breaking news
new facility
-
బీవోబీ ఏటీఎంలో యూపీఐతో విత్‌డ్రాయల్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తన కస్టమర్లకు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటరాపరేబుల్ క్యాష్ విత్‌డ్రాయల్ (ఐసీసీడబ్ల్యూ) సదుపాయం కింద.. యూపీఐ సాయంతో ఏటీఎంల నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చని (విత్‌డ్రాయల్) ప్రకటించింది. ఈ సేవలు ప్రారంభించిన మొదటి ప్రభుత్వరంగ బ్యాంక్‌గా బీవోబీ నిలిచిపోనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లతో పాటు, ఇతర భాగస్వామ్య బ్యాంకుల కస్టమర్లు.. భీమ్ యూపీఐ, బీవోబీ వరల్డ్ యూపీఐ లేదా మరేదైనా యూపీఐ ఆధారంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం నుంచి డబ్బులు (డెబిట్ కార్డు అవసరం లేకుండా) తీసుకోవచ్చని తెలిపింది. కస్టమర్లు ఏటీఎం యంత్రంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఎంత మొత్తం తీసుకోవాలో నమోదు చేయాలి. ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. కస్టమర్ తన ఫోన్లోని యూపీఐ యాప్ తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. తర్వాత యూపీఐ పిన్ను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి. దీంతో లావాదేవీ ప్రాసెస్ అయ్యి నగదు బయటకు వస్తుంది. ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలకు యూపీఐ ఉంటే, అప్పుడు విడిగా ఏదన్నది ఎంపికకు అవకాశం ఉంటుంది. ఒక్క లావాదేవీలో రూ.5,000 చొప్పున, రోజులో రెండు లావాదేవీలనే ఈ రూపంలో అనుమతిస్తారు. -
పాన్‌తో ఆధార్ అనుసంధానికి కొత్త లింక్
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ కొత్త వెసులుబాటును (ఇ-ఫెసిలిటీ) గురువారం ప్రారంభించింది. సంస్థ వెబ్ సైట్ లో https://incometaxindiaefiling.gov.in/ పేరుతో కొత్త లింక్‌ను లాంచ్ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ నెంబరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. పాన్ తో ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరింత సులభం చేస్తూ ఆదాయ పన్నుశాఖ ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ లో ఈ కొత్త లింక్‌ను పొందు పర్చింది. ఒక వ్యక్తి యొక్క రెండు ప్రత్యేక గుర్తింపులను (పాన్, ఆధార్ ) అనుసంధానించటానికి హోం పేజ్‌లో దీన్ని సృష్టించింది. అయితే పాన్, ఆధార్ లలో నమోదు చేసిన వివరాలు ఒకేలా ఉండాలని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. యుఐడిఎఐ (ఇండిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి వెరిఫికేషన్ తర్వాత, ఈ లింక్ ధృవీకరిస్తుందని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఐటీ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అవసరం లేకుండానే ఎవరైనా ఈ లింక్ ద్వారా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించుకోవచ్చని తెలిపింది. అలాగే పాన్, ఆధార్ కార్డులలో డేట్ ఆఫ్‌బర్త్, జెండర్ తదితర వివరాలు సరిపోలాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ(వన్‌టైం పాస్వర్డ్) లేదా ఈ మెయిల్ పంపుతామని చెప్పింది. ఆర్థిక చట్టం 2017 ప్రకారం ఐటీఆర్ దాఖలుకు ఆధార్ తప్పనిసరి. అలాగే పాన్ దరఖాస్తుకు ఆధార్ నెంబర్ తప్పనిసరి అనే నిబంధన 2017 జూలై నుంచి అమలుకానుంది.