breaking news
new ideas
-
సంతోషం..సంపూర్ణ బలం
సంపాదనకు కొదవలేకున్నా, సరదాలెన్నో అందుబాటులో ఉన్నా సంతోషం మాత్రం అల్లంత దూరంలో అందీ అందనట్టు ఊరిస్తూనే ఉంది. మన దేశం హ్యాపీ‘లెస్’లో ముందుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని అనేక రకాల అనారోగ్యాలకు అంతుపట్టని మనోవ్యాధులకు ఇదే ప్రధాన కారణమని కూడా స్పష్టం చేస్తున్నాయి. హ్యాపీనెస్‌కి రానురానూ ప్రాధాన్యత పెరుగుతోంది. అదే క్రమంలో కొత్త సంవత్సరపు తీర్మానాల జాబితాలో సైతం సంతోషంగా జీవించడం ముందు వరుసలో చోటు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో సంతోషం గురించిన కొన్ని సంగతులు.. దేశాన్ని సంతోషభరిత దేశంగా మార్చడం కోసం ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా 2022లో మార్చి 20న హ్యాపీనెస్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించారు. అదేవిధంగా గుజరాత్ యూనివర్సిటీ ‘హ్యాపీనెస్ కౌన్సెలింగ్’ అనే కొత్త సరి్టఫికెట్ కోర్సును ప్రారంభించింది. వారాంతాల్లో నిర్వహించే ఈ మూణ్నెళ్ల కోర్సులో వేదాలు, ఉపనిషత్తుల బోధనలు, నృత్యం, సంగీతం, లాఫింగ్, ఆహారం ప్రసంగ చికిత్స ద్వారా ఒత్తిడిని నియంత్రించడంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్‌లోనూ ‘సంతోష మంత్రిత్వ శాఖ’ను ప్రకటించారు. జీడీపీ ద్వారా కాకుండా ఆనందాన్ని అంచనా వేయడం ద్వారా రాష్ట్ర పురోగతిని అంచనా చేయడం కోసం ఈ శాఖ పనిచేస్తుంది. ఆ తర్వాత ‘ఆధ్యాత్మిక శాఖ’ ఏర్పాటు చేసి, దానితో ఈ శాఖను విలీనం చేశారు. ఆ రాష్ట్రం హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వే సైతం నిర్వహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు ఈ అంశంపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ రామానుజన్ కాలేజ్, సెంటర్ ఆఫ్ ఎథిక్స్ అండ్ వర్చుస్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆరు నెలల కోర్సు అందిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ జుడీషియల్ అకాడమీలలో సంతోషకరమైన తరగతులను ప్రతిపాదించారు. ‘ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యుఎన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంయుక్తంగా విడుదల చేసిన 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో 143 దేశాలలో భారతదేశం 126వ స్థానంలో నిలిచింది.’ సంతోషం ఎందుకు కోల్పోతున్నాం? సాంకేతిక జీవనశైలి మార్పుల ప్రభావం లేదా సామాజిక నిబంధనల ఒత్తిడితో సమస్యలను ఎదుర్కోవడం వల్ల దేశంలోని 1.3 బిలియన్ల మంది ఏదో ఒక రకంగా బాధపడుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ఫలితాలను విశ్లేíÙస్తే అనుబంధలేమి.. ఆనందమేదీ? స్నేహితులు కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఆనందానికి బాటలు వేస్తాయి. అవే జీవితంలోని అసంతృప్తుల నుంచి మనల్ని రక్షిస్తాయి. వయసు రీత్యా వచ్చే మానసిక శారీరక క్షీణతను ఆలస్యం చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ పరిసరాలకు మార్పులు, న్యూక్లియర్ ఫ్యామిలీల వెల్లువ అనుబంధాల విచి్ఛన్నానికి కారణమయ్యాయి. చాలామంది కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండటం లేదు. వీరిలో చాలా తక్కువ మందికి మాత్రమే నిజమైన స్నేహితులున్నారు. పనివేళలు ముగిశాక సోషలైజేషన్ తగ్గిపోయింది. సామాజిక మాధ్యమాల వల్ల ఏకాంతం.. మన దేశంలోని వృద్ధులే యువత కంటే సంతోషంగా ఉన్నారని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వెల్లడించడం గమనార్హం. యువత ఆనందం కోసం సాంకేతికతపై అధికంగా ఆధారపడటం దీనికో కారణం. మన మెదడులో పుట్టే డోపమైన్(ఆనందం, సంతృప్తికి ప్రేరణ అందించే రసాయనం)ని సోషల్ మీడియా అల్గారిథమ్‌లు తాత్కాలికంగా ప్రేరేపిస్తాయి. అందుకే ఆన్లైన్లో గడిపే సమయం చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన భావోద్వేగ వికాసానికి బాటలు వేయదు. స్నేహితులతో ముఖాముఖి సంభాషణ ఇచ్చే సంతోషాన్ని, నిద్ర వల్ల కలిగే ఆనందాల్ని దూరం చేస్తుంది. యువతలో ఆందోళన.. యువతలో విజయం కోసం ఆకలి కొన్ని ప్రతికూల అంశాలతోనూ ముడిపడింది. ఏ విధంగానైనా సరే విజయం సాధించాలనే ఆతృత యువతలో ఆందోళనకు ఒత్తిడికి కారణమవుతోంది. వ్యక్తిగత లక్ష్యాలతో సామూహిక శ్రేయస్సు పట్ల ఆసక్తి పోయి స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య లోతైన సంబంధాలను కోల్పోవడం జరుగుతోంది ప్లస్.. మైండ్‌ఫుల్ నెస్.. ట్రాక్ యువర్ హ్యాపీనెస్ అనే ఐ ఫోన్ యాప్ ట్రాకర్‌ని ఉపయోగించి హార్వర్డ్ మనస్తత్వవేత్తలు మాథ్యూ కిల్లింగ్స్‌వర్త్ డేనియల్ గిల్బర్ట్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, మనం పనిచేసే గంటల్లో 47% ఏం జరగడం లేదు? అనే దాని గురించే ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిసరాలపై కాకుండా వేరే అంశాలపై ఆలోచిస్తున్నాం. ఈ తరహా పగటి డ్రీమింగ్ మనకు సంతోషాన్నివ్వదు. దీనికి మన సంప్రదాయ మార్గాలైన మైండ్ ఫుల్ నెస్ సాధన, మెడిటేషన్లలో పరిష్కారం లభిస్తుంది. కారణాలేవైనా.. సంతోషాన్వేషణ అయితే తప్పనిసరి అని తెలుస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సరారంభ వేళ.. సాక్షి పలువురు నిపుణులతో సంభాషించి.. సంతోషార్థుల కోసం పలు సూచనలను అందిస్తోంది.అంచనాలను మరచితేనే.. ఆనందం.. ఆనందం, దాని స్వచ్ఛమైన రూపంలో, బాహ్య పరిస్థితులపై ఆధారపడిన భావోద్వేగం కాదు. అంతర్గత సామరస్యం నుంచి ఉత్పన్నమయ్యే శాశ్వత స్థితి. నిజమైన ఆనందం కోరికల నుంచి విముక్తి పొందడం. దీని అర్థం ఆకాంక్షను కలిగి ఉండకూడదని లేదా అంకితభావంతో మన లక్ష్యాలను కొనసాగించక్కర్లేదని కాదు. మన కోరికలు, లక్ష్యాలు ఆకాంక్షలు ఉండటమే మనల్ని మనుషులుగా మారుస్తుంది. ఖచి్చతంగా లక్ష్యాల కోసం పని చేయండి. అయినప్పటికీ జరుగుతున్నది అంగీకరించి సంతోషంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆనందాన్ని కాపాడుకోగలిగేవారే అత్యంత సంతోషకరమైన వ్యక్తులు అని నా ఆధ్యాత్మిక గురువు షాజహాన్‌పూర్‌కి చెందిన శ్రీరామ్ చంద్ర అంటారు. మన అంచనాలను తగ్గించుకోవడం ద్వారా, కోరికల చక్రం నుంచి మనల్ని మనం విడిపించుకుంటాం. అంతర్గతంగా నిజమైన ప్రశాంతత కనుగొంటాం. ఇది అంతర్గత శాంతికి అనంతమైన ఆనందానికి దారి తీస్తుంది. ఈ మార్గంలో జీవించడానికి అత్యుత్తమ సాధనం ధ్యానం. – కమలేష్ పటేల్ (దాజి), హార్ట్‌ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ఆహారం.. ఆనందం.. జపనీస్ కల్చర్‌లో టీ సెర్మనీ అని ఉంటుంది. ఇది ఓ రకంగా టీ పార్టీ లాంటిది. ఇందులో పాల్గొన్న వారికి కప్స్‌లో కాకుండా బౌల్లో తేనీటిని ఇస్తారు. ఆ బౌల్ మీద విభిన్న రకాల జపనీస్ చిత్రాలు ఉంటాయి. టీ తాగేవారు చప్పుడు చేస్తూ తాగాలి.. ఆ బౌల్ మీద ఉన్న బొమ్మల్ని గుర్తించాలి. టీ రుచి గురించి మాట్లాడాలి. తయారు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ..ఇదంతా ఎందుకంటే.. ఆ మూమెంట్లో బతకడం అనేది అలవాటు కావాలని ఇలా చేస్తారు. బరువు తగ్గడం, పెరగడం, ఆరోగ్యం, అనారోగ్యం.. వీటన్నింటి చుట్టే మనం ఆలోచిస్తాం. కానీ ఆహారం అనేది అత్యంత భావోద్వేగ భరిత అంశం. సంస్కృతి సంప్రదాయాలతో మొదలుకుని అనేక రకాల అనుభూతులతో ఆహారం ముడిపడి ఉంటుంది. సంక్రాంతి సమయంలో అరిసెలు తినడం ఒక ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. అలాగే వినోదమైనా, విషాదమైనా వాటిలో విందులను భాగం చేయడం కూడా అలాంటిదే. ఆహారం అనేది మన మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది కాబట్టే. ఒక రుచికరమైన పదార్థాన్ని చూడగానే తినాలనిపించడం, నోట్లో నీళ్లూరడం, అవి నోటిలోకి వెళ్లగానే ఆ రుచికి మనలో కలిగే స్పందనలు.. ఇవన్నీ కూడా ఫుడ్ ఇంపాక్ట్‌కి నిదర్శనాలు. తినేటప్పుడు కరకరమని సౌండ్ వచ్చే పదార్థాలు మరింత ఎక్కువ సంతృప్తిని అందిస్తాయని, అందువల్లే చిప్స్ వంటివి ఎక్కువగా తింటామని ఒక అధ్యయనం చెబుతోంది. పాలు మరుగుతున్నప్పుడు వచ్చే వాసన కూడా బ్రెయిన్ కెమికల్ని యాక్టివేట్ చేస్తుంది. ఇక పండ్లలో యాంటిఆక్సిడెంట్స్ ఒత్తిడిని తొలగించి మనసు తేలికైన భావన అందిస్తాయి. – డా.జానకి, న్యూట్రిషనిస్ట్కన్నీరు పెట్టుకో.. కష్టాల్ని మర్చిపో.. కష్టాలు, సమస్యలు లేకుండా మనిషి జీవితం ఉండదు. అవి మర్చిపోవడానికి దేవుడు ఇచి్చన వరం కన్నీరు. ఏడ్చిన తర్వాత మనసు తేలిగ్గా ఉంటుంది. ఏడుపు.. ఆరోగ్యానికి మదుపు.. క్రైయింగ్ పలు ఆరోగ్యకర లాభాలను అందిస్తుందనేది శాస్త్రీయంగా రుజువైన విషయం. అయితే ఆధునిక సమాజంలో బాధ వచి్చనప్పుడు రకరకాల కారణాల వల్ల దుఃఖాన్ని దిగమింగుకోవడం జరుగుతోంది. ఇది మరింతగా ఆరోగ్యానికి హాని చేస్తోంది. దానికి బదులుగా కాసేపు మనసారా ఏడవనిస్తే మనసుకు చాలా నిశి్చంతగా తేలికగా అనిపిస్తుంది. అది మనల్ని బాధాకరమైన అనుభవం నుంచి దూరంగా తీసుకెళుతుంది. ఏడుపు వల్ల మనసు మాత్రమే కాదు కళ్లు, కన్నీటి వాహికలు సైతం శుభ్రపడతాయి. సాధారణ కంటి సమస్యలకు వాడే ఐడ్రాప్స్కి ఇది మేలైన ప్రత్యామ్నాయం అని చాలా మందికి తెలీదు. అందుకే మనకు బాధ కలిగించిన వాటిని గుర్తు చేసుకుంటూ కనీసం వారానికో కుదరకపోతే కనీసం నెలకు ఒకసారైన తనివిదీరా కళ్లమ్మట నీళ్లు పెట్టుకోవాలి. – కమలేష్, క్రైయింగ్ అండ్ లాఫర్స్ క్లబ్ నిర్వాహకులుఆరోగ్యమే.. ఆనందం.. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. ఆరోగ్యాన్ని మించిన ఆనందం లేదు. చిన్నపాటి, స్థిరమైన మార్పులు దీర్ఘకాలం పాటు సంతృప్తికరమైన సంతోషకర జీవితాన్ని గడిపేందుకు సహాయపడతాయి. కాలుష్యం విజృంభిస్తోంది. పురుగు మందులు వాయు కాలుష్య కారకాల వల్ల హానికరమైన పదార్థాలు శరీరంలో పేరుకుపోయి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. కాలుష్యానికి వీలున్నంత దూరంగా జీవించే ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలిక ఒత్తిడి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. ధ్యానం, యోగా లేదా శ్వాస సంబంధ వ్యాయామాలు వంటి ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలను దినచర్యలో చేర్చాలి. నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల అలసటకు అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్లాస్టిక్లు కొన్ని సౌందర్య సాధనాల్లో కనిపించే రసాయనాలు శరీర సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఊబకాయం, కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రాసెస్ చేయని ఆహారాలను గుర్తించి వదిలిపెట్టాలి. చక్కెర, అనారోగ్య కొవ్వులు అధికంగా ఉన్నవి తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులను భోజనంలో చేర్చాలి. రెగ్యులర్ వైద్య పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రంగా మారకముందే గుర్తించవచ్చు. తద్వారా జీవనశైలి ఆరోగ్య విధానాలపై సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. – డా.సమత తుల్ల, జనరల్ ఫిజిషియన్నవ్వు నలభై విధాల రైటు.. బాహ్యంగా మనం కోరుకున్నది దక్కినప్పుడు సంతోషం వస్తుంది. అయితే ఎప్పుడూ మనం కోరుకున్నది దక్కుతుందని గ్యారెంటీ లేదు కాబట్టి ఆ మార్గంలో దీర్ఘకాల సంతోషానికి గ్యారెంటీ లేదు. మరో మార్గం మన అంతర్గతంగా పొందేది. పాడటం, నృత్యం చేయడం, ఆడుకోవడం, నవ్వుకోవడం వంటి వాటి వల్ల మనకు అంతర్గత ఆనందం వస్తుంది. దీని ద్వారా సెరటోనిన్, ఆక్సిటోసిన్ వంటి కొన్ని రకాల హ్యాపీ కెమికల్స్ ఉత్పత్తి జరుగుతుంది. పరిస్థితులు సంతోషం కలిగించకపోయినా నవ్వడం ద్వారా మూడ్‌ని మార్చుకోవచ్చు. ఇక్కడ నవ్వును మనం ఒక వ్యాయామంలా భావించాలి. మరికొందరితో కలిసినప్పుడు సులభంగా నవ్వడం సాధ్యం. సహజంగా పుట్టే నవ్వు వల్ల కలిగే లాభాలకు, నవ్వాలని కోరుకుని నవ్వడం ద్వారా వచ్చే ఆరోగ్య ఫలితాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే మా లాఫ్టర్ యోగా.. ద్వారా వేల సంఖ్యలో సభ్యులు హాయిగా ఆనందంగా నవ్వుతున్నారు. – డాక్టర్ మదన్ కటారియా, లాఫ్టర్ యోగా విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు సంతోషం సహజ లక్షణం.. సంతోషం అనేది మన సహజ లక్షణం స్వాభావికం. కానీ రకరకాల ప్రభావాలతో దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. పసిపిల్లాడు.. 400సార్లు నవ్వుతాడు. కాస్త పెద్దయి రెండేళ్ల వయసుచ్చేసరికి 200 సార్లు నవ్వుతాడు. 16ఏళ్లు వచ్చేసరికి 16 సార్లే నవ్వుతాడని అధ్యయనాలు చెబుతున్నాయి. సంతోషం ప్రాణశక్తితో లింక్ అయి ఉంది. పిల్లల్లో ప్రాణశక్తి హైలెవల్లో ఉంటుంది. మన శ్వాస, భావోద్వేగాలకు సంబంధం ఉంది. మనం సంతోషంగా ఉంటే ఒక రకంగా శ్వాసిస్తాం. ఆగ్రహంగా ఉన్నప్పుడు మరో రకంగా శ్వాసిస్తాం. వీటి మధ్య వ్యత్యాసం పసిగడితే కోపం వల్ల కలిగే నష్టం అర్థమవుతుంది. అలాగే రేపేం జరుగుతుందో అనే ఆందోళనతో కాదు. ప్రస్తుతంతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలం. దీనికి సుదర్శన క్రియ బాగా దోహదం చేస్తుంది. విజయం కోసం మనం సంతోషాన్ని పణంగా పెడుతున్నాం. కానీ చెదరని చిరునవ్వుతో ఉండటమే నిజమైన విజయం. ఇలా జరిగితే హ్యాపీగా ఉంటాను, అలా జరిగితే హ్యాపీగా ఉంటాను అనే ఆలోచనలతో ఉండొద్దు. చిన్నారులు ఎందుకు సంతోషంగా ఉంటారు? వారికి సంతోషంగా ఉండడానికి కారణాలు అక్కర్లేదు కాబట్టి.. మన మనసు జరిగినదో, జరగబోయేదో.. దాని గురించే ఆలోచిస్తుంది. ప్రాణాయామ, సుదర్శన క్రియలతో సంతోషాన్ని పెంచుకోవడం వీలవుతుంది. – పండిట్ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులుఆనందం.. ఆక్సిజన్.. ఆనందం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. కాబట్టి ఎవరైనా సరే తమ సొంత జీవితాన్ని పరిశీలించి, ‘నా ఆనందం ఏమిటి, నా ఉద్దేశ్యం ఏమిటి, సామాజిక సేవ పట్ల నా ఆలోచన ఏమిటి? విశ్లేషించుకుని తన సొంత ఆనందాన్ని నిర్వచించుకోవాలి. మనం పని, డబ్బు సంపాదించే విధానం శారీరక మానసిక ఆరోగ్యం వీటి గురించే ఆలోచిస్తాం. అయితే మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం పనిలో మరింత మెరుగవుతామని ఉత్పాదకత పెంచగలుగుతామని సృజనాత్మకంగా ఉంటామని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి అన్నింటికన్నా ముందు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవాలి. ఒత్తిడి అనేది మన మొదటి సైలెంట్ కిల్లర్, సంతోషంగా ఉన్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తక్కువగా ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మంచి మూడ్‌లో ఉంటాం. ఇతరుల మాటలను వింటూ వారిని గౌరవిస్తాం. మంచి సంబంధాలు పెంచుకుంటాం. సంతోషంగా ఉన్నప్పుడు, పని మెరుగ్గా ఉంటుంది. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. – రాజేష్.కె.పిల్లానియా, ఇండియాస్ హ్యాపీనెస్ ప్రొఫెసర్ -
వేడి వేడి ప్రెషర్ కుకర్ ఉండగా... ఐరన్ బాక్స్ దండగా
‘లిమిటెడ్ రీసోర్స్ నుంచే కొత్త ఐడియాలు జనించునోయి’ అని మరోసారి చెప్పడానికి ఈ వైరల్ వీడియో క్లిప్ సాక్ష్యం. కోల్‌కతాకు చెందిన మౌమితా చక్రవర్తి వేడి వేడి ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించి షర్ట్‌ను ఐరన్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ట్విట్టర్లో రీపోస్ట్ చేసిన ఈ వీడియో రెండు లక్షల యాభై వేల వ్యూస్‌ను దాటింది. -
ఓయూలో ఐడియాలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్(ఉస్మానియా యూనివర్సిటీ): ఓయూ టెక్నాలజీ కాలేజీ (సాంకేతిక విద్య) వివిధ రకాల న్యూ ఐడియాలను (కొత్త ఆలోచనలు) ఆహ్వానిస్తోంది. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు మాట్లాడుతూ కొత్త ఆలోచణలు, ఆవిష్కరణల అభివృద్ధికి కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు తోడ్పడేలా ఎవరైనా ఎలాంటి ఐడియాలు ఉన్నా తమతో షేర్ చేసుకోవచ్చన్నారు. స్వీకరించిన ఐడియాలపై పరిశోధనలు జరిపి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్ది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడేలా చేస్తామన్నారు. దీనిపై 9959167505, 9849636589 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభత్వ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన ఐడియా హ్యాకథాన్‌కు ఓయూ టెక్నాలజీ కాలేజీ నుంచి 10 కొత్త ఐడియాలను పంపించామన్నారు. అందులో ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు, ప్రొ.తాటి జ్యోతి, పరిశోధక విద్యార్థి అభిలాష్ సమర్పించిన వ్యర్థ జలాల శుద్ధి, మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి తయారు అనే ఐడియాలు ఎంపికయ్యాయని వివరించారు. ఓయూ క్యాంపస్ టెక్నాలజీ కాలేజీలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో కొత్తగా బీఫార్మసీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు, టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సులో 30 నుంచి 60 సీట్లకు పెంచుతున్నట్లు ప్రిన్సిపాల్ సాయిలు వివరించారు. చదవండి: నా కళ్ల ముందే కొట్టుకుపోయాయి: రాజాసింగ్ -
ఇదొక మంచి అవకాశం.. క్రియేటివ్ ఐడియాకు రూ. లక్ష
హైదరాబాద్: కొత్త ఆలోచనలతో వ్యాపారాభివృద్ధికి బాటలు వేసే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించే దిశలో క్రియేటివ్ బిజినెస్ స్టార్టప్ ఐడియా పేరుతో స్టార్టప్ డెవలప్మెంట్ సెల్ రూ. లక్ష నగదు బహుమతితో పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు సీయో హబ్ వెబ్సైట్ లింక్‌లో తమ ఆలోచనలు, నైపుణ్యాలను షేర్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి సియో కార్పొరేట్ ఎండీ వంశీ కూరపాటి మాట్లాడుతూ... మహిళలు తమ ప్రతిభను చాటుకునేందుకు, నైపుణ్యాలను ఆవిష్కరించుకునేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీవోవో తనవి గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ఐడియాలు రావాలంటే చేతులు కడుక్కోవాలట!!
టోరంటో: తినేముందు చేతులు ఎందుకు కడుక్కోవాలి? శుభ్రంగా ఉండడానికి.. చేతులపై ఉండే క్రిములు తొలగిపోవడానికి కడుక్కోవాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొత్త ఆలోచనలు రావాలంటే చేతులు కడుక్కోవాలనే విషయం మీకు తెలుసా? శాస్త్రవేత్తలు మాత్రం ఇదే చెబుతున్నారు. చేతులు కడుక్కోవడం వల్ల మురికి తొలగిపోవడమే కాకుండా పాత ఆలోచనలు దూరమై, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయంటున్నారు. కెనడాకు చెందిన యూనివర్సిటి ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. చేతులు కడుక్కున్న వెంటనే పాత నిర్ణయాలను పక్కకునెట్టి కొత్త లక్ష్యాలకోసం మన మెదడు ఫ్రెష్‌గా ఆలోచిస్తుందంటున్నారు. పరిశోధనలో భాగం గా కొంతమందిని ఎంపికచేసి, వారికి ప్రేరేపణ కలిగించే నాలుగురకాల పరీక్షలను నిర్వహించారు. అంతకుముందు ఎంపికచేసిన వారిలో కొందరిని చేతులు కడుక్కోమని చెప్పా రు. అలా చేతులు కడుక్కున్నవారు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశారట. అందుకు కారణం.. వారిలో సానుకూల భావనలు పెరగడమేనని, అంతకు ముందున్న పాత ఆలోచనలు సమసిపోవడమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. -
అదృష్టానికి లైనేశాడు..
ఇలా లైన్లో ఉండే.. ఇతడు అదృష్టానికి లైనేశాడు. తద్వారా తన జీవితానికి కూడా ఓ లైన్ చూసుకున్నాడు. ఇతడి పేరు రాబర్ట్ శామ్యూల్. న్యూయార్క్‌లో ఉంటాడు. ఇతడికో కంపెనీ ఉంది. పేరు.. సోల్డ్. ఇందులో ఏడుగురు ఉద్యోగులున్నారు. త్వరలో మరో 15 మంది చేరబోతున్నారు కూడా. ఇంతకీ వీరందరూ చేసే పనేమిటో తెలుసా? లైన్లో నిల్చోవడం! నిజం.. అయితే, వీరి కోసం కాదు.. వేరేవారి కోసం నిల్చుంటారు. అమెరికాలో మార్కెట్లోకి వచ్చే ఖరీదైన కొత్త వస్తువులను(ఉదాహరణకు ఐఫోన్ కొత్త మోడళ్లు వంటివి) వెంటనే సొంతం చేసుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. అదే వీరికి కలిసొచ్చింది. ఇతడి కస్టమర్ల జాబితాలో కోటీశ్వరుల సంఖ్యే ఎక్కువ. వీరు ఏదైనా వస్తువు కోసం లైన్లో నిల్చోవడానికి తొలి గంటకు రూ.1,500 చార్జి చేస్తారు. తర్వాత ఒక్కో అరగంటకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ రాబర్ట్‌కు ఈ వినూత్నమైన ఐడియా ఎలాగొచ్చిందో తెలుసా? ఏడాది కిందట ఇతడి జాబ్ పోయింది. ఏం చేయాలో తెలియదు. ఆ సమయంలో ఐఫోన్-5 రిలీజ్ అవుతుందన్న వార్త. పక్క ఇంటి వ్యక్తి తన కోసం లైన్లో నిల్చుని, ఫోన్ తెస్తే.. రూ.6,000 ఇస్తానన్నాడు. ఏదో బాగానే ఉందనుకుని.. లైన్లో నిల్చున్నాడు. డబ్బు ఇస్తానన్న వ్యక్తి తర్వాత ఫోన్ అక్కర్లేదన్నాడు. దీంతో ఏం చేయాలో తోచలేదు. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి.. లైన్లో రాబర్ట్ ఉన్న ప్లేస్ తనకిస్తే.. డబ్బులిస్తానన్నాడు. అంతే.. అమ్మేశాడు. రెండుసార్లు లైన్ కట్టి.. మొత్తం రూ.20 వేలు సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన ఈ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది. లైన్లోకి వెళ్లేటప్పుడు అక్కడే పడుకోవడానికి వీలుగా స్లీపింగ్ బ్యాగ్ వంటివి తనతోపాటు తీసుకెళ్లిపోతాడు. ఇప్పటివరకూ ఐఫోన్-5 కోసం అత్యధికంగా 19 గంటలు లైన్లో వెయిట్ చేశాడట! -
అన్నదాతకు చేరువలో కొత్త వంగడాలు
వచ్చే ఏడాది మార్కెట్లోకి ఎంసీఎం 100, 101 పరిశీలనలో ఎంసీఎం 103 వ్యవసాయ విభాగం రీసెర్చ్ డెరైక్టర్ వెల్లడి అన్నదాతకు కొత్త వంగడాలు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం, విపత్తులను తట్టుకోవడం లక్ష్యంగా వీటిని తయారుచేశారు. ఎంసీఎం 100, 101 పేరిట రూపొందించిన ఈ వంగడాలను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. శుక్రవారం కరగ్రహారంలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని సందర్శించిన హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయ పరిశోధన క్షేత్రాలు నూతన వంగడాలను ఉత్పత్తి చేస్తున్నాయని హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి అన్నారు. మచిలీపట్నం కరగ్రహారంలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని గుంటూరు లాం ఫామ్ అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ ఇ.నారాయణతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. క్షేత్రంలో ఉన్న వసతులు, నూతన వంగడాలను తయారుచేసే విధానం తదితర అంశాలను పరిశీలించారు. కరగ్రహారంలో 19.50 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న వివిధ రకాల నూతన వంగడాలను, విత్తనశుద్ధి క్షేత్రాన్ని పరిశీలించి శాస్త్రవేత్తలకు పలు సూచనలు, సలహాలు అందించారు. మార్కెట్లోకి ఎంసీఎం 100, 101 వంగడాలు... హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఎంసీఎం 100, 101 రకం వరి వంగడాలను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రం సీనియర్ సైంటిస్ట్ టి.అనురాధ పరిశోధించి వీటిని తయారుచేశారు. ఎంసీఎం 100 రకం 145 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. దీనిని ఖరీఫ్ సీజన్లో సాగుచేసే వీలుంటుంది. ఎంసీఎం 101 రకం వరి వంగడం 125 రోజుల్లో కోతకు వస్తుంది. దీనిని రబీ సీజన్లో సాగు చేసే వీలుంటుంది. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో తయారైన ఎంసీఎం 103 రకం వరి వంగడాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇంకా నాలుగేళ్లు పడుతుంది. ఈ వంగడం ఇటీవల జరిగిన అంతర్జాతీయ పరిశోధన ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇది 140 రోజుల్లో కోతకు వస్తుంది. ఎంసీఎం 100 రకం వరి వంగడాన్ని ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో గత ఏడాది ఓ రైతు సాగు చేశారు. పదిరోజుల పాటు ఈ పైరు నీటిలోనే ఉన్నా ఎలాంటి పంట నష్టం వాటిల్లలేదని రుజువైంది. ఈ రకం వంగడాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, దీనికి మరింత సాంకేతికత జోడించి తుది మెరుగులు దిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాజారెడ్డి వెల్లడించారు. పరిశోధనలకు రూ.16.50 కోట్లు విడుదల... వ్యవసాయ పరిశోధనల నిమిత్తం గతంలో ప్రభుత్వం రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని రాజారెడ్డి చెప్పారు. తొలి విడతగా రూ.16.50 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఈ నిధులతో గుంటూరులో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నిర్మించామన్నారు. రూ.23 లక్షల వ్యయంతో గుంటూరు లాం ఫామ్‌లో పాలికార్బోనెట్ హౌస్‌ను ఏర్పాటు చేసి వివిధ రకాల పంటలపై పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. పరిశోధన క్షేత్రంలో సౌకర్యాలు కల్పించండి... మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో సాగునీటి సమస్య అధికంగా ఉందని, దీని నివారణ కోసం క్షేత్రంలో చెరువును తవ్వించేందుకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త టి.అనురాధ అధికారులను కోరారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో సిబ్బంది కొరత అధికంగా ఉందని, పనిచేస్తున్న వారంతా డెప్యుటేషన్ పైనే ఉన్నారని తెలిపారు. రెగ్యులర్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రాజారెడ్డి స్పందిస్తూ కావాల్సిన వసతులపై నివేదిక పంపితే పరిశీలించి నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో బ్రీడర్ దశలో ఉన్న ఎంసీఎం 103 సెమినార్‌ను ఆయన పరిశీలించారు.