breaking news
nationalwide strike
-
పండగ సీజన్లో గిగ్ వర్కర్ల షాక్ : 7 రోజుల జాతీయ సమ్మె
సాక్షి,ముంబై: జీతం, భద్రతా ప్రమాణాలు, సామాజిక భద్రత డిమాండ్లతో గిగ్ వర్కర్లు (gig workers) జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోని డెలివరీ పార్టనర్స్ డిసెంబర్ 25 నుంచి 31వ తేదీవరకు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. పని పరిస్థితులు, సామాజిక భద్రత పరిస్తితులు మరింత దిగజారుతున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా "10 నిమిషాల డెలివరీ" లాంటి వాటిని ఉపసంహరించుకోవాలనేది ముఖ్యమైన డిమాండ్.తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, కర్ణాటక యాప్ ఆధారిత వర్కర్స్ యూనియన్‌తో సహా , ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. మెట్రో, టైర్-2 నగరాల్లో డెలివరీ భాగస్వాములు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. భారతదేశం అంతటా డెలివరీ కార్మికులు అఖిల భారత సమ్మెను ప్రకటించినందున, క్రిస్మస్ రోజు (డిసెంబర్ 25),నూతన సంవత్సర వేడుకల (డిసెంబర్ 31) నాడు ఆన్లైన్ ఫుడ్, కిరాణా, ఇ-కామర్స్ డెలివరీలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.కంపెనీలు కార్మికులకు న్యాయమైన వేతనాలు, భద్రత, గౌరవం, సామాజిక భద్రతను కల్పించడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు, హై-రిస్క్ డెలివరీలు ముఖ్యంగా గరిష్ట డిమాండ్ సమయాల్లో, ప్రాథమిక కార్మిక రక్షణ వ్యవస్థ లేవని కార్మికులు ఆరోపిస్తున్నారు. పది నిమిషాల్లో డెలివరీ సర్వీసుతో కార్మికుల్లో ఒత్తిడి తీవ్రమవుతోందంటున్నారు. అంతేకాదు ఇది తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తుందని కార్మికులు చెబుతున్నారు. ఇతర డిమాండ్లలోయు పారదర్శకమైన ఆర్డర్‌కు చెల్లింపు, మెరుగైన ప్రోత్సాహక నిర్మాణాలు, తప్పనిసరి విశ్రాంతి విరామాలు, సహేతుకమైన పని గంటలు లాంటివి ఉన్నాయి. అదనపు డిమాండ్లలో మెరుగైన భద్రతా చర్యలు, బలమైన సాంకేతిక ,యాప్ మద్దతు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద కవరేజ్, పెన్షన్ ప్రయోజనాలు ,కార్యాలయంలో గౌరవప్రదమైన చికిత్స ఉన్నాయి. యూనియన్లలో చేరినందుకు లేదా పని సంబంధిత సమస్యలపై స్వరం పెంచినందుకు కొంతమందిని బ్లాక్మెయిల్, లేదా వేధిస్తున్నారని కూడా కార్మికులు ఆరోపించారు.అలాగే డెలివరీ ఐడిలను ఏకపక్షంగా బ్లాక్ చేయడం, అక్రమంగా విధించిన జరిమానాలను నిలిపివేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేశారు. సరైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు లేకపోవడం, రూటింగ్ మరియు చెల్లింపులను ప్రభావితం చేసే యాప్ లోపాలు మరియు అల్గారిథమ్ ఆధారిత వివక్ష కారణంగా అస్థిరమైన పని కేటాయింపుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, ఆయా ప్లాట్‌ఫామ్ కంపెనీలను నియంత్రించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, గిగ్ కార్మికులకు సామాజిక భద్రతా చట్రాలను అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. -
నేటి నుంచి లారీల బంద్
చిత్తూరు అర్బన్: సమస్యల పరిష్కారం కోరుతూ దేశ వ్యాప్తంగా శుక్రవారం నుంచి లారీల సమ్మెకు పిలుపునిచ్చారు. జిల్లాలోని లారీ యజమానులు ఈ సమ్మెకు మద్దతు పలికి బంద్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు జిల్లా సరిహద్దు కావడంతో గురువారం సాయంత్రం నుంచే ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలు జిల్లాలో ఆగిపోయాయి. డిమాండ్లు ఇవీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువగా నష్టపోతున్నది తెలుగు రాష్ట్రాల్లోని లారీ యజమానులేనని యూనియన్ నాయకులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమల్లోకి రావడం, సరుకుల రవాణకు ఇ–వే బిల్లు తప్పనిసరి చేయడం రవాణా రంగాన్ని కుదిపేసింది. ఫలితంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగంపై కేంద్ర ప్రభుత్వం సానుభూతి చూపకపోగా సమస్యను మరిం త జఠిలం చేస్తోందని లారీ యజమానుల సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ ఓ లారీ యజమానికి రెండో లారీ ఉంటే ఆదాయ పన్ను చట్టం 44వ సెక్షన్ కింద వసూ లు చేస్తున్న రూ.50 వేలను రద్దు చేయాలి. ♦ ఇప్పటివరకు థర్డ్ పార్టీ కింద లారీలకు రూ.15 వేలు చెల్లిస్తున్న బీమాను ఒక్కసారిగా రూ.50 వేలకు పెంచేశారు. దీన్ని రూ.15 వేలకే పరిమితం చేయాలి. ♦ కాలం చెల్లిన టోల్గేట్ ప్లాజాల దోపిడీని వెంటనే నిలిపేయాలి. రాజకీయ అండదండలతో జరుగుతున్న అనధికార దోపిడీని అడ్డుకోవాలి. ♦ ఇష్టానుసారం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడానికి వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ♦ జాతీయ పర్మిట్ ఉన్న సరుకుల రవాణా వాహనానికి ఇద్దరు డ్రైవర్లు పెట్టుకోవాలనే నిబంధనను రద్దు చేయాలి. ♦ రవాణా శాఖ, పోలీసులు, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు లంచాల కోసం చేస్తున్న దోపిడీని నిరోధించాలి. ప్రభావం ఇలా.. బంద్‌కు జిల్లాలోని మినీ లారీలు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు మద్దతు ప్రకటించారు. ఫలితంగా ఉన్నఫళంగా కూరగాయల ధరలు పెరిగిపోనున్నాయి. పెట్రోలు, డీజిల్‌కు కృత్రిమ కొరత ఏర్పడనుంది. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న మామిడి రైతులు లారీల సమ్మెతో పంటను అమ్ముకోలేని పరిస్థితి ఎదురై ధరలు మరింత పత నం కానున్నాయి. బెల్లం, గ్రానైట్, సిమెంటు, గ్యాస్, లాజిస్టిక్ సర్వీసులు (పార్శిల్) స్తంభించనున్నాయి. బంద్‌లో పాలు, నీళ్లు, నిత్యావసర వస్తువులకు మినహాయింపు ఇస్తున్నట్లు యూనియన్ నాయకులు చెబుతున్నారు. ఇక ఒక్కో లారీపై ప్ర త్యక్షంగా యజమాని, డ్రైవర్, క్లీనర్ కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. పరోక్షంగా హమాలీలు, వ్యాపారులు, తోపుడు బళ్ల వాళ్లు.. ఇలా వేలాది మంది ఉపాధి దెబ్బతినే అవకాశముంది. రోజుకు రూ.2 కోట్ల నష్టం.. జిల్లాలో లారీల బంద్ వల్ల రోజుకు రూ.2 కోట్ల నష్టం వస్తుంది. చాలామంది బతుకులు జరగవు. కానీ తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల మాతో పాటు డ్రైవర్, క్లీనర్ కుటుం బాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. మేము అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కావు. న్యాయమైనవని గుర్తించండి. ఒక్కసారి బంద్‌లోకి దిగాక దాని తర్వాత ఎదురయ్యే పరి ణామాలకు మేము బాధ్యులుకామని ప్రభుత్వాలు గుర్తించుకోవాలి. – టి.చెంగల్రాయనాయుడు, జిల్లాఉపాధ్యక్షులు, లారీ యజమానుల సంఘం -
అట్టుడుకుతోన్న ఫ్రాన్స్..
పారిస్: ఒకవైపు టీచర్లు, ఇంకోవైపు ట్యాక్సీ డ్రైవర్లు, మరోవైపు విమానాశ్రయ ఉద్యోగులు కలిసికట్టుగా చేస్తోన్న ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. ఆయా వర్గాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో మంగళవారం జనజీవనం అతలాకుతలమైంది. ట్యాక్సీ డ్రైవర్లు నిర్వహించిన నిరసన ప్రదర్శన చివరికి హింసకు దారితీసింది. ఎయిర్ ట్రాఫిక్ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగులుకూడా ఈ సమ్మెకు మద్దతు పలకడంతో పరిస్థితి మరింత దిగజారింది. విద్యారంగంలో వ్యవస్థాగత లోపాలను సవరించాలనే డిమాండ్ తో ఉపాధ్యాయులు సమ్మెకు దిగడంతో మంగళవారం పారిస్ లోని స్కూళ్లన్నీ మూతపడ్డాయి. యాప్ ఆధారిత అమెరికన్ క్యాబ్ సర్వీస్ ఉబెర్ సంస్థకు వ్యతిరేకంగా ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళనబాటపట్టారు. 'యూఎస్ ఉబెర్.. గో హోమ్' అంటూ డ్రైవర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగ సంబంధిత హక్కుల కోసం ఎయిర్ పోర్టులో పనిచేసే ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది నిరసనలకు దిగారు. ఈ మూడు రంగాలకు చెందిన యూనియన్ల నాయకులు మూకుమ్మడిగా దేశవ్యాప్త సమ్మెకు దిగారు. అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో హోలాండే నేతృత్వంలోని సోషలిస్టు సర్కారు తమ హక్కులను హరిస్తోందంటూ నినదించారు. వందలమంది ట్యాక్సీ డ్రైవర్లు ప్యారిస్ నగరంలోని పోర్ట్ మెయిల్టన్ నుంచి ఎనిమిది లేన్ల బైపాస్ రోడ్డు వరకు నిర్వహించతలపెట్టిన మార్చ్ ఉద్రిక్తతలకు దారితీసింది. హైవే పైకి వెళ్లనీయకుండా డ్రైవర్లను అడ్డుకునే క్రమంలో పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. పోలీసుల చర్యకు ఆగ్రహోదగ్రులైన ట్యాక్సీ డ్రైవర్లు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా కాసేపు నల్లటి పొగతో నిండిపోయింది. ఓర్లే ఎయిర్ పోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లోనూ ఒక ట్యాక్సీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును అడ్డుకునే క్రమంలో గాయపడ్డ అతడిని సహచరులు ఆసుపత్రిలో చేర్చారు. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది సమ్మెతో పారిస్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలుగు సర్వీసులను రద్దుచేసిన అధికారులు మరికొన్ని సర్వీసులను దారిమళ్లించారు. ఫ్రాన్స్ ట్యాక్సీ డ్రైవర్లకు మద్దతుగా పొరుగుదేశాలైన బెల్జియం, స్పెయిన్ కు చెందిన డ్రైవర్లు కూడా ఆందోళనల్లో పాల్గొనడం గమనార్హం. గణతంత్ర్యవేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ప్రాన్స్ అధ్యక్షుడు హోలాండే భారతకు వచ్చిన సంగతి తెలిసిందే.


