breaking news
nanoparticles
-
క్యాన్సర్ కణాలకు చెక్!
న్యూఢిల్లీ: మహమ్మారి క్యాన్సర్ కణాల అంతానికి నడుం బిగించిన భారతీయ శాస్త్రవేత్తల బృందం ఆ క్రతువులో విజయవంతమైంది. అతి సూక్ష్మ బంగారు, రాగి సలై్ఫడ్ రేణువులను శాస్త్రవేత్తలు సృష్టించారు. రోగి శరీరంలో క్యాన్సర్ సోకిన చోట ఈ రేణువులను ప్రవేశపెట్టి వీటిని ఫొటో థర్మల్, ఆక్సీకరణ ఒత్తిడికి గురిచేసినపుడు ఇవి క్యాన్సర్ కణాలను విజయవంతంగా వధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి చెందిన అధ్యయన బృందం సాధించిన ఈ ఘనత తాలూకు వివరాలు ఏసీఎస్ అప్లయిడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. గోల్డ్, కాపర్ సలై్ఫడ్ రేణువులు క్యాన్సర్ కణాలను అత్యంత సులభంగా గుర్తించగలవు కూడా. రేణువులను రోగమున్న చోట ప్రవేశపెట్టాక అక్కడ కాంతిని ప్రసరింపజేయాలి. కాంతిని శోషించుకున్న రేణువులు ఉష్ణాన్ని జనింపజేస్తాయి. వేడితోపాటే విషపూరిత స్వేచ్ఛాయుత ఆక్సిజన్ అణువులను ఇవి విడుదలచేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను ఖతంచేస్తాయి. గోల్డ్, కాపర్ సల్ఫైడ్ రేణువులు వ్యాధి నిర్ధారణ కారకాలుగా పనిచేస్తాయి. కాంతిని సంగ్రహించి అల్ట్రాసౌండ్ తరంగాలను విడుదలచేస్తాయి. దీంతో ఏ దిశలో ఎన్ని క్యాన్సర్ కణాలు ఉన్నాయో స్పష్టంగా తెల్సుకోవచ్చు. ఈ విధానం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ప్రక్రియను మరింత మెరుగుపరచనుంది. క్యాన్సర్ కణజాలం గుండా ఈ అ్రల్టాసౌండ్ తరంగాలు ప్రసరించినపుడు క్యాన్సర్ కణతులపై ఆక్సిజన్ ఆనవాళ్లు, వాటి ఆకృతులు అత్యంత స్పష్టంగా కనిపించనున్నాయి. గతంలో ఈ రేణవులను పెద్ద పరిమాణంలో తయారుచేయగా ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు ఈసారి అత్యంత సూక్ష్మ స్థాయిలో అంటే 8 నానోమీటర్ల పరిమాణంలో తయారుచేయగలిగారు. కాపర్ సలై్ఫడ్ ఉపరితలంపై అత్యంత సూక్ష్మమైన పుత్తడి రేణువులను చల్లి ఈ గోల్డ్, కాపర్ మిశ్రమధాతు రేణువులను సృష్టించారు. ఇవి ఇంత చిన్న పరిమాణంలో ఉండటంతో సులువుగా క్యాన్సర్ కణజాలంలోకి చొచ్చుకుపోగలవు. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కణాలపై ఈ రేణువులను ప్రయోగించి చక్కని ఫలితాలను సాధించారు. -
కృష్ణ పదార్థం అన్వేషణలో ముందడుగు
లండన్: విశ్వంలో మిస్టరీగా ఉన్న కృష్ణపదార్థం జాడను కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ఆంప్టన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త సూక్ష్మకణాన్ని ప్రతిపాదించారు. కృష్ణపదార్థం ఉనికిని ఈ ప్రాథమిక చీకటి కణంతో కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. నక్షత్రాలు, పాలపుంతలపై ఏర్పడే గురుత్వాకర్షణ బలానికి ఈ చీకటి పదార్థమే కారణమని శాస్త్రవేత్తల భావన. ఆధారాలు, ప్రయోగాత్మక విధానాల లేమితో ఎవరూ దీన్ని అధ్యయనం చేయలేకున్నారని వివరించారు. ఇతర భార అణువులు, ప్రాథ మిక కణాల కంటే కృష్ణపదార్థం కణాలు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ కణం ఎలక్ట్రాన్ కంటే తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండి, కాంతితో సంఘర్షణ జరపనందున కృష్ణపదార్థం కనుగొనేందుకు ఉపకరిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. మాక్రోస్కోపిక్ క్వాంటమ్ రెసోనేటర్స్ కన్సార్టియమ్ ఆధ్వర్యంలో కృష్ణపదార్థం జాడ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాన్ని చేయనున్నారు. ప్రతిపాదిత సూక్ష్మ కణాన్ని కృష్ణపదార్థం గుండా పంపించి దాని మార్గాన్ని పర్యవేక్షించి ఆ కణం స్థానాన్ని అంచనావేసి ఉనికిని కనుగొంటామన్నారు.