామని ఆయన తెలిపారు. వచ్చే వారంలోగా 70 సంస్థలకు 20 వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించే బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఆగస్టు నాటికి వీటిని పూర్తిచేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
‘మరుగు’న పడ్డాయి
మార్కాపురం, న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న నిర్మల్ భారత్ అభియాన్(వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం) ముందుకు సాగడం లేదు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో శ్రద్ధ చూపడం లేదు. నిధులున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన ప్రచారం లేకపోవడం, ఇచ్చే నిధుల కంటే నిర్మాణ వ్యయం ఎక్కువ కావడం, ఉపాధి హామీ పథకానికి లింక్ పెట్టి జాబ్‌కార్డు ఉంటేనే నిధులిస్తామని చెప్పడం, నిర్మించిన వాటికి నిధులు ఇవ్వకపోవడంతో పథకం అమలు అధ్వానంగా మారింది. కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులను పరుగులు పెట్టిస్తున్నప్పటికీ లక్ష్య సాధన కష్టమైంది. నిధులుండి కూడా లబ్ధిదారులకు సకాలంలో ఉపాధి హామీ సిబ్బంది నిధులు చెల్లించకపోవడంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పథకంలో నిర్మించుకునే మరుగుదొడ్డికి 10,200 కాగా, కేంద్రం 4,800, రాష్ట్ర ప్రభుత్వం 4,500, లబ్ధిదారుని వాటాగా 900 నిర్ణయించారు. తెల్లరేషన్ కార్డు ఉండి ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్నట్లయితే నగదును ప్రభుత్వం దశలవారీగా లబ్ధిదారునికి అందజేస్తుంది. వీటి బాధ్యతను ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకం సిబ్బందికి కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 30వ తేదీ నాటికి 56 మండలాల్లో 2,01,982 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా 62,225 పూర్తయ్యాయి. 50,432 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అర్ధవీడులో 3602కు గానూ 1422, బేస్తవారిపేటలో 4084కు గానూ 1568, దర్శిలో 5157కు గానూ 1423, దోర్నాలలో 4065కు గానూ 1235, గిద్దలూరులో 4012కు గానూ 1563, కొనకనమిట్లలో 5306కుగానూ 1060, మార్కాపురంలో 3529కు గానూ 1127, పెద్దారవీడులో 4483కుగానూ 1417, పొదిలిలో 4255కు 1425, పుల్లలచెరువులో 3576కు 1466, రాచర్లలో 2779కు 915, తర్లుపాడులో 3317కు 1027, యర్రగొండపాలెంలో 4729కి 1521 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. జిల్లా అధికారులు ఈ పథకాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో కలిపి కేంద్రం అమలు చేస్తున్న నిర్మల్ భారత్ అభియాన్ కింద నిధులను అందిస్తున్నారు. నిబంధనల ప్రకారమే ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి * 12,500 ఖర్చవుతుంది. నిర్మాణ వ్యయం ఎక్కువ కావడం, ప్రభుత్వం ఇచ్చే నిధులు తక్కువ కావడంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. గ్రామస్థాయికి వెళ్లి నిర్మాణంలో ఉన్న సమస్యలపై అధికారులు తెలుసుకోకుండా తమకు లక్ష్యాలు కేటాయించి ఎందుకు పూర్తి చేయలేదంటూ చిర్రుబుర్రులాడటంపై కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల నుంచి మార్కాపురం ప్రాంతంలో ఈ పథకం కింద నిర్మించుకున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మొదటి దశలో గుంత తీసినందుకు, రెండో దశలో రింగ్‌లు వేసినందుకు, ఆ తరువాత నిర్మాణం పూర్తి కాగానే లబ్ధిదారులకు నిధులు చెల్లిస్తారు. మొత్తం మీద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిదానంగా సాగుతోంది. పూర్తయినా బిల్లులు రాలేదు కాశీరత్తమ్మ, జమ్మనపల్లి, మార్కాపురం మండలం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుని రెండు నెలలైంది. బిల్లులు రాలేదు. అధికారులను అడిగితే ఇస్తామని చెబుతున్నారు. మా గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుని బిల్లులు రాని వారు సుమారు 20మంది వరకు ఉన్నారు. వెన్నా రమణారెడ్డి, బొర్రయ్యలు మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు రాలేదు. వారంలో చెల్లిస్తాం పోలప్ప, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపులో కొద్దిగా జాప్యం జరిగింది. పోస్టాఫీసు ఖాతాల ద్వారా లబ్ధిదారులకు వారం రోజుల్లో నిధులను చెల్లిస్తాం. పోస్టల్ అధికారులతో మాట్లాడాం. ఆందోళన చెందాల్సిన పని లేదు.