breaking news
nandikotkuru MLA
-
కర్నూలులో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో విషాదం అలుముకుంది. అల్లూరు పెద్ద కుంటలో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ముగ్గురు మృతులు విశాల్,శరత్,మహేష్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతదేహాలను గ్రామస్తులు కుంటలో నుంచి బయటకు తీశారు. విద్యార్థుల మృతదేహాలకు ఎమ్మెల్యే ఆర్థర్ నివాళులు అర్పించారు. చదవండి: తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ.. -
కరోనాపై అప్రమత్తం వహించండి
సాక్షి, కర్నూలు : నందికొట్కూరులోని మారుతీనగర్, బైరెడ్డి నగర్ కాలనీల్లో కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆర్థర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నందికొట్కూరులోని పలు కాలనీలను సందర్శించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. రెండు రోజులకొకసారి కాలనీలో బ్లీచింగ్ పౌడర్, హైపో ద్రవనంతో పిచికారీ చేయాలన్నారు. కాలనీలో పందుల బెడద ఎక్కువగా ఉందంటూ కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ వెంటనే పందులను తరలించాలని కమిషనర్ ను ఆదేశించారు. మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థర్ సూచించారు. -
జేసీకి ఎమ్మెల్యే సవాల్ : మాట్లాడదాం రా!
సాక్షి, కర్నూలు : పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట ఇంకోసారి మాట్లాడాలని సవాల్ విసిరారు. పోలీసులు లేకుండా బయటకు వెళ్లనేని నువ్వు, బూట్లు నాకిస్తానంటావా? అక్కడే ఉన్న చంద్రబాబు నవ్వుతూ పోలీసులను కించపరుస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక సాగవు అంటూ హెచ్చరించారు. ‘పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాజీ పోలీస్ అధికారిగా పోలీసులకు నేను సపోర్ట్ చేస్తున్న. అనంతపురంలో జేసీ, చంద్రబాబులపై వెంటనే కేసు నమోదు చేయాలి. జేసీ, నేను మాజీ పోలీస్‌గా సవాల్ చేస్తున్నా. రా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. పోలీసుల బూట్లు అంటే యుద్ధంలో ఆయుధాలు. వాటిని ముద్దాడుతాం. అహర్నిశలు చెమటోడ్చి సమాజం కోసం పనిచేస్తున్నది పోలీసులు మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. -
ముస్లింలపై బాబుకు సవతి ప్రేమ
నందికొట్కూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ముస్లింలపై సవతి ప్రేమ చూపుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. నందికొట్కూరు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఐజయ్య విలేకరులతో మాట్లాడారు. ముస్లింలపై అక్రమ కేసులు బనాయించి వారిని భయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లింలకు బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న నంద్యాల ఉప ఎన్నికలలో మసీదులలో ఉన్న ఇమామ్‌లకు జీతాలు ఇస్తాను అని హామీఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని గుర్తు చేశారు. సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు ముస్లింలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వారు భయపడరని, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ముస్లిం సోదరులను విడుదల చేసి కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నారా హమారా-టీడీపీ హమారా అనే కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీసు స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని స్థానిక సీఐకి వినతిపత్రం సమర్పించారు. -
చంద్రన్న ముందడుగు కాదు.. దళితుల వెనకడుగు
కర్నూలు : దళితులను ఏం ఉద్ధరించారని చంద్రన్న ముందడుగు అంటూ దళితవాడలకు వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. కర్నూలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య విలేకరులతో మాట్లాడారు. టీడీపీ చెబుతున్నట్టు అది చంద్రన్న ముందడుగు కాదు - దళితుల వెనకడుగు అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులు 20 ఏళ్లు వెనకబడ్డారని ఆరోపించారు. ఎవరైనా దళితులు పుట్టాలని కోరుకుంటారా అని గతంలో అవమానపర్చిన చంద్రబాబు నేడు దళితతేజం అనడం సిగ్గుచేటన్నారు. దళిత వ్యతిరేకతను నరనారాన జీర్ణించుకున్న చంద్రబాబు పాలనలో దళిత భక్షణ తప్ప దళితులకు రక్షణ లేదని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానించారు. దళిత సంక్షేమం కేవలం ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే సాధ్యం అయిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఆశయాలు వైఎస్సార్సీపీ మాత్రమే సాధించగలుగుతుందన్నారు. -
ప్రజల పక్షాన పోరాటం
ప్రజల కష్టాలను అమ్మలా అర్థం చేసుకుని.. తోబుట్టువులా తోడు నిలుస్తూ పార్టీలకు అతీతంగా తన వంతు సహాయం చేయడమే గౌరు చరితారెడ్డిని ప్రజాప్రతినిధిగా నిలబెట్టింది. సాధారణ గృహిణిగా ఉన్న ఆమె.. 2004లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో రాజకీయ రంగప్రవేశం చేసి నందికొట్కూరు ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఈమె స్వగ్రామం నందికొట్కూరు మండలంలోని కొణిదేల గ్రామం. భర్త గౌరు వెంకటరెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు సేకరించిన ఎమ్మెల్యేల్లో ఈమెది రెండో స్థానం. చరిత పనితీరుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పాణ్యం అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై గెలుపొందారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తనను ఆదరించిన ప్రజల పక్షాన ప్రభుత్వంపై అలుపెరుగని పోరుకు ఆమె సర్వసన్నద్ధమయ్యారు. ప్రజల కష్టాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ‘సాక్షి’ తరపున కర్నూలు శివారులోని వీకర్ సెక్షన్ కాలనీ, లెప్రసీ కాలనీల్లో పర్యటించి వీఐపీ రిపోర్టింగ్ చేశారు. చరితారెడ్డి : ఏమ్మా బాగున్నారా. మీ పేర్లేంటి? కాలనీలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? కాలనీవాసులు : నా పేరు జ్యోతి మేడం, నా పేరు రజియా.. మా రేషన్‌కార్డులు తొలగించారు. వ్యక్తి మరుగుదొడ్లు లేక.. మహిళలు బహిర్భూమికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి. చరితారెడ్డి : అమ్మా.. మీరు రెండు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. మీ రేషన్‌కార్డులు ఎందుకు తొలగించారనే విషయం పౌరసరఫరాల శాఖ అధికారులతో మాట్లాడుతా. ప్రతి ఇంటికీ వ్యక్తి మరుగుదొడ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటాను. ప్రభుత్వం రూ.12 వేలు మంజూరు చేస్తోంది. కాబట్టి అందరూ కట్టించుకోవాలి. చరితారెడ్డి : ఏమన్నా.. నీ సమస్య ఏమిటి? అంజి : నేను డ్రైవర్‌గా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంటికి వచ్చే సమయం ఏ అర్ధరాత్రో అవుతుంది. వీధిలో లైట్లు వెలగకపోవడంతో చీకటిగా ఉంటోంది. కుక్కల బెడద కూడా ఉంది. చరితారెడ్డి : అన్నా మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి ఇక్కడ వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తా. చరితారెడ్డి : అవ్వా బాగున్నావా? మీ పేరెంటి? నీకున్న సమస్యలు చెప్పు? వృద్ధురాలు : అమ్మా నా పేరు గొల్ల సుంకులమ్మ, నాకు, నా భర్తకు గతంలో రెండొందలు పింఛను వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. పింఛను వచ్చేలా చూడమ్మా.. నీకు పుణ్యముంటాది. బియ్యం కార్డు ఉన్నా డీలరు బియ్యం వేయడం లేదు. చరితారెడ్డి : అవ్వా, నీకు తాతకు ఎందుకు పింఛను తీసేశారో అధికారులను అడిగి తెలుసుకుంటా. మీరు నాకు దరఖాస్తు ఇవ్వండి.. కచ్చితంగా పింఛను వచ్చేలా చూస్తా. అలాగే మీ డీలరుతో మాట్లాడి బియ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తా. చరితారెడ్డి : అవ్వా పిల్లానికేమయింది? నాగమ్మ : వీడు నా మనుమడమ్మా. పుట్టుకతోనే నడువలేని పరిస్థితి. ఇప్పుడు వీడి వయస్సు ఆరేళ్లు. వీడికి ఏదైనా ఆదరవు చూపించమ్మా. చరితారెడ్డి : అధికారులతో మాట్లాడి వికాలంగుల పింఛను వచ్చే ఏర్పాటు చేస్తానవ్వా. చరితారెడ్డి : అయ్యా, కాలువ నీరు ఇలా పారుతోందేమిటిప్రసాద్ : మేడమ్, కాలనీపై నుంచి మురుగు నీరంతా దిగువకు వస్తోంది. ఉదయం పూట ఈ కాలువనీరు రోడ్డుపై పారుతోంది మేడమ్. చిన్న పిల్లలున్నారు. బయటకు పంపాలంటే భయమేస్తోంది. దోమలు బెడద కూడా ఎక్కువగా ఉంది. చరితారెడ్డి : కాలువ చిన్నది కావడం.. మురుగునీరు భారీగా వస్తుండడం వల్లే ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఎగువ నుంచి వచ్చే మురుగునీరు సామర్థ్యానికి తగినట్లు మురుగుకాలువలు మరమ్మతు చేయాల్సి ఉంది. మున్సిపల్ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా. చరితారెడ్డి : అన్నా మీ సమస్య ఏమిటి? ఈశ్వరయ్య : మేడమ్. మా అమ్మకు 79 ఏళ్లు. ఐదెకరాల పొలం ఉందని సాకు చూపి వస్తున్న పింఛన్‌ను తొలగించారు. మాకు ఎక్కడా సెంటు స్థలం కూడా లేదు. చరితారెడ్డి : అన్నా మీ బాధ నాకు అర్థమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అందరికీ ప్రతినెలా పింఛను అందేది. ఇప్పుడు ఒక్కరికి పింఛను ఇవ్వడం కోసం చంద్రబాబు నలుగురికి కోత పెడుతున్నారు. అయినా అధికారులతో మాట్లాడి, అవసరమైతే పోట్లాడైనా మీ అమ్మకు పింఛను వచ్చేలే చేస్తాను. చరితారెడ్డి: అమ్మాయిలూ.. మీ పేర్లేంటి? ఏమి చదువుతున్నారు? ఇబ్బందులేమన్నా ఉన్నాయా? విద్యార్థినిలు : మేడం.. మా పేర్లు ఆదిలక్ష్మీ, షేకూన్. ఇద్దరం కేవీఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ఇక్కడి నుంచి కళాశాలకు ఆటోలో వెళ్లలేకపోతున్నాం. ఆకతాయిలు ఎక్కి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయించండి. చరితారెడ్డి : కచ్చితంగా ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతా. ఇక్కడే కాలేజీ ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. ఆటోల్లో ఆకతాయిల బెడదపైనా పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటా. చరితారెడ్డి : ఏమయ్యా చిన్నరాజు బాగున్నావా.... చిన్నరాజు : అమ్మా మీ చలువ వల్ల బాగున్నా. మీ ద్వారా వికలాంగుల పింఛన్ పొందుతున్నాను. ట్రై సైకిల్ పాతదైంది. కొత్తది ఇప్పించే ఏర్పాటు చేయండి. రేషన్‌కార్డు కూడా ఇప్పించండి. చరితారెడ్డి : అలాగే అయ్యా.. రేషన్‌కార్డు, ట్రై సైకిల్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తా. మద్దయ్య : అమ్మా.. మురుగునీరు పెద్ద ఎత్తున వస్తోంది. కాలువలు చిన్నవి కావడంతో మురుగునీరు ఇళ్లలోకి వస్తోంది. దుర్వాసన భరించలేకపోతున్నాం. చరితారెడ్డి : నిజమే.. కాలువలు పెద్దగా నిర్మించాలి. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా. చరితారెడ్డి : అవ్వా బాగున్నావా? మీకేమైనా సమస్య ఉందా? సుబ్బమ్మ : అమ్మా.. మా కాలనీవాసులు ఇక్కడకు చెత్త తెచ్చి వేస్తున్నారు. బహిరంగ ప్రదేశం కావడంతో పందులు వచ్చి చెత్తాచెదారాన్ని చిందరవందర చేస్తున్నాయి. చెత్తకుండీ ఏర్పాటు చేయించండి. చరితారెడ్డి : అలాగే అవ్వా.. ఇక్కడ చెత్తకుండీ ఏర్పాటు చేయిస్తాను. చరితారెడ్డి : ఆదర్శ(లెప్రసీ) కాలనీ బాగుందా... పాపయ్యా. పాపయ్య : కాలనీలో తాగునీటి సౌకర్యం లేదమ్మా. పక్క వీధుల్లో కుళాయిలకు నీళ్లు వచ్చినప్పుడు... అదీ ఇతరులెవరూ లేనప్పుడు మాత్రమే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందమ్మా. 8 మందికి వేలి ముద్రలు సరిగా లేవని పింఛన్లు ఇవ్వట్లేదమ్మా... కాళ్లు, చేతులు కుచించుకుపోయాయి. చరితారెడ్డి : మీరన్నది నిజమే. దివంగత నేత వైఎస్సార్ ఉన్నప్పుడే అందరికీ పింఛన్లు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా మీ అందరికీ పింఛన్ల వచ్చేలా కృషి చేస్తాను. చరితారెడ్డి : మీ సమస్య ఏంటి బాబు? రవికుమార్ : మేడమ్, శ్మశాన వాటికకు స్థలం లేదు. కాలనీలో 15 సెంట్ల స్థలం మాత్రమే ఉంది. ఈ కాలనీలో ఎవరు చనిపోయినా అందులోనే గుంతలు తవ్వి పూడుస్తున్నాం. దయచేసి మరికొంత స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయించండి. చరితారెడ్డి : అధికారులతో మాట్లాడి శ్మాశన వాటికకు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా చూస్తాను. చరితారెడ్డి : చౌక దుకాణాల్లో సరుకులు సరిగా ఇస్తున్నారా? ఆంజనేయులు: సరుకులు సరిగా ఇవ్వడం లేదు. ఇక్కడ చౌక దుకాణ డీలరును తొలగించడంతో ఇతర దుకాణానికి సరుకులు కేటాయించారు. ఆ దుకాణం కాలనీకి చాలా దూరంగా ఉంది. చరితారెడ్డి : ఇక్కడే డీలరు ఉండేలా చర్యలు తీసుకుంటాను.