breaking news
Narasaraopet MP
-
‘మైనింగ్‌లో చంద్రబాబు, లోకేశ్‌కు వాటాలు’
సాక్షి, గుంటూరు : గురజాలలో పోలీసులు భయందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హౌస్ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ దాచేపల్లి, పిడుగురాళ్ల పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో సోమవారం వారిని హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురజాలలో నాలుగేళ్లుగా టీడీపీ నేతలు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగుతోందని, అన్యాయాలు బయటకు వస్తాయని శ్రీనివాసరావు బయపడుతున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే టీడీపీ ర్యాలీకి అనుమతిని ఇచ్చిన పోలీసులు, వైఎస్సార్సీపీ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధంగా అనుమతి కోరితే తిరస్కరించారని, పోలీసులు అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2009లో చనిపోయిన రైతుపై అక్రమ మైనింగ్ కేసు పెట్టారని, అమాయక ప్రజలపై కేసులు పెట్టి టీడీపీ నేతలు తప్పించుకుంటున్నారని మహేష్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోక్‌శ్‌కు వాటా అక్రమ మైనింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి వాటా ఉందని, నిజాలను ఎవరు అణచివేయలేరని నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆరోపించారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరగుతోందని, మైనింగ్‌లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే ఆయన బయపడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు పర్యటిస్తే వారి బండారం బయటడుతుందని తమ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఒక కూలీ 40 కోట్ల దోచుకున్నారంటే ఎవరు నమ్మలేరని అన్నారు. గతంలో కోడెల కుమారుడు నడిరోడ్డుపై సభ పెడితే అనుమతించారని, చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే తమకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆసుపత్రిపై ఆంక్షలు ఎమ్మెల్యే గోపిరెడ్డికి చెందిన ఆసుపత్రిని కూడా పోలీసులు నిర్భందించారు. పోలీసుల ఆంక్షలతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.. యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరగుతోందని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజనాకు గండికొడుతున్నారని ఆయన విమర్శించారు. దీనిపై పలుమార్లు ధర్నా కూడా నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తే ఇలా అక్రమాలు బయటకు వస్తాయని తెలిపారు. -
'ఒబామా నన్ను వైట్‌హౌస్‌కు పిలిచారు'
గుంటూరు: నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన నివాసం వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో రాయపాటి సాంబశివరావు... అగ్ర రాజ్య అధినేత ఒబామాను కలసి... తిరుపతి లడ్డూ ప్రసాదంతోపాటు ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువాను బహుకరించారు. అలాగే అపురూపమైన ముత్యాల హారాన్ని మిసెస్ ఒబామాకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఒబామా దంపతులు రాయపాటికి కృతజ్ఞతలు తెలిపారు. వైట్‌హౌస్‌కు వచ్చి... తమ ఆతిథ్యం అందుకోవాలని రాయపాటిని ఒబామా ఆహ్వానించారు. 2010లో భారత్‌లో పర్యటించిన ఒబామాకు బంగారంతో తయారు చేసిన అరుదైన రుద్రాక్ష హారాన్ని పార్లమెంట్లో రాయపాటి సాంబశివరావు బహుకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటీకీ ఆరుసార్లు అమెరికా వెళ్లానని... కానీ ఈ సారీ అమెరికా ప్రయాణం తనకు అత్యంత ప్రత్యేకమైందని రాయపాటి వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ రాయపాటి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
టీడీపీలోకి వస్తే ప్రాధాన్యమేదీ?
మంగళగిరి: గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లా కాజ గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కొందరు నేతలు తనతోపాటు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వీడిన తాము ప్రస్తుతం టీడీపీలో జూనియర్లమేనని, ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నామని చమత్కరించారు. తెలుగుదేశం పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఒక్కో ఎమ్మెల్యే వద్ద నాలుగైదు గ్రూపులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు ఇబ్బంది పడుతున్నారని రాయపాటి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవచేయాలే తప్ప గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించకూడదని ఆయన హితవు పలికారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని ఉంటుందన్నారు.